twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేస్త్రి చిరంజీవి, కూలి దాసరి(రివ్యూ)

    By Staff
    |
    Rating Stars
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్: సిరీ మీడియా
    నటీనటులు: దాసరి, మోహన్ బాబు, శ్రీహరి, సుజిత, విజయ్ కుమార్,
    చంద్రమేహన్, షాయాజి షిండే, రాహుల్ దేవ్,
    ప్రదీప్ రావత్, ఎమ్.ఎస్, గిరిబాబు తదితరులు
    సంగితం: వందేమాతరం శ్రీనివాస్
    కెమెరా: సి.హెచ్ .రామరాజు
    ఎడిటింగ్: గౌతంరాజు
    ఆర్ట్: బి.వి.రావు
    కథ,స్క్రీన్ ప్లే: దాసరి
    దర్శకత్వం: సురేష్ కృష్ణ
    నిర్మాత: కె.రామకృష్ణ ప్రసాద్
    రిలీజ్ డేట్ : 12/03/2009

    షకీలా రోడ్ షో పెట్టినా చాలామంది చూడ్డానికి వస్తారు..పెద్దవాళ్ళ ఫొటోలు పెట్టుకుంటే మాత్రాన నువ్వేమి పెద్దవాడివి కాదు..వంటి సెటైర్స్ తో దాసరి మేస్త్రి వచ్చింది.మేస్త్రి సినిమాలో చిరంజీవి ప్రజారాజ్యంపై సెటైర్స్ ఉన్నాయట కదా అనే ఒకే ఒక్క ఆసక్తి జనాల్ని కొద్దిలో కొద్ది ధియోటర్స్ వైపు లాగిందన్నది నిజం. అయితే దాసరి ముఖ్యమైన ఈ విషయం ప్రక్కన పెట్టి పస్టాఫ్ అంతా పాతకాలం డ్రామాతో నింపేసారు. ఆ తర్వాత పూర్తి స్ధాయి విసుగుకు వచ్చి లేచిపోదామని ప్రేక్షకుడు నిర్ణయించుకున్న తర్వాత ఆ సెటైర్స్ బాణం తీసి ప్రయోగించారు. మరో ప్రక్క మోహన్ బాబు,శ్రీహరి వంటి వారికి సైతం సరైన పాత్రలు ఇవ్వక,తన చుట్టూ కథ తిప్పుకుని వారి అభిమానులను సైతం నిరాశపర్చాడు. అలాగే దర్శకుడు సురేష్ కృష్ణ సైతం పాతకాలం టేకింగ్ ని తీసుకొచ్చి,పాత కాలం కథకు న్యాయం చేసాడు. పూర్తి రాజకీయ వ్యంగ్యం గానూ లేక,రెగ్యులర్ మశాలా చిత్రంగానూ మిగలక,రెండుగంటల సేపు దాసరి షో గా మిగిలింది చిత్రం. ఇక చిరుపై వేసిన సెటైర్స్ బయిటకు వచ్చి పాపులర్ అయితే కలెక్షన్స్ పై ఆశపెట్టుకోవచ్చు.

    పాలకొల్లు(దాసరి)వైజాగ్ షిప్ యార్డ్ లో కూలీగా జాయిన్ అవుతాడు. అక్కడ వర్కర్స్ కి సంభందించిన భూమి కబ్జా కావటంతో సినిమాటిక్ గా పోరాడుతూ వారి నాయుకుడుగా( మేస్త్రి) అందరి మన్ననలూ సంపాదిస్తాడు. ఆ తర్వాత ఓ రెండు పాటలు పూర్తి చేసుకుని అక్కడి కాంట్రాక్టర్స్ సుబ్బరాజు(ప్రదీప్ రావత్),ఆదిరాజు(షాయాజి షిండే)లతో తలపడతాడు. సుబ్బరాజుని చంపేసి తన ఐడెండిటీ మేజర్ నరసింహం అని బయిటపెట్టుకుంటాడు.తాను గాంధేయవాది గోపాలకృష్ణ(విజయ్ కుమార్) కోసం వచ్చానంటాడు. ఈలోగా దాసరిని చూసి ఆదిరాజు వణికిపోతాడు. ఇంతకీ ఈ మేజర్ ఎవరు..అతని గతం ఏమిటి..ఇంతకీ మోహన్ బాబు,శ్రీహరి పాత్రలు ఏమిటి,చిరుపై సెటైర్స్ ఎక్కడ వేసారు వంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

    ఇక బాషా వంటి సూపర్ హిట్ తో తెలుగు తెరకు ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ నేర్పిన సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని చిరకాల విరామం తర్వాత డైరక్ట్ చేయటంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.అయితే ఈ చిత్రంలోనూ అదే నేరేషన్ ని ఫాలో అవటంతో లేనిపోని కన్ఫూజన్ ఏర్పడిపోయింది.అలాగే ఎక్కడో సెకండాఫ్ లో సగం దాకా విలన్ ఎవరో తెలియకుండా కథనం నడుపుతాడు . దాంతో విలన్ కి ప్రధాన పాత్ర దాసరి కీ మధ్య జరగాల్సిన డ్రామాకి ప్లేస్ లేకుండా పోయింది. అందులోనూ సినిమాలో ప్రతీ పదినిముషాలకోసారి ప్రక్కకు వెళ్ళి చిరుపై సెటైర్స్ ,ఓటు తప్పని సరిగా వెయ్యాలంటూ పాటో,రోడ్ షో లపై విమర్శలో కథకు సంభందం లేకుండా వస్తూండటం మరో చికాకు కల్గించే అంశం.

    ఇవన్నీ ఇలా ఉంటే ఇంతకీ చిరుపై సెటైర్స్ ఎక్కడ వేసారన్నది మరో ఆసక్తి కర అంశం. విజయ్ కుమార్ పాత్ర ఓ గాంధీయవాధి..ఓ సెలబ్రేటి..అతనో కొత్త పార్టీ పెడతాడు. వారి ఎజెండా అందరికీ సామాజిక న్యాయం అని ప్రకటిస్తారు. అప్పుడు విలేఖర్లు సామాజిక న్యాయం అంటే ఏమిటీ అని అడుగుతారు. దానికి విజయ్ కుమార్..మేధావులను చర్చకు వేశాం చెప్తాం..అంటూ సమాధానం చెప్తూ నసుగుతాడు. అలాగే మహానుభావులు ఫోటోలు వెనకాల పెట్టుకున్నంత మాత్రాన మనం మహానుభావులం అవుతామా..పెంచుకునే కుక్కకి టైగర్ అనే పేరు పెట్టినంత మాత్రాన కుక్క పులి అవుతుందా అని విమర్శలు చేసారు. అలాగే ఓ చోట విజయ్ కుమార్ పాత్రను మీడియా వ్యక్తులు మీ పార్టీ వారు సీట్ కి కోటిరూపాయలు చొప్పున తీసుకుంటున్నారట కదా అని అడుగుతారు.

    దానికి ప్రక్కనున్న షాయేజి షిండే..ఈ విలేఖర్లు సరిగ్గా ఏమీ తెలుసుకోరు..ఎమ్మల్యేకి ఐదు కోట్లు,ఎంపికి మూడు కోట్లు తీసుకుంటున్నాం అంటాడు. అలాగే మరో చోట విజయ్ కుమార్ ని పార్టీ ప్రతినిధులు(అభిమానులు) కొందరు ఏంటి సీట్లు అన్నీ రియల్ ఎస్టేట్ వారికీ, గూండాలకి, వెధవలకీ ఇచ్చారంటూ నిలదీస్తారు. దానికి విజయ్ కుమార్..మనం పార్టీ పెట్టిందే డబ్బు కోసం అన్నట్లు చెబుతూ మీ నెత్తి మీద రూపాయి పెడితే పావలా కి కూడా ఎరవూ కొనరు..మీమీద నాలుగైదు కోట్లు ఖర్చుపెట్టి గెలిపించుకోవాల్సిన పని ఏముంది అంటాడు. అప్పుడు వాళ్ళు ఇన్నాళ్లూ మీ వెనక ఉన్నాం అంటే..దానికి నేను గొప్పవాడ్ని అయ్యాక మీరంతా చేరారంటూ హేళన చేసి గెంటించేస్తాడు.అలాగే విజయ్ కుమార్ చేత మరో చోట నా వెనుక కుల బలం ఉందంటూ చెప్పించారు.

    అంతేగాక ఓ వికలాంగుడు పాత్రను పెట్టి అతని చేతే పార్టీ ఓపినింగ్ రోజున జై కొట్టించుకుని ఆ తర్వత తరిమేస్తాడు. ఆ తర్వాత ఆ వికలాంగుడే విజయ్ కుమార్ హత్య చేస్తాడు. ఈ సన్నివేశాల్లో వికలాంగుడుని చూస్తుంటే..ప్రజారాజ్యం పార్టీ ప్రారంభంలో వికలాంగుడు కు పార్టీ సభ్యత్వం ఇవ్వటం అందరికీ గుర్తు రావటం ఖాయం. వీటన్నిటికీ తోడు రోడ్ షో లపై సెటైర్ చేస్తూ..అభిమానులు సినీ హీరోల మోజులో పడి తమ జీవితం నాశనం చేసుకుంటున్నారంటూ పాట సైతం పెట్టారు. ఇక మొదట ఈ సినిమాలో పాత్రలు ఎవరినీ పోలి ఉండవని, పోలిక తేవద్దని చెప్తూ ప్రారంభించారు. అయితే సినిమాలో చాలా సెటైర్స్ చిరు పార్టీనే ఉద్దేశించి పెట్టారని సామాన్య ప్రేక్షకుడుకి సైతం అర్ధమవుతాయి.

    ఉన్నంతలో ధర్మవరపు సుబ్రమణ్యం బాగా చేసారు. మోహన్ బాబు పెదరాయుడు గెటప్ మళ్ళి చూపించారు కానీ దళిత నాయుకుడుగా అతని పాత్రకు మొదలు,ముగింపు లేదు. శ్రీహరి ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా చెత్తగా ఉంటుంది. ఇక డైలాగులు అక్కడక్కడా పేలాయి కానీ ఈ చిత్రానికి మరింత షార్పుగా ఉండలన్నది సుస్పష్టం. కెమెరా,ఎడిటింగ్,సురేష్ కృష్ణ గత చిత్రాల రేంజిలో లేవు. అయినా ఈ చిత్రం దాసరే స్వయంగా డైరక్ట్ చేసారేమో అనే సందేహం కొన్ని సందర్భాల్లో కలుగుతూంటుంది.

    ఇక ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే రాకరాక వచ్చిన రాజకీయ వ్యంగ్య చిత్రం(పూర్తిగా కాదు) అనే ఆసక్తితో చూడాలి. అలాగే దాసరి ఇంతకీ ఏ సెటైర్స్ చిరుపై సంధించారో అనే ఆసక్తి తో వెళితే కొంతలో కొంత బెటర్ .లేకుంటే ఏదో దాసరి రాములమ్మ చిత్రాన్ని గుర్తు చేసుకునో బయిలుదేరితే మాత్రం పూర్తి స్ధాయి నిరాశే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X