Mr Bachchan Review మిస్టర్ బచ్చన్ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.25/5
మూవీ: మిస్టర్ బచ్చన్
నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ భోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర, తనికెళ్ల భరణి, అన్నపూర్ణమ్మ, ప్రభాస్ శ్రీను తదితరులు
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభోట్ల
మ్యూజిక్: మికీ జే మేయర్
సినిమాటోగ్రఫి: అయనంకా బోస్
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్: 2024-08-15
మిస్టర్ బచ్చన్ అలియాస్ ఆనంద్ (రవితేజ) నిజాయితీతో కూడిన పవర్‌ఫుల్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అక్రమంగా సంపాదించిన వ్యక్తుల నుంచి నల్లధనం వెలికి తీయడంలో దిట్ట. తన గ్రామంలోని మార్వాడి కులానికి చెందిన జిక్కి (భాగ్యశ్రీ బోర్సె)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. ఆ ప్రాంత రాజకీయాలన్నీ ఎంపీ జగ్గయ్య (జగపతి బాబు) కనుసన్నల్లోనే జరుగుతాయి. తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బచ్చన్ కోసం జగ్గయ్య వెతుకుతుంటాడు. ఆ క్రమంలో జగ్గయ్య ఇంటిపై ఏకంగా బచ్చన్ ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్‌కు తన టీమ్‌తో వస్తాడు.

ఆనంద్ పేరు మిస్టర్ బచ్చన్‌గా ఎలా మారింది? ఆదాయపు పన్ను శాఖ దాడులను బచ్చన్ ఎలా నిర్వర్తించాడు? బచ్చన్‌పై అధికారులు ఎందుకు సస్పెన్షన్ విధించారు? జిక్కితో బచ్చన్ ప్రేమలో ఎలా పడ్డాడు? వారిద్దరి ప్రేమ ఎలా పెళ్లి వరకు వెళ్లింది? జగ్గయ్య ఇంటిలో ఐటీ రైడ్ సమయంలో ఎలాంటి డ్రామా కొనసాగింది? ఎంపీ జగ్గయ్య ఎత్తులకు బచ్చన్ ఎలాంటి పైఎత్తులు వేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ బచ్చన్ సినిమా కథ.
మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే.. హిందీలో అజయ్ దేవగన్‌కు మంచి హిట్ ఇచ్చిన రైడ్ అనే సినిమాకు రీమేక్‌గా రూపొందింది. అయితే మూలకథ ఆధారంగా చేసుకొని తెలుగులో చేసిన మార్పులు చేర్పులు దారుణంగా ఉన్నాయి. 80వ దశకం బ్యాక్ డ్రాప్‌కు తగినట్టే అత్యంత రొటీన్‌గా, రెగ్యులర్‌గానే కాకుండా కథలో ఏం జరుగుతందనే విషయం సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్ధం అయ్యేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇక కథలో సన్నివేశాలు పాత చింతకాయపచ్చడి మాదిరిగానే ఉంది. పాటలు, భాగ్యశ్రీ గ్లామర్ తప్పా ఏదీ కూడా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. సత్య, చమ్మక్ చంద్ర కామెడీ అక్కడక్కడా పేలింది. జగపతి బాబు క్యారెక్టర్ పేలవంగా ఉండటంతో రవితేజ, ఆయనకు మధ్య ఉండే సన్నివేశాలు పరమ బోరింగ్‌గా ఉన్నాయి.

ఇక ఫస్టాఫ్ విషయానికి వస్తే.. సినిమాను మంచి యాక్షన్, కామెడీ ఎపిసోడ్‌తో బాగానే టేకాఫ్ చేశాడు హరీష్ శంకర్. కానీ అదే జోష్‌ను కొనసాగించలేకపోవడంతో మూవీ పరిస్థితి తొలి అర్ధగంటలోనే అర్ధమవుతుంది. రవితేజ, భాగ్యశ్రీ మధ్య లవ్ ట్రాక్‌లో ఎలాంటి ఫీల్ కనిపించదు. ముద్దులు తప్పా.. కథలో మరో ముచ్చట కనిపించదు. సాంగ్స్, భాగ్యశ్రీ గ్లామర్ సినిమా కాస్త చూడబుల్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్లు తప్ప మిగితాది అంతా రొటీన్‌గానే ఉంటుంది. సినిమాను తనదైన శైలిలో రూపొందించడంలో హరీష్ శంకర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
ఇక రవితేజ ఎప్పటిలానే తన క్యారెక్టర్‌ను పండించే పనిలో పడ్డాడు. కథలో, పాత్రలో ఎలాంటి వైవిధ్యం లేకపోవడంతో రొటీన్‌గానే కనిపించాడు. కాకపోతే అతడిలో ఉండే ఎనర్జీతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. పాటలు, రొమాంటిక్ సీన్లలో జోష్ చూపించాడు. ఇక భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌తో అల్లాడించింది. అందంతోనే కాకుండా అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. జగపతి బాబు విలన్ కంటే ఎక్కువగా కామెడీ ఆర్టిస్ట్‌గానే ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాలి, సత్య, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది.
సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ప్లస్ పాయింట్. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం వల్ల ఎడిటింగ్ విభాగం పూర్తిగా చతికిలపడింది. అయనంకా బోస్ ఎప్పటి మాదిరిగానే విజువల్స్‌ను అద్బుతంగా తెరకెక్కించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ విషయానికి వస్తే.. రీరీకార్డింగ్ బాగుంది. టీజీ విశ్వప్రసాద్ అనుసరించిన నిర్మాణ విలువలు పీపుల్స్ మీడియా బ్యానర్‌కు తగినట్టే ఉన్నాయి.

నిజాయితీతో కూడిన ఆదాయపు పన్ను శాఖ అధికారి, రాజకీయ నేత ఎత్తులు పైఎత్తులతో సాగే సినిమా. హిందీలో చాలా సీరియస్‌గా కథ సాగితే..తెలుగులో ఎక్కువగా కామెడీ, లవ్, గ్లామర్‌కు ప్రాముఖ్యత ఇచ్చారు. అదే ఈ సినిమాకు మైనస్. అసలు కథను వదిలేసి కొసరు విషయాలపై దృష్టిపెట్టినట్టు అనిపిస్తుంది. రీమేక్‌లో మాస్టర్ అనిపించే హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. రవితేజ ఫ్యాన్స్, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌ను ఆస్వాదించాలనుకొనే వారికి ఈ సినిమా నచ్చుతుంది. లాంగ్ వీకెండ్‌లో తప్పదు.. ఇంకా ఏమీ పనిలేదు అనుకొంటే వెళ్లి ఈ సినిమాను చూడండి..


Click it and Unblock the Notifications











