Mrithyunjay Movie Review: మృత్యుంజయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: శ్రీ విష్ణు, రెబ్బా మోనికా జాన్, బేబి ఉల్హా, సుదర్శన్, రచ్చ రవి, అయ్పప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నందగోపాల్, మిర్చి మాధవి తదితరులు
దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
బ్యానర్: లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి
మ్యూజిక్: కాలభైరవ,
సినిమాటోగ్రఫి: విద్యాసాగర్ చింతా,
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్: మనీష్ దత్
రిలీజ్ డేట్: 2026-03-06
న్యూస్ పేపర్ ఆఫీస్‌లో మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే జై (విష్ణు)కి న్యూస్ రిపోర్టర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. యాడ్స్ సేకరణలో భాగంగా న్యూస్‌పైన కూడా ఆసక్తి చూపిస్తుంటాడు. ఆ క్రమంలో తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో కూరుకుపోయిన చిన్నారి నవ్వడం మరిచిపోతుంది. ఆ క్రమంలో ఆ పాప తండ్రి మరణం వెనుక కారణాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తుండగా అదే స్టయిల్‌లో రెండో వ్యక్తి మరణం సంభవిస్తుంది. దాంతో ఆ రెండు మరణాలపై అనుమానం కలుగుతుంది. ఈ క్రమంలో ఏసీపీ సీతా పరుశురామ్ (రెబ్బా మోనికా జాన్)ను కలిసి మర్డర్స్ అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. కానీ ఏసీపీ సీత నమ్మదు. ఆ రెండు మరణాల వెనుక కారణం సాధూ( వీర్ ఆర్యన్) పసిగడుతాడు.

యాడ్స్ సేకరించే ఉద్యోగిగా జై జర్నీ ఎలా సాగింది? మరణించిన వ్యక్తుల ఇంటికి వెళ్లి యాడ్స్ ఎలా సేకరించాడు? తండ్రి మరణంతో బాధలో ఉన్న చిన్నారిని జై ఎలా ఊరడించే ప్రయత్నం చేశాడు? ఒకే రకంగా జరిగిన రెండు మరణాలపై జైకి ఎలా అనుమానం కలిగింది? రెండు మరణాలు మర్డర్స్ కావని ఏసీపీ సీత చెప్పడంతో జై ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఇంతకు హంతకుడు ఎవరు? ఎందుకు హంతకుడు హత్యలు చేస్తున్నాడు? హంతకుడికి జై ఎలాంటి శిక్ష విధించాడు? అనే ఎమోషనల్ ప్రశ్నలకు సమాధానమే మృత్యుంజయ్ సినిమా కథ.
ఇప్పటి వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో భారీ హిట్స్ సొంతం చేసుకొంటున్న శ్రీ విష్ణు మరోసారి కంటెంట్ బేస్ చేసుకొని వచ్చిన చిత్రం మృత్యంజయ్. సుకుమార్ టీమ్‌లో విశేష అనుభవం ఉన్న హుస్సేన్ షా కిరణ్ దర్శకుడిగా మారడానికి ఎంచుకొన్న కథ బాగుంది. శ్రీ విష్ణు ఇమేజ్‌కు భిన్నంగా రాసుకొన్న కథనం కూడా బాగుంది. ఇందులో డిజైన్ చేసిన క్యారెక్టర్లు, కథకు తగినట్టుగా సెట్ చేసుకొన్న టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. మర్డర్ మిస్టరీ సినిమాను సింగిల్ పాయింట్ ఎజెండాతో నడిపించడం కత్తి మీద సామే. ఆ సవాల్‌ను సక్సెస్‌పుల్‌గా స్వీకరించడమే కాకుండా ఆడియెన్స్‌ను మెప్పించడంలో సఫలమయ్యాడనే చెప్పాలి. కాకపోతే కథలో ఇంకా కొంత వేరియేషన్స్ జొప్పించడానికి, రెబా క్యారెక్టర్ ఇంకా బెటర్‌గా చేయడానికి స్కోప్ ఉంది. కానీ ఆ దిశగా ఎందుకో ప్రయత్నం చేయకపోవడం సినిమాకు కొంత మైనస్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు కొనసాగించిన స్క్రీన్ ప్లే ఎమోషనల్‌గా కట్టిపడేస్తుంది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో విలక్షణమైన పాత్రలను ఎంచుకొనే శ్రీ విష్ణు మరోసారి పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. ఎక్కడా కామెడీకి స్కోప్ లేకుండా ఉన్న ఎమోషనల్ క్యారెక్టర్‌లో చక్కగా ఒదిగిపోయి నటించాడు. చైల్డ్ సెంటిమెంట్ సీన్లలో భావోద్వేగాన్ని తెరపైన చాలా సహజంగా పండిచాడు. శ్రీ విష్ణు చేసిన సినిమాల్లో ఈ సినిమా ఒక బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. రెబా మోనికా జాన్ కూడా యాక్షన్, కొంత మాస్ టచ్ ఉంటే పాత్రలో కనిపించారు. రొమాన్స్, గ్లామర్‌కు స్కోప్ లేకపోయినా తెర మీద అందంగా కనిపించడమే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. వీర్ ఆర్యన్, అయప్ప పీ శర్మ, రచ్చ రవి, సుదర్శన్, చిన్నారిగా నటించిన అమ్మాయి అందరూ తమ పాత్రలతో గుర్తుండిపోతారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్. సినిమా మొత్తాన్ని ఎమోషనల్‌గానే కాకుండా యాక్షన్ మూవీగా మార్చడంలోను, ప్రతీ సన్నివేశాన్ని భారీగా హైలెట్ చేస్తూ ఆకట్టుకొన్నాడు. ఇక విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. ఉపయోగించిన కలర్ ప్యాటర్న్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాలు తమ మార్కును స్క్రీన్ మీద చూపించాయి. నిర్మాతగా సందీప్ గుణ్ణం ఎంచుకొన్న కంటెంట్ చూస్తే.. సినిమాపై ఆయనకు ఉన్న తపన ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. క్వాలిటీ, కంటెంట్ ఎలివేట్ చేసే విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉన్నత ప్రమాణాలను అనుసరించారు.
చైల్డ్ సెంటిమెంట్, మైండ్ గేమ్‌తో సాగే స్క్రీన్ ప్లే ఆధారిత సస్పెన్స్ థ్రిల్లర్ మృత్యుంజయ్. శ్రీ విష్ణు తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టారు. గ్రిప్పింగ్ కథను చెప్పే విషయంలో దర్శకుడు హుస్పేన్ షా కిరణ్ తన టాలెంట్‌ను చూపించాడు. ఫస్టాఫ్‌లో కొంత సాగదీసినట్టు అనిపించినా.. సెకండాఫ్‌లో టాప్ గేర్‌లో కథను నడిపించేందుకు జాగ్రత్తలు తీసుకొన్నాడు. థ్రిల్లర్ మూవీస్, శ్రీ విష్ణు నటనను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో ఈ సినిమాను నిస్పందేహంగా చేర్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications











