Mrithyunjay Public Talk: మృత్యుంజయ్ పబ్లిక్ టాక్.. శ్రీ విష్ణు క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Mrithyunjay Public Talk: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన హీరోయిన్‌గా రెబ్బా మోనికా జాన్ నటించారు. ఇంతకాలం తన కామెడీతో ఆకట్టుకున్న ఈ హీరో ఫస్ట్ టైం థ్రిల్లర్ జానర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంగీతాన్ని కాలభైరవ అందించగా, సినిమాటోగ్రఫీని విద్యాసాగర్ చింతా, ఎడిటింగ్‌ను శ్రీకర్ ప్రసాద్ నిర్వహించారు. ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
మృత్యుంజయ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. భావోద్వేగాలను కలగలిపిన థ్రిల్లర్‌గా సాగుతుంది. విక్రాంత్ అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఘటనతో అతని చిన్నారి అనాథగా మారుతుంది. ఆ పాప మౌనం వెనుక ఉన్న రహస్యం కథలో కీలకంగా మారుతుంది. ఈ సమయంలో జై (శ్రీవిష్ణు) అనే యువకుడు తన స్నేహితుడి మరణం వెనుక నిజం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. క్రైమ్ బ్యూరోలో ఉద్యోగం కోసం ప్రయత్నించినా తిరస్కరించబడతాడు. అయినప్పటికీ నిజాన్ని బయటపెట్టాలనే పట్టుదలతో విచారణ కొనసాగిస్తాడు. ఆ మర్డర్ మిస్టరీని ఎలా చేధిస్తాడు అనేది స్టోరీ.

హీరో శ్రీ విష్ణు సినిమాకు విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కథలో ఉన్న సస్పెన్స్, చైల్డ్ సెంటిమెంట్, శ్రీ విష్ణు నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సినిమాతో శ్రీవిష్ణు తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పబ్లిక్ టాక్ ప్రకారం సినిమాలో మర్డర్ మిస్టరీ అంశం ప్రేక్షకులను ఆసక్తిగా కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే ట్విస్టులు, భావోద్వేగ సన్నివేశాలు కథను మరింత ఎలివేట్ చేస్తున్నాయని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై ఉంచేలా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
నటన పరంగా చూస్తే ఈ సినిమాలో శ్రీ విష్ణు మరోసారి తన నటనతో మెప్పించారని ప్రేక్షకులు అంటున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఆయన ఈసారి పూర్తి స్థాయి ఎమోషనల్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారితో ఉన్న సన్నివేశాల్లో ఆయన నటన సహజంగా కనిపించిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
హీరోయిన్‌గా నటించిన రెబ్బా మోనికా జాన్ కూడా తన పాత్రకు న్యాయం చేశారని టాక్ వినిపిస్తోంది. ఏసీపీ సీత పాత్రలో ఆమె యాక్షన్, సీరియస్ షేడ్స్‌తో కనిపించి కథకు బలం చేకూర్చిందని చెబుతున్నారు. అలాగే వీర్ ఆర్యన్, అయప్ప పీ శర్మ, రచ్చ రవి, సుదర్శన్, చిన్నారి పాత్రలో నటించిన బాలనటి తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సాంకేతికంగా కూడా సినిమా మంచి స్థాయిలో ఉందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలంగా మారిందని ప్రేక్షకులు అంటున్నారు. థ్రిల్లింగ్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన సంగీతం సినిమాను మరింత ఇంటెన్స్‌గా మార్చిందని కామెంట్లు వస్తున్నాయి. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ కథను ఆసక్తికరంగా చెప్పడంలో మంచి ప్రతిభ చూపించారని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఫస్ట్ హాఫ్‌లో కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో కథను టాప్ గేర్‌లో తీసుకెళ్లారని చెబుతున్నారు. ముఖ్యంగా మర్డర్ మిస్టరీని ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో కలిపి చెప్పడం సినిమాకు ప్రధాన బలం అయ్యిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలా చైల్డ్ సెంటిమెంట్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే కలగలిపిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'మృత్యుంజయ్' నిలిచిందని పబ్లిక్ టాక్ చెబుతోంది. శ్రీ విష్ణు నటన, దర్శకుడి కథనం, సాంకేతిక విభాగాల పనితీరు కలిసి సినిమాను ఆకట్టుకునేలా చేశాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు శ్రీ విష్ణు కెరీర్‌లో మరో మంచి సినిమా, ఎమోషన్‌తో కూడిన థ్రిల్లర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ పాజిటివ్ స్పందనను చూస్తుంటే మృత్యుంజయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











