twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఘవేంద్రుడి మార్క్‌ చిత్రం 'మూడు ముక్కలాట'

    By Staff
    |

    Mudumukkalata
    - సౌమిత్‌
    బ్యానర్‌: ఉషాకిరణ్‌ మూవీస్‌
    నటీనటులు: జగపతిబాబు, సౌందర్య, రంభ, రాశి, ప్రకాష్‌రాజ్‌,
    నాజర్‌, భరణి, బ్రహ్మానందం, ఏవీఎస్‌, ఎం.ఎస్‌.నారాయణ, ఎల్‌.బి.శ్రీరాం,
    సుధాకర్‌, రాజారవీంద్ర, సన, ఢిల్లీ రాజేశ్వరి, అన్నపూర్ణ, ప్రియ, మాధవీశ్రీ.
    కథ, మాటలు: జనార్థన్‌ మహర్షి
    కెమెరాః శ్రీనివాసరెడ్డి
    సంగీతం: శ్రీలేఖ
    నిర్మాత: రామోజీరావు
    దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.

    పత్రికకో పాలసీ, రచయితకో శైలీ ఉన్నట్లే ఒక్కో దర్శకుడికి ఒక్కోరకమైన గుర్తింపు ఉంటుంది. సంగీత దర్శకుడు కంపోజ్‌ చేసిన ట్యూన్‌ని బట్టి ఆ సంగీత దర్శకుడి పేరు చెప్పగలిగినట్లే టైటిల్స్‌లో పేరు చూడకుండా చిత్రం చూసిన తర్వాత ఇది ఫలానా దర్శకుడి చిత్రం అని ప్రేక్షకులు ముక్తకంఠంతో చెప్పగలిగేలా తనదంటూ ఓ స్టైల్‌ని సృష్టించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్రరావు. అదే కోవలో శుక్రవారం (1-9-2000) విడుదలైన మూడుముక్కలాట చిత్రాన్ని నూటికి నూరుశాతం రాఘవేంద్రుడి మార్క్‌ చిత్రంగా చెప్పుకోవచ్చు. 'ముగ్గురమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించడం, తను మాత్రం ఒకే అమ్మాయిని ఇష్టపడటం' ఇలాంటి లైన్‌తో గతంలో ఎన్నో చిత్రాలు వచ్చినట్లు అనిపిస్తోంది కదూ...! అయినా పాత కథని కొత్త బ్యాక్‌డ్రాప్‌తో వెండితెరపై కలర్‌ఫుల్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో సాటిలేని మేటి అయిన రాఘవేంద్రరావు 'మూడు ముక్కలాట' ని కూడా జనరంజకంగా మలిచారు.

    సిటీ కాలేజీకి కొత్తగా వచ్చిన లెక్చరర్‌ శాంతిస్వరూప్‌ (జగపతిబాబు) తన ఎంట్రీతోనే అందరి మన్ననలు అందుకుంటాడు. ఆ కాలేజీలోనే లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. సౌందర్య (శ్రావణి), రంభ (లహరి), రాశి (అలివేణి) ఆ కాలేజ్‌ స్టూడెంట్స్‌. ఆ కాలేజ్‌లో పనిచేసే లెక్చరర్‌ రాజారవీంద్ర ఓ అమ్మాయిని మోసం చేయబోగా అడ్డుపడి వారిద్దరి పెళ్లి జరిపిస్తాడు శాంతిస్వరూప్‌. చిన్న చిన్న సంఘటనల ద్వారా శాంతిస్వరూప్‌పై అభిమానం పెంచుకుంటుంది లహరి. ఓ స్టూడెంట్‌ అలివేణికి రాసిన ప్రేమలేఖ శాంతిస్వరూప్‌ తనకు రాసిందిగా పొరబడి ఆయనకు ప్రేమలేఖ రాస్తుంది లహరి. అయితే ఆ లేఖ అతను చూడకుండానే శ్రీవేణికి అందుతుంది. (ఎలా అంటే .... అదే సినిమా మరి) దాంతో శ్రావణి కూడా అతన్ని ప్రేమిస్తుంటుంది. శాంతి స్వరూప్‌ కూడా ఆమెను ఇష్టపడడంతో ఇద్దరూ ప్రేమికులవుతారు. మధ్యలో లాబ్‌లో ప్రమాదంలో చిక్కుకున్న అలివేణిని శాంతిస్వరూప్‌ కాపాడడంతో ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది.

    ఇదిలా ఉంటే శ్రావణి బావ పరమహంస (ప్రకాష్‌రాజ్‌) ఆమెను ఇష్టపడుతూ ఆమెను పెళ్లాడడమే తాను ఏడేళ్ళ కలగా భావిస్తుంటాడు. అయితే అది ఆమెతో చెప్పడు. శాంతిస్వరూప్‌, శ్రావణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ విషయాన్ని బైటపెట్టి ఒప్పుకోకుంటే ఆమె అక్కని, పిల్లల్ని చంపుతానని బెదిరిస్తాడు. మరోవైపు లహరి అంటే తనకు కేవలం అభిమానమేనని తాను వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నానని శాంతిస్వరూప్‌ చెప్పడంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది లహరి.

    దాంతో కోపోద్రిక్తుడైన ఆమె అన్నయ్య యుగంధర్‌ (నాజర్‌) తన చెల్లెల్ని చేసుకోకపోతే హీరో తల్లిని చంపుతానని బెదిరిస్తాడు. అదేవిధంగా అలివేణి ప్రేమ సక్సెస్‌ కావడం కోసం శాంతిస్వరూప్‌ మూలంగా గర్భవతిని అయ్యానని నాటకం ఆడిస్తాడు ఆమె తండ్రి బర్రెల బాలరాజు (భరణి). దీంతో లహరిని చేసుకుంటానని యుగంధర్‌తో, అలివేణిని చేసుకుంటానని బాలరాజుతో చెప్పి శ్రావణిని ఇంటినుంచి తీసుకువచ్చి పెళ్లిచేసుకోవడానికి ఏర్పాట్లు చేయడంతో కథ క్లయిమాక్స్‌కు వస్తుంది. చివర్లో లహరి, అలివేణిల్లో పరివర్తన రావడం, పరమహంస దారికి రావడంతో కథ కంచికి, మనమింటికి.

    సినిమాలో కథ ఏమిటన్నది ప్రక్కనబెడితే ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది నిండుతనం.. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా కన్నుల పండుగగా ఉంది. ఈ విషయంలో కెమెరామెన్‌ శ్రీనివాసరెడ్డి అభినందనీయుడు. అలాగే శ్రీలేఖ అందించిన సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్‌. 'ప్రేమవిక్రమార్కుడు', 'నందనందనా' 'రాశి చూస్తే కన్యారాశి' వంటి పాటలు, వాటిని చిత్రీకరించిన విధానం బ్రహ్మాండం. ప్రేమవిక్రమార్కుడు పాట చివర్లోని గ్రాఫిక్స్‌ రామోజీఫిలింసిటీలోని గ్రాఫర్స్‌ విభాగం 'మంత్ర' పనితనానికి మచ్చుతునక. జనార్ధన్‌మహర్షి డైలాగ్స్‌ బాగా పేలాయి. కాలేజ్‌ సన్నివేశాల్లో ప్రిన్సిపాల్‌ ఏవీఎస్‌ ఇంటిపేరు 'గొట్టం'ను స్టూడెంట్స్‌ చేత సందర్భోచితంగా పలికించిన తీరు ఆకట్టుకునేలా వుంది.

    పాత్రధారులందరికీ ఈ తరహా పాత్రలు కొట్టిన పిండే. హీరోయిన్స్‌ ముగ్గురూ తమ అందచందాలతో ప్రేక్షకులకు కనువిందు చేశారు. రాశిచే పలికించిన తెలంగాణా యాస మాత్రం అంత బాగాలేదు. లహరి (రంభ) ఇష్టపడిందల్లా తెచ్చి ఇచ్చే అన్నయ్య యుగంధర్‌ (నాజర్‌) వద్ద పి.ఏగా పనిచేసే ఎల్‌.బి.శ్రీరాం తాజ్‌మహల్‌, చార్మినార్‌, చిరంజీవి బొమ్మలున్న పుస్తకాల్ని దాచిపెట్టే సీన్స్‌ బాగా పేల్చాయి. ఒక్క క్లయిమాక్స్‌ మాత్రమే కొద్దిగా తేలిపోయిందేమో అన్పించినప్పటికీ తామిచ్చిన డబ్బుకు పూర్తి న్యాయం జరిగిందన్న సంతృప్తి ప్రేక్షకులకు మిగులుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X