Mura Movie Review: మురా మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. అదిరిపోయేలా మలయాళ క్రైమ్ థ్రిల్లర్!
Rating: 2.75/5
నటీనటులు: హ్రిదూ హరున్, క్రిష్ హాసన్, కానీ కుస్రూతి, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి, ఎదు కృష్ణ, జోబిన్ దాస్, అనుజిత్, తదితరులు
దర్శకత్వం: మహ్మద్ ముస్తాఫా
రచన: సురేష్ బాబు
నిర్మాత: రియా శిబు
సినిమాటోగ్రఫి: ఫాజిల్ నాజర్
మ్యూజిక్: క్రిస్టీ జోబీ
బ్యానర్: హెచ్ఆర్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2024-11-08
ఓటీటీ రిలీజ్ డేట్: 2024-12-25
చదువును మధ్యలోనే ఆపేసిన ఆనందు (హ్రిదూ హరున్) తన స్నేహితులు మునాఫ్ (అనుజిత్), షాజీ (జోబిన్ దాస్), మను(ఎదు కృష్ణ)తో అల్లరి చిల్లరిగా జీవిస్తుంటాడు. ఈ నలుగురు యువకుల్లో ఉండే దూకుడు చూసిన లోకల్ రౌడీ అని (సూరజ్ వెంజరమూడు) చేరదీస్తాడు. మధురైలోని పాత ఫ్యాక్టరీలో దాచిన బ్లాక్ మనీని ఎత్తుకు రావాలని టాస్క్ ఇస్తాడు. దాంతో వారంతా పక్కాగా ప్లాన్ వేసి భారీగా బ్లాక్ మనీని దొంగలించుకొస్తారు. ఆ తర్వాత ఈ వ్యవహారాన్నంతా నడిపిన గ్యాంగ్‌స్టర్ రమాదేవీ (మాలా పార్వతి), అనితో గొడవలు వస్తాయి.
పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని ఫ్యాక్టరీ నుంచి ఎలా కొట్టేశారు? ఈ వ్యవహారంలో వారికి ఎదురైన సంఘటనలు ఏంటి? భారీగా డబ్బు చేతిలోకి వచ్చిన తర్వాత అనికి ఎలాంటి కండీషన్లను ఆనందు గ్యాంగ్ విధించింది. ఆనంద్ పెట్టిన షరతులకు అనీ, రమాదేవీ గ్యాంగ్ ఎలా రియాక్ట్ అయింది? ఈ గ్యాంగ్ వార్‌లో ఆనందు గ్రూపుకు జరిగిన ఆర్థిక, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే మురా (Mura Movie Review) సినిమా కథ.

ఆనందు తన స్నేహితులతో బాధ్యతారాహిత్యంగా తిరుగుతూ జాల్సాలు కొనసాగించే సన్నివేశాలతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత అని చెప్పిన ప్లాన్‌తో ఆనందు గ్రూప్ మధురై వెళ్లడం.. అక్కడి నుంచి బ్లాక్ మనీ కొట్టేసి రావడమంతా చకచకా జరిగిపోతాయి. ఇక కథలో డబ్బు పంచుకోవడం దగ్గర మొదలైన కాన్‌ఫ్లిక్ట్‌తో స్పీడ్ పెరుగుతుంది. ఎమోషనల్ అంశాలు స్టోరీలోకి రావడంతో సినిమా గ్రిప్పింగ్‌గా సాగినట్టు అనిపిస్తుంది.
మూవీ సెకండాఫ్‌లో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ సినిమాను యాక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్తాయి. ఫైట్స్, భావోద్వేగమైన సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా అనిపిస్తాయి. అయితే కథలో బలమైన పాయింట్ లేకపోవడంతో చివరి వరకు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథా గమనంలో వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే క్లైమాక్స్ పూర్తిగా వీక్‌గా ఉండటంతో అప్పటి వరకు మంచి యాక్షన్ మూవీ చూశామనే జోష్.. చప్పగా మారిపోతుంది.

నలుగురు కుర్రాళ్లలో బాస్‌గా, ఆనందు పాత్రలో హ్రిదూ సినిమా భారాన్నంతా తన భుజాలపై మోశారనే చెప్పాలి. ఇక హ్రిదూ ఓ వైపు తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాకు బలంగా మారితే.. లేడీ విలన్ పాత్రలో మాలా పార్వాతి, మరో గ్యాంగ్‌స్టర్‌గా సూరజ్ పోటాపోటీగా నటించారు. ఎదు కృష్ణ, జోబిన్ దాస్, అనుజిత్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. సాంకేతిక అంశాలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ సినిమాకు మరో బలంగా మారాయని చెప్పవచ్చు. దర్శకుడు యాక్షన్, క్రైమ్, వయోలెన్స్ అంశాలతోపాటు ఎమోషనల్ కంటెంట్‌ను జోడించిన తీరు బాగుంది.
కథ పాతదే అయినప్పటికీ.. కథనం, మేకింగ్‌లో కొత్తదనంతో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ మురా. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, దర్శకుడి టేకింగ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. రొటీన్ క్రైమ్ డ్రామా అయినప్పటికీ.. ట్విస్టులతో అనుక్షణం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో దర్శకుడు తన మార్క్ చాటుకొన్నాడు. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. టైమ్ చూసుకొనే ఒకేసారి సినిమాను పూర్తిగా చూసేయండి.. మంచి అనుభూతి మిగులుతుంది.


Click it and Unblock the Notifications











