twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఆటోగ్రాఫ్‌ - సమీక్ష

    By Staff
    |

    Naa Autograph
    -జలపతి గూడెల్లి
    చిత్రం: నా ఆటోగ్రాఫ్‌
    నటీనటులు: రవితేజ, గోపిక, భూమిక, మల్లిక, కనిక,
    పరచూరి వెంకటేశ్వరరావు, సునీల్‌, వేణుమాధవ్‌ తదితరులు
    సంగీతం: కీరవాణి
    కథ, స్క్రీన్‌ప్లే: చేరన్‌
    నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌
    దర్శకత్వం: ఎస్‌.గోపాల్‌రెడ్డి

    తమిళంలో ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలై, ఎంతో పేరు సంపాదించుకొన్న 'ఆటోగ్రాఫ్‌' చిత్రానికి ఇది రీమేక్‌. మాతృక తమిళంకు డిట్టో కాపీ ఈ సినిమా. మనసుని కదిలించే సున్నితమైన సన్నివేశాలు, ముగ్గురి హీరోయిన్ల చక్కటి, హానెస్ట్‌ నటన, టెండర్‌ మూమెంట్స్‌ 'నా ఆటోగ్రాఫ్‌..స్వీట్‌ మొమెరీస్‌'లో ఆకట్టుకునే అంశాలు, సినిమాలో మెచ్చుకోతగ్గ విషయాలూనూ. కథ లేదా థీమ్‌ చాలా బాగుంది. కానీ, ద్వితీయార్థమే మరీ బోర్‌గా సాగడం, సాగతీత అధికంగా ఉండడం, కీరవాణి అందించిన మరీ పేలవమైన సంగీతం వల్ల సినిమా గొప్ప చిత్రంగా నిలవలేదు. యావరేజ్‌ చిత్రంగానే నిలిచింది. స్వీట్‌గా ప్రారంభమై, కొన్ని 'స్వీట్‌మెమెరీస్‌'ను మాత్రమే మిగిల్చింది.

    ద్వితీయార్థంలో మరీ ముఖ్యంగా, భూమిక, రవితేజల మధ్య ఘట్టం అంతా బోరే.

    పేరొందిన సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాల్‌రెడ్డి దర్శకుడిగా మారుతూ రూపొందించిన ఈ తొలి చిత్రం ముందుగా చెప్పినట్లు, తమిళ మాతృకను ఉన్నదున్నట్లు 'ఫాలో' అయ్యారు. దర్శకుడిగా ఆయన టేకింగ్‌ ఫర్వాలేదు. అందర్నీ ఆది నుంచి వేధిస్తోన్న అంశం రవితేజ ఈ సినిమాకు న్యాయం చేయగలరా అన్నది. దానికి సమాధానం ఆయన సగం కృతకృత్యులయ్యాడనే చెప్పాలి. కాలేజ్‌ చదువుకునే 'యువ'కుడి పాత్రలోనే రవితేజ నటన ఎంబారిసింగ్‌గా ఉంది. రవితేజ సిన్సియర్‌గానే చేసినా, వయసు రీత్యా ఆయన ముదురుతనం ఎబ్బెట్టుగా అన్పించింది. ముదురు బ్రాహ్మణుడికి ఉపనయనం చేయిస్తున్నట్లుగా అన్పించింది. అయితే, మిగతా అంతా అతను చక్కగా చేశాడు.

    రవితేజ చిన్ననాటి ప్రేమ, రవితేజ కాలేజ్‌ రోజుల్లో కేరళ కుట్టిని ప్రేమించే ఘట్టాలు ఈ సినిమాకు హైలెట్‌ అని చెప్పాలి. ప్రేక్షకులు ఇన్‌వాల్వ్‌ అయ్యే సన్నివేశాలు గానీ, మనుసులో జ్ఞాపకాలను తెరలేపే సన్నివేశాలు గానీ ఈ రెండు ఘట్టాల్లోనే ఉన్నాయి. సినిమాకు ఇవే ప్రాణం.

    ఒక విధంగా ఈ సినిమా కథ స్వర్గీయ రాజ్‌కపూర్‌ రూపొందించిన 'మేరా నామ్‌ జోకర్‌' కథనే చెప్పాలి. ముగ్గురు యువతులను ప్రేమించిన ఓ యువకుడు చివరికి నాలుగో యువతిని పెళ్ళి చేసుకోవడం, తన పెళ్ళికి వీరందర్నీ పిలివడం, ఆ పెళ్ళి పిలుపు క్రమంలో తన జీవితంలోని 'జ్ఞాపకాల' ఆటోగ్రాఫ్‌ను ప్రేక్షకులకు తెలియచేయడం కథ.

    ఓ యాడ్‌ ఏజెన్సీలో పనిచేసే శ్రీనివాస్‌(రవితేజ) తన పెళ్ళికి చిన్ననాటి స్కూల్‌ మిత్రులను ఆ్వనించేందుకు సొంత ఊరికి బయలుదేరుతాడు. ఘట్టం ఒకటి ప్రారంభం. హైస్కూలు రోజుల్లో తనతో చదివే విమల (మల్లిక)ను శ్రీనివాస్‌ ఇష్టపడుతాడు. కానీ టెన్త్‌ పూర్తి కాగానే మల్లికను వేరే కాలేజ్‌లో చేర్పిస్తారు. దీంతో శ్రీనివాస్‌ తొలి క్రష్‌ అలా ముగుస్తుంది. శ్రీనివాస్‌ తండ్రికి కేరళ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది.

    ఘట్టం రెండు: అక్కడ కాలేజ్‌లో చేరిన శ్రీనుకు కేరళ కుట్టి లతిక (గోపిక) పరిచయం అవుతుంది. ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు. తనూ ప్రేమిస్తుంది. కానీ, ఆమెను మాధవన్‌ అనే మరో కేరళ కుర్రాడితో ఆమె తండ్రి రహస్యంగా పెళ్ళి చేసేస్తాడు. లతిక తనను మోసం చేసిందని భావించిన శ్రీను దేవదాసు అవుతాడు. కొడుకు పరిస్థితి చూసి తండ్రి మందలించడంతో శ్రీను కొత్త జీవితం కోసం హైదరాబాద్‌ వెళుతాడు.

    ఘట్టం మూడు: హైదరాబాద్‌లో అతని జీవితాన్ని దివ్య (భూమిక) మార్చేస్తుంది. దివ్య పరిచయం వల్ల శ్రీనుకు ఉద్యోగం రావడమే కాదు, అన్ని ప్రేమలను మర్చిపోగలుగుతాడు. కానీ చివరికి దివ్య తన జీవితాన్ని 'అనాథల' కోసం అంకితం చేయడంతో, శ్రీను తల్లితండ్రులు కుదిర్చిన అమ్మాయి సంధ్య (కన్యక)ను పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ ఒక్కొ ఘట్టాన్ని రవితేజ చెప్పుకుంటూ వస్తాడు.

    క్లైమాక్స్‌లో లతిక వైధవ్యాన్ని చూడాల్సి రావడం వంటి మనసును కదిలించే దృశ్యాలు మినహా ద్వితీయార్థం మరీ సాధారణంగా ఉంది.

    ప్రథమార్థంలో ధర్మవరపు సుబ్రమణ్యం 'బాంబు'లు పేల్చడం, పల్లెటూరి జీవితాన్ని చూపించడం, కేరళలో లతికతో ప్రేమాయణం..అంతా చాలా బాగుంది. వేణుమాధవ్‌, సునీల్‌లు కూడా బాగా చేశారు. ముగ్గురు హీరోయిన్లు మల్లిక, లతిక, భూమిక నటన చాలా బాగా ఉంది. వారు ముగ్గురు హానెస్ట్‌గా చేశారు. ఇక రవితేజ, మిగతా చిత్రాలకు భిన్నంగా చాలా సౌమ్యంగా, నీట్‌గా చేసినా, ఇలాంటి పాత్రలకు 'సాత్వికం'గా కన్పించేవారు అయితేనే బాగుంటుంది.

    సినిమాలో మరో లోపం ఏమిటంటే, వింటేజ్‌ లుక్‌ లేకపోవడం. కేరళ సన్నివేశాల్లో 'పాత కాలపు గుర్తులు' క న్పించేవిధంగా లేదు. తమిళంలో గోపిక, చేరన్‌ల మధ్య వింటేజ్‌ లుక్‌ కోసం, రెట్రో సాంగ్‌ (అంటే పాతకాలం తరహా పాట).. ఎమ్జీఆర్‌ చిత్రాల తరహాలో ఓ పాట పెట్టారు. అంతే కాకుండా తమిళంలో సంగీతం చాలా బాగుంది. తెలుగులో కీరవాణి స్వరపర్చిన పాటల్లో 'మన్మధుడే..' అనే పాట తప్ప ఏవీ ఆకట్టుకోవు. సమీర్‌ రెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది. మొత్తమ్మీద ఫర్వాలేదనిపించే చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X