Nagabandham Movie Review: నాగబంధం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, రిషబ్ సాహ్నీ, ఐశ్వర్య మీనన్, దక్షా నగార్కర్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, మురళీ శర్మ, రామచంద్రరాజు, అనసూయ భరద్వాజ్, శరణ్య తదితరులు
దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి
సినిమాటోగ్రఫి: సౌందర్ రాజన్ ఎస్
మ్యూజిక్: జునైద్ కుమార్, అభి,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జునైద్ కుమార్,
ఎడిటర్: ఆర్సీ ప్రణవ్,
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్,
కొరియోగ్రఫి: బృంద, గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ,
యాక్షన్ కోరియోగ్రఫి: కనల్ కన్నన్
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్
రిలీజ్ డేట్: 2026-07-03
ప్రపంచానికి అంతుచిక్కని నాగబంధం రహస్యాన్ని ఆర్కియాలజీ పరిశోధకులు ప్రభాకర్ (జగపతిబాబు), అబ్దాలీ (రిషబ్ సాహ్నీ), టెస్లా హిమాలయాల్లో పురాతన గ్రంధాన్ని కనుక్కొంటారు. ఆ పుస్తకంలోని రహస్యాన్ని టెస్లా, జగపతి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన మంత్రికి వెల్లడించి భారత్‌ను సుసంపన్న దేశంగా తీర్చి దిద్దాలని కలలు కంటారు. కానీ స్వార్ధంతో ఉన్న అబ్దుల్లా మాత్రం ఆ గ్రంథాన్ని చేజిక్కించుకోవాలని టెస్లా కుటుంబాన్ని చంపేస్తాడు. ఆ తర్వాత నాగబంధాన్ని విముక్తి చేయాలంటే.. శ్రీ రంగనాథ స్వామి నాభిలో ఉన్న బ్రహ్మ కమలం హస్తగతం చేసుకోవడమే ముఖ్యమని తెలుసుకొంటాడు. ఆలయంలోని తన మనుషుల చేత బ్రహ్మ కమలాన్ని దొంగిలిస్తాడు.అయితే ఆ బ్రహ్మ కమలం ఆచూకీ కనుక్కోవాడనికి ఆ గూడెంలోని రుద్ర (విరాట్ కర్ణ)ను ఉపయోగించుకొంటారు. దాంతో బ్రహ్మ కమలం ఆచూకీ కోసం రుద్ర వేట మొదలుపెడుతాడు. ఆ తర్వాత రుద్ర నాగసాధువుగా మారుతాడు.
నాగబంధం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎన్నో ఏళ్లుగా నాగబంధం అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయింది? బ్రహ్మ కమలం, నాగబంధంకు ఉన్న లింకు ఏమిటి? శ్రీరంగనాథ ఆలయంలో దేవుడి నాభిలో ఉన్న బ్రహ్మ కమలాన్ని ఎవరు దొంగిలించారు? శ్రీ రంగనాథ ఆలయంలో భక్తురాలైన పార్వతి (నభ నటేష్) పాత్ర ఏమిటి? రుద్ర కుటుంబాన్ని అబ్దుల్లా ఎందుకు మట్టుబెట్టాడు? అబ్దుల్లాపై రుద్ర ప్రతీకారం తీర్చుకొనే నేపథ్యంలో తనకు తగిలిన షాక్ ఏమిటి? బ్రహ్మ కమలం దక్కించుకోవడానికి, నాగబంధం విముక్తి కోసం హిందూ మతంపై పాకిస్థాన్‌కు చెందిన ఓ వర్గం చేసిన కుట్రలు ఏమిటి? ఆ కుట్రలను నాగసాధువుగా మారిన రుద్ర ఎలా భగ్నం చేశాడు అనేది నాగబంధం కథ.

తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నిర్మాత అభిషేక్ నామా 1960 బ్యాక్ డ్రాప్‌తో నాగబంధం సినిమా కథను ఊహించుకొన్న విధానం చాలా బాగుంది. కానీ కథను అత్యంత సులభంగా చెప్పాల్సిన పాయింట్‌ను స్క్రీన్ ప్లే రూపంలో కాంప్లికేట్ చేశాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. తన ఊహ, విజన్‌కు తగినట్టుగా తెలుగు సినిమాలో అత్యంత సాంకేతిక ప్రామాణికాలతో ఈ సినిమాను రూపొందించడానికి పడిన తపన ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కానీ స్టోరీ ఫ్లో మాత్రం సరిగా లేకపోవడం వల్ల కొంత కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కానీ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, ముఖ్యంగా సాంగ్ చిత్రీకరణ, టెక్నికల్‌గా, యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఈ సినిమాను అత్యంత అనుభవం ఉన్న దర్శకుడిగా అందించారనే చెప్పాలి. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్‌లో సనాతన ధర్మం, ధర్మ పరిరక్షణ అంశాలు హైలెట్‌గా మారడమే కాకుండా ఆలోచింపజేసేలా చేస్తాయి. అయితే ఈ కథను వివరంగా చెప్పాలనే దర్శకుడి కుతుహలం వల్ల సినిమా నిడివి అనవసరంగా పెరిగిపోయింది. సాంగ్స్ ప్లేస్‌మెంట్స్ సెట్ కాకపోవడం వల్ల సినిమా సాగదీసినట్టు ఉంటుంది. చివరకు మాత్రం మంచి విజువల్ గ్రాండియన్ సినిమాను చూశామనే తృప్తి, అనుభూతిని దర్శకుడు అందించడంలో పూర్తిగా సఫలమయ్యారు.
నటీనటులు ప్రతిభ విషయానికి వస్తే.. పెదకాపు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విరాట్ కర్ణ రుద్ర పాత్రలో తన టాలెంట్‌కు మించి పెర్ఫార్మెన్స్ చేశాడనిపిస్తుంది. సినిమా భారన్నంతా తన భుజాలపై మోశాడనే చెప్పాలి. ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే పార్వతి పాత్రలో నభ నటేష్ అద్బుతంగా రాణించింది. పాటల్లో డ్యాన్సులు, పాత్రపరంగా కథలో కీలకమైన ట్విస్టుగా మారే క్యారెక్టర్‌ను అవలీలగా పండించింది. దక్ష నగార్కర్, ఐశ్వర్య మీనన్, అనసూయ పాత్రల నిడివి తక్కువైనా గుర్తుండిపోయేలా ఉంటాయి. ఇక అబ్దుల్లా రిషబ్ సాహ్నీ, ప్రభాకర్‌గా జగపతిబాబు పోషించిన పాత్రలు ఈ సినిమాకు కీలకంగా మారారు. ఈ చిత్రంలో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
నాగబంధం సినిమా గురించి చెప్పాలనుకొంటే ముందుగా ఈ సినిమాకు ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకోవాలి. తెలుగు ప్రేక్షకుడికి కొత్త అానుభూతిని పంచేలా ప్రతీ సీన్‌ను చాలా గ్రాండియర్‌గా డిజైన్ చేశారు. కాసేపు కొత్తలోకంలోకి వచ్చామా? అనే పీలింగ్‌ను కల్పించారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి, అశోక్ ఆర్ట్ వర్క్, జునైద్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు అత్యంత బలంగా మారాయి. యాక్షన్ సీన్లలో హింస మితిమీరినప్పటికీ.. ఫైట్స్‌ను కనల్ కన్నన్ కొత్తగా డిజైన్ చేశారు. ఈ సినిమాకు డ్యాన్స్ కొరియోగ్రఫి మరో బ్యూటీ. దర్శకుడి విజన్‌కు తగినట్టుగా కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు ది బెస్ట్ అని చెప్పాల్సిందే.
నాగబంధం సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. సనాతన ధర్మం, హిందూ మత పరిరక్షణ ముఖ్యమైన అంశాలుగా రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. కథ చెప్పడంలో ఇంకాస్త క్లారిటీ, నిడివి తగ్గించి ఉంటే ఈ సినిమా టెక్నికల్‌గా విజువల్ గ్రాండియర్ పరంగా బెంచ్ మార్క్ అయి ఉండేది. కథ లో వేగానికి అడ్డుపడేలా పాటలు ఉండటం ఆడియెన్స్ క్యూరియాసిటీపై ప్రభావం పడేలా చేస్తుంది. టెక్నికల్ అంశాలు, సనాతన ధర్మం అంశాలతో వచ్చే మైథాలజికల్ టచ్ ఉన్న సినిమాలను చూసే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాల్లో నిస్పందేహంగా ఈ సినిమా లవర్స్ ఈ చిత్రాన్ని చేర్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications