Nayakudu Movie Review ఉదయనిధి స్టాలిన్ పెర్ఫార్మెన్స్ అదుర్స్.. నాయకుడు ఓటీటీ రివ్యూ
నటీనటులు: వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్, ఫాహద్ ఫజిల్, లాల్, సునీల్ రెడ్డి తదితరులు
రచన, దర్శకత్వం: మారి సెల్వరాజ్
నిర్మాణ సంస్థ: రెడ్ జెయింట్ మూవీస్
నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్
ఎడిటర్: ఆర్కే సెల్వ
సంగీతం: ఏఆర్ రెహమాన్
విడుదల తేదీ: జూలై 27, 2023
స్ట్రీమింగ్: నెట్ ఫ్లిక్స్
రామాపురం ప్రాంతానికి చెందిన మహారాజు (వడివేలు) అణగారిన వర్గానికి చెందినవాడు. అట్టడుగు స్థాయి వాడైనా.. ఎమ్మెల్యేగా కొనసాగుతుంటాడు. అతడి కుమారుడే రఘువీరా( ఉదయనిధి స్టాలిన్) ఉన్నత విద్యను అభ్యసించిన అతడు, లోకల్ గా ఓ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ను చూసుకుంటుంటాడు. తన తండ్రి మహారాజు ఎమ్మెల్యే అయినప్పటికీ.. రఘువీరా మాత్రం తన కుటుంబ వృత్తి అయిన పందుల పెంపకాన్నికొనసాగిస్తూనే ఉంటాడు. అనుకోని ఓ సంఘటన వల్ల 15 ఏళ్లు తండ్రీ కొడుకులు మాట్లాడుకోకుండా ఉంటారు. ఇక అదే రామాపురం ప్రాంతంలో ఉన్నత వర్గానికి చెందినవాడు రత్నవేలు(ఫహద్ ఫాజిల్) రాజకీయంగా ఎదగాలని గట్టిగా ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే రత్నవేలు, మహారాజు వైరం ఏర్పడుతుంది. ఇక అదే ప్రాంతంలో లీలా(కీర్తి సురేశ్) ఉంటుంది. పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఓ శిక్షణా సంస్థను ప్రారంభిస్తుంది. అయితే అప్పటికే కాలేజీ రోజుల నుంచి లీలా, రఘువీర్ క్లాస్ మేట్స్. ఒకరిపై మరొకరి ఇష్టం ఉన్న మాట్లాడుకోరు. కానీ ఓ సారి లీలా శిక్షణా సంస్థను నిలిపివేయాలంటూ ఆమెపై దాడికి యత్నిస్తారు కొందరు దుండగులు. అప్పటి నుంచి ఆమెను రఘువీర కాపాడుతుంటాడు.

అసలు మహారాజు, రఘువీరా మధ్య ఎందుకు మాటలు లేవు? లీలాపై దాడికి దిగిన దుండగులు ఎవరు? వారిని రఘువీర్ ఎలా ఎదురించాడు? రత్నవేలు, మహారాజు మధ్య ఉన్న వైరం ఎందుకు నడిచింది? అది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? చివరిగా ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.
ఫస్టాప్ సాగిందిలా.. ఫస్టాప్ అంతా పాత్రలు, వాటి స్వభావాలను పరిచయం చేయడం, కీలకమైన అన్ని పాత్రల మధ్య వివాదం ఎలా తలెత్తెంది అని చూపించడంతోనే ముగుస్తుంది. ఎమ్మెల్యే మహారాజు, అతని కొడుకు రఘువీరా, రాజకీయంగా ఎదగాలనుకునే యువ నేత రత్నవేలు పాత్రలు, వాటి స్వభావాలను సమాంతరంగా పరిచయం చేస్తూ చూపించారు. రాజకీపరంగా ఎదగాలనుకునే రత్నవేలు ఈగో హర్ట్ అయితే ఎంతటి క్రూరుడుగా మారుతాడో అనేది.. ఓ కుక్కను కొట్టి చంపే సన్నివేశంతో చూపించారు.

లీలా(కీర్తిసురేశ్) శిక్షణ సంస్థను ఆపేయాలంటూ బెదిరింపులు రావడంతోనే అసలు కథ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే కథ కీలక మలుపు తిరుగుతుంది. కానీ లీలా సన్నివేశాల కొన్ని కథాగమనం నెమ్మదిగా కొనసాగుతుంది. అయితే లీలా సంస్థపై దాడి చేసింది రత్నవేలు సోదరుడు అని తెలుస్తుంది. అప్పుడు రఘువీరాకు అతడికి మధ్య వైరం మొదలవుతుంది. ఈ క్రమంలో గొడవ పెద్దదవుతుంది. సెటిల్ మెంట్ చేసేందుకు రత్నవేలు రంగంలోకి దిగుతాడు. గొడవను ఎలా ఆపాలా అని ప్రయత్నిస్తుంటాడు. అలా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ముందు తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్.. సెకండాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక్కడ ఉదయనిధి స్టాలిన్‌లోని పెర్ఫార్మెన్స్ ను చూడొచ్చు.
సెకండాఫ్ సాగిందిలా.. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాలా రేసీగా కొనసాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులు, వాటికి పైఎత్తులు ఇంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అనంతరం మొత్తం కథ మహారాజు-రఘువీరా, రత్నవేలు మధ్యే పోటాపోటీగా సాగుతుంది. పొలిటికల్ డ్రామాగా ముందుకెళ్తుంది. ఎన్నికల్లో మహారాజు గెలవకుండా ఉండేందుకు రత్నవేలు చేసే ప్రయత్నాలు, అలాగే తన అనుభవంతో, కొడుకు రఘువీరా తెలివి తేటలతో మహారాజు వాటిని ఎదుర్కోవడం వంటివి బాగున్నాయి.

ఇక ఎన్నికల రిజల్ట్స్ అనౌన్స్ చేసే సమయంలో ఉత్కంఠగా సాగుతుంది. మొత్తంగా కులం, డర్టీ పాలిటిక్స్, స్వార్థ ప్రయోజనాలు.. ఇలా పలు విషయాలపై సంభాషణలు బాగున్నాయి. క్లైమాక్స్ సీన్స్ - శాసనసభలో వచ్చే సంభాషణలు కూడా మెప్పిస్తాయి.
దర్శకుడు విషయానికొస్తే.. తమిళంలో భిన్నమైన కథలను అద్భుతంగా తెరపై చూపించగల సత్తా ఉన్న దర్శకుడు మారి సెల్వరాజ్. ఆయన కథల్లో మెయిన్ పాయింట్ సామాజిక అంశాలు. ప్రస్తుత సమాజంలో అణగారిన వర్గాల పట్ల కొనసాగుతున్న వివక్షను చూపిస్తూ కథను తీర్చుదిద్దుతారు. ఇదే ఆయన ప్రత్యేకత. ఇప్పుడు నాయకుడులోనూ తన మార్క్ దర్శకత్వాన్ని మరోసారి చూపించారు. ఎమ్మెల్యే మహారాజు, అతని కొడుకు రఘువీరా, రాజకీయంగా ఎదగాలనుకునే రత్నవేలు పాత్రలు, వాటి స్వభావాలను సమాంతరంగా చూపిస్తూ సినిమా మొత్తం స్క్రీన్‌ప్లే బాగానే నడిపించారు.
ఎవరెలా చేశారంటే: ఉదయనిధి స్టాలిన్ ఎప్పటిలాగా తన నటనతో ఆకట్టుకున్నారు. కీర్తి సురేష్ అప్పుడప్పుడు మెరిసింది. కానీ ఫహద్ ఫాజిల్., ఎమ్మెల్యే మహారాజుగా వడివేలు నటన సూపర్. ముఖ్యంగా వడివేలు యాక్టింగ్ కెరీర్‌లోనే హైలైట్. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లోని ఆయన నటన కంటతడి పెట్టించింది. ఫస్టాఫ్ లో అమాయకుడిగా, నిస్సహాయుడిగా కనిపించే ఆయన సెకండాఫ్ లో కొడుకు కోసం ఎవరితోనైనా పోరాడగలిగే ధైర్యవంతుడిగా కనిపించడం సూపర్. ఈ క్రమంలోనే ఆయన కారులో కూర్చొని ఫాహద్ ఫజిల్‌కు ఇచ్చే వార్నింగ్ సీన్, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో ప్రతినాయకుడి కోసం ఎదురు చూసే సన్నివేశాలు గూస్ బంప్స్ అని చెప్పాలి. ఇక ఫహద్ ఫాజిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన మార్క్ నటనతో పాత్రలో లీనమైపోయారు. ఆయన యాక్టింగ్, హావభావాలు కట్టిపడేశాయి.
సాంకేతిక విభాగాల విషయానికొస్తే.. ఏఆర్ రెహమాన్ సంగీతం పర్వాలేదనిపించింది. కథకు తగ్గటు సింపుల్ గా లాగించేశారు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, సెల్వ ఆర్కే ఎడిటింగ్ కూాడా పర్వాలేదనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఓకే. ఫైనల్ గా కథ కొత్తదేమీ కాదు. కానీ మంచి పొలిటికల్ థ్రిల్లర్.


Click it and Unblock the Notifications











