Nayeem Diaries Review: నయీం అసాంఘీక శక్తిగా ఎందుకు మారాడనే కోణంలో..
Rating: 2.75/5
పేదల కోసం నక్సలైట్‌గా మారిన నయీం ఊహించని రీతిలో మావోయిస్టులపై తిరగబడిన గ్యాంగ్‌స్టర్‌గా మారడం ఆసక్తికరమైన అంశంగా మారింది. అయితే నిజాయితీ, అంకింతభావంతో పనిచేసిన ఓ వ్యక్తి అసాంఘీక శక్తిగా ఎందుకు మారాడు? సమాజ చీత్కారానికి ఎందుకు గురయ్యాడు? ఓ లక్ష్యంతో ప్రారంభమైన జీవితం అర్ధాంతరంగా ఎందుకు ముగిసిపోయిందనే అంతు చిక్కని అంశాలు. అలాంటి వివాదాస్పద వ్యక్తి జీవితాన్ని కథా వస్తువుగా తీసుకొని కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ దాము బాలాజీ రూపొందించిన చిత్రం నయీం డైరీస్. కేజీఎఫ్, నారప్ప చిత్రాలతో ఆకట్టుకొన్న వశిష్ట సింహ నయీంగా నటించారు. తొలి చిత్ర దర్శకుడు దాము ఏ మేరకు ఆకట్టుకొన్నారు? నయీం పాత్రకు ఏ మేరకు న్యాయం చేశాడనే విషయాలను సవివరమైన సమీక్ష ద్వారా తెలుసుకొందాం..

నయీం డైరీస్ కథ..
భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం చిన్నతనంలో నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై పేదల కోసం పాటుపడాలనే లక్ష్యంతో మావోయిస్టుగా మారిపోతాడు. నిస్వార్ధంగా సేవ చూస్తే కొద్దికాలంలోనే నక్సలైట్ ఉద్యమంలో కీలక వ్యక్తిగా మారిపోతాడు. వ్యాస్ హత్య కేసులో జైలుకెళ్లిన నయీంకు అక్కడ ఊహించిన పరిస్థితులు ఎదురవుతాయి. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే సోదరి అనేక చేదు అనుభవాలు, సోదరుడి మరణం తన ఆలోచనా విధానాన్ని మార్చి వేస్తుంది. దాంతో నయీం పోలీసుల చేతుల్లో అసాంఘీక శక్తిగా మారిపోతాడు.

నయీం జీవితంలో మలుపులు ఇలా
వ్యాస్ హత్య తర్వాత నయీం ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకొన్నాయి. జైలులో నయీం ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? నయీం సోదరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? నయీం సోదరుడు వల్లీ ఎందుకు హత్య గురయ్యాడు? సోదరుడి మరణం తర్వాత నయీం తీవ్రమైన నిర్ణయాలు ఎందుకు తీసుకొన్నాడు? పోలీసుల చేతిలో నయీం ఆయుధంగా మారిన తర్వాత ఎలాంటి పనులకు పూనుకొన్నాడు లాంటి ప్రశ్నలకు సమాధానమే నయీం డైరీస్.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే..
నక్సలైట్‌గా రాజకీయ నేతలు, అక్రమార్కులను గడగడలాడించిన వ్యక్తి జీవితం గురించి నయీం డైరీస్ సినిమా తొలి భాగం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే నయీం జీవితాన్ని పాయింట్ టూ పాయింట్ చెప్పడంలో దర్శకుడు దాము బాలాజీ సఫలమయ్యారు. కానీ సినిమాటిక్‌గా చెప్పడంలో కాస్త తడబాటు కనిపిస్తుంది. కానీ నయీం తెరవెనుక జీవితం ఇలా ఉందా అని చెప్పడంలో ఆసక్తిని కలిగించారు. జైలులో మావోయిస్టుల జీవితాలు ఎలా ఉంటాయి? జైలు నుంచి వారి వ్యూహాలు ఎలా ఉంటాయి? వారిలో స్వార్థం, లోపాలు ఎలా ఉంటాయనేది ఇప్పటి వరకు తెలుగు తెర మీద చూడని విధంగా స్పష్టంగా చెప్పడం కనిపిస్తుంది. కథ డిమాండ్ మేరకు తొలి భాగం కొంచెం డాక్యుమెంటరీ మాదిరిగా కనిపిస్తుంది.

సెకండాఫ్‌లో హైవోల్టేజ్ సీన్లు
కానీ సెకండాఫ్‌లో కథ, కథనాలు హై వోల్టేజ్‌తో సాగుతాయి. మావోయిస్టులపై నయీం తిరుగబాటు, ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపిన విధానం, రాజకీయ నేతలకు ధమ్కీలు ఇవ్వడం లాంటి అంశాలు బాగుంటాయి. కానీ వాటిలో నాటకీయత లోపించిందనే ఫీలింగ్ కలుగుతుంది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలను చర్చిస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేదనే భావన కలుగుతుంది. చివరి 30 నిమిషాలు గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా చేయడంలో దర్శకుడు దాము బాలాజీ సక్సెస్ అయ్యారు.

దర్శకుడు దాము బాలాజీ గురించి
దర్శకుడు దాము బాలాజీ నయీం జీవితం గురించి చేసిన పరిశోధన సినిమాకు బలంగా మారిందనే చెప్పాలి. నయీం జీవితంలో వెలుగు చూడని అంశాలను చక్కగా తెరమీదకు తీసుకురావడంలో సఫలమయ్యారు. బెల్లి లలిత హత్యకు కారణమైన విషయాలను చక్కగా చూపించాడు, నయీం సోదరుడి మర్డర్‌కు సంబంధించిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా ఉంటాయి. సెకండాఫ్‌లో తెలంగాణ ఉద్యమ పార్టీ నేతను నయీం బెదిరించడం, అలాగే భువనగిరి ఎమ్మెల్యేను, ఆయన ఫ్యామిలీని వేధించిన తీరు లాంటి అంశాలు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. తొలి చిత్ర దర్శకుడిగా దాము బాలాజీ మంచి మార్కులే సంపాదించుకొన్నారు.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్
నయీంగా వశిష్ట సింహ తన పాత్రలో ఒదిగిపోయారు. పలు రకాల షేడ్స్ ఉన్న రోల్‌ను సునాయాసంగా పోషించాడు. ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా, నక్సలైట్ ఉద్యమంలో నిజాయితీపరుడిగా, అలాగే మావోయిస్టులకు వ్యతిరేకంగా అసాంఘీక శక్తిగా విభిన్నమైన నటనను ప్రదర్శించాడు. తన గంభీరమైన డైలాగ్స్‌తో ఆ పాత్రకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. నయీం యువకుడి పాత్రలో బాహుబలి నిఖిల్ నటన బాగుంది. ఇక ఈ చిత్రంలో నయీం సోదరిగా యజ్ఞాశెట్టి అందం, అభినయంతో ఆకట్టుకొన్నారు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. నయీం భార్యగా బిగ్‌బాస్ దివి వద్యా గ్లామర్‌పరంగా అదరగొట్టింది. రొమాంటిక్ సన్నివేశాల్లో వశిష్ట, దివి కెమిస్ట్రీ బాగుంది. దివి వద్యా తన అందంతో మాస్ ఆడియెన్స్‌కు మరింత చేరువయ్యే అవకాశం కనిపించింది. బెల్లి లలితగా సంయుక్త ఆకట్టుకొన్నది. మిగితా పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ అంశాలు గురించి
సాంకేతిక అంశాల్లో సినిమాటోగ్రఫికి స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్ సీన్లను భార్గవ సురేష్ అద్భుతంగా తెరకెక్కించారు. ఫారెస్ట్‌లో ఎన్‌కౌంటర్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్‌ను కెమెరాలో మంచిగా బంధించారు. ప్రభాకర్ అరున్ మ్యూజిక్ పలు సన్నివేశాలను హైలెట్ చేసింది. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ బాగుంది. పద్మారెడ్డి, వరదరాజు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
Recommended Video

ఫైనల్‌గా
నక్సలైట్, మావోయిస్టుల ఉద్యమాల్లో వ్యూహాలు, లోపాలతోపాటు, రాజకీయ, పోలీసు వ్యవస్థల తీరుపై సంధించిన సినీ విమర్శనాస్త్రం నయీం డైరీస్. యాక్షన్, డ్రామా, ఎమోషనల్ పాయింట్లతో కథ, కథనాలు ఉంటాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో డైలాగ్ పార్ట్ ఎక్కువై, విజువల్ ప్రజెంటెషన్ తక్కువగా అనిపిస్తుంది. క్రైమ్ డ్రామా, వామపక్ష నేపథ్యంగా వచ్చే సినిమాలను ఆదరించే వారికి నయీం డైరీస్ తప్పక నచ్చుతుంది. నయీం జీవితానికి సంబంధించి చాలా విషయాలు స్పష్టంగా తెరమీద ఫీలయ్యేలా ఉంటుందీ ఈ చిత్రం. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ కలిగించదు. వివాదాస్పద అంశాలు ఆలోచింప జేసే విధంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











