Nene Naa movie Review పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్.. రెజీనా మూవీ హిట్టా? ఫట్టా?
నటీనటులు: రెజీనా కసండ్రా, అక్షర గౌడ, వీ జయప్రకాశ్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తదితరులు
దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాత: రాజశేఖర్ వర్మ
మ్యూజిక్: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: గోకుల్ బినోయ్
ఎడిటింగ్: వీజే సాబు జోసెఫ్
రిలీజ్ డేట్: 2023-08-25
పురావస్తుశాఖలో ఆర్కియాలజిస్టుగా దివ్య (రెజీనా కసండ్రా) పనిచేస్తుంటుంది. అయితే ఓ అడవిలో విదేశీయుడు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతాడు. మరణం తర్వాత శవం అదృశ్యం కావడంతో ఆర్కియాలజిస్టు దివ్య సహాయాన్ని పోలీసులు తీసుకొంటారు. అయితే అనూహ్యంగా ఈ కేసు దివ్య మెడకు చుట్టుకొంటుంది.

విదేశీయుడు మరణం వెనుక అసలు కారణం ఏమిటి? విదేశీయుడు మరణం వెనుక పరిశోధనలో దివ్యకు తెలిసిన భయంకర నిజాలు ఏమిటి? గత జన్మలో దయమంతి (రెజీనా)కి దివ్యకు ఉన్న లింకేమిటి? గత దయమంతి ఎలా హత్యకు గురైంది? విదేశీయుడి మరణం తర్వాత పోలీస్ అధికారి ఎలా హత్యకు గురయ్యాడు? దివ్య సోదరుడికి ఎలాంటి ముప్పు వాటిల్లింది? ఇలాంటి సమస్యలకు గత జన్మ తాలుకు సంబంధం ఏమిటి? కేసు పరిశోధనలో దివ్యకు బొబ్బిలిరాజా (వెన్నెల కిషోర్) ఎలా సహకరించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే నేనే నా..?! సినిమా కథ.
గత జన్మలో అన్యాయానికి గురైన ఓ యువతి.. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకొనే పాయింట్‌తో దర్శకుడు కార్తీక్ రాజు చేసిన ప్రయత్నం బాగానే ఉంది. కానీ కొత్తగా, విభిన్నమైన కంటెంట్, ఇంట్రెస్టింగ్ సీన్లు రాసుకొని ఉంటే బాగుండేది. రెగ్యులర్ కథ, కథనాలతో ఫస్టాఫ్ సాగదీసినట్టు ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా ఉండే పిరియాడిక్ నేపథ్యం ఉన్న ఎపిసోడ్ చాలా కామెడీగా చిత్రీకరించారనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో అనే విషయం ముందే స్పష్టంగా అర్ధమవుతుంది.

దివ్య, దయమంతిగా రెజీనా కసండ్రా రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రలో కనిపించింది. పిరియాడిక్ నేపథ్యం ఉన్న జమీందారి కుటుంబంలో దయమంతి పాత్రలో దర్బం, హోదాతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కానీ కంటెంట్‌లో బలం లేకపోవడం, ఇతర పాత్రల్లో నాసిరకమైన ఆర్టిస్టులు ఉండటంతో రెజీనా పాత్ర తేలిపోయింది. దివ్య పాత్రతో సాగే బొబ్బిలి రాజా రోల్‌లో వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకునేలా ఉంది. వెన్నెల కిషోర్ పాత్రపై మరింతగా దృష్టి పెట్టి ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమా వరకు సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు తెరపైన చాలా కామెడీగా ఉన్నాయి. నాసిరకం గాయకులతో పాడించిన పాట ఆకట్టుకోలేకపోయింది. గోకుల్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. వీజే సాబు జోసెఫ్ ఎడిటింగ్ పేలవంగా ఉంది. రాజశేఖర్ వర్మ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కంటెంట్‌పై ఇంకా కొంత వర్క్ చేసి ఉండి.. మెరుగైన నటులను తీసుకొని ఉంటే సినిమా రేంజ్ పెరిగి ఉండేదనిపిస్తుంది.

గత జన్మలో నమ్మినవారు చేసిన మోసానికి గురైన ఓ అమ్మాయి.. తన కలలు, జీవితంలో ముచ్చట తీరకుండానే అర్ధాంతరంగా జీవితాన్ని చాలించి.. ప్రస్తుతం జన్మలో ప్రతీకారం తీర్చుకోవడమే పాయింట్ బాగుంది. కానీ ఈ కథ ఊహకు, వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తుంది. రెజీనా, అక్షర గౌడ గ్లామర్ కొంత ఊరటగా ఉంటుంది. పిరియాడిక్ నేపథ్యంతో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడేవారికి నచ్చే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్లలో ఆడియెన్స్ కనెక్ట్ అయితే రెజీనాకు హిట్ లభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











