twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుల కోసం 'నిరీక్షణ'

    By Staff
    |

    Nireekhana
    సినిమా: నిరీక్షణ
    విడుదల: 1-11-2005
    నటీనటులు: ఆర్యన్‌ రాజేష్‌, శ్రీదేవి, నాగేంద్రబాబు, రమాప్రభ,
    ఎమ్మెస్‌ నారాయణ, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, 'సత్యం' రాజేష్‌,
    అలీ, బెనర్జీ, సూర్య, గుండు హనుమంతరావు, గౌతం రాజు, శివారెడ్డి,
    జ్యోతి, అనంత్‌, గణేష్‌, నర్సింగ్‌ యాదవ్‌, కల్పన, అర్చనారాయ్‌ తదితరులు
    కెమెరా: శరత్‌
    సంగీతం: శ్రీలేఖ
    కళ: బి. వెంకటేశ్వరరావు
    కూర్పు: కెవి కృష్ణారెడ్డి
    పాటలు: చంద్రబోస్‌, భాస్కరభట్ల రవికుమార్‌, అభినయ శ్రీనివాస్‌
    నిర్మాత: డి.రామానాయుడు
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎన్‌ సీతారామ్‌

    సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు ఈసారి ట్రెండ్‌కు అనుగుణంగా, కథనానికి ప్రాముఖ్యత ఇస్తూ తీసిన సినిమా 'నిరీక్షణ'. కానీ కథలో మలుపులు ఎక్కువై, పాత్రలు బలంగా లేకపోవడం వల్ల, సినిమా చూసి బయటకు వెళ్ళిన ప్రేక్షకుడు సినిమా బాగుందని నమ్మకంగా చెప్పలేడు.‌

    అను (శ్రీదేవి) సున్నితమైన మనస్తత్వం, సహాయపడే గుణం గల అమ్మాయి. ఈ సంపన్నుల అమ్మాయి కాలేజిలో చదువుకుంటూ ఉంటుంది. తల్లి లేని ఆమె అంటే తండ్రి శరత్‌ (నాగేంద్రబాబు)కి అమితమైన ప్రేమ. తండ్రీ కూతుళ్ళు స్నేహితుల్లా మెలుగుతుంటారు. అను కాలేజిలో అలీ, శివారెడ్డి, జ్యోతి చదువుతుంటారు. జ్యోతికి ప్రాక్టికల్‌ జోక్స్‌ అంటే సరదా. ఆమె జోక్‌కి బలైపోయిన అమ్మాయిని చూసి బాధతో అను జ్యోతిని మందలిస్తుంది. అది మనసులో పెట్టుకుని అనుపై కక్ష సాధింపునకు దిగుతుంది జ్యోతి. ఆమె శివారెడ్డి, అలీ సాయంతో అను ఇంట్లో చిచ్చు పెట్టడానికి ప్లాన్‌ చేస్తుంది. అనుపై తండ్రికి అనుమానం కలిగేలా చేస్తుంది. శరత్‌ స్నేహితుడు చంద్రమోహన్‌ కూతురు అదే సమయంలో పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకుంటుంది. ఇవన్నీ మనసులో పడడంతో శరత్‌ తన కూతురు అనును ఊరి చివర గెస్ట్‌ హౌస్‌లో బంధించి, తను ఢిల్లీ క్యాంపుకి వెళ్ళిపోతాడు.‌

    హీరో ఆర్యన్‌ రాజేష్‌ ట్రాక్‌ సమాంతరంగా నడుస్తూ ప్రధాన కథలో కలుస్తుంది. అతను ఒక జులాయి విద్యార్ధి. కాలేజిలో గొడవపడి ఒక విద్యార్ధి బుర్ర పగలగొడతాడు. పోలీసులకు భయపడి ఒక గెస్ట్‌ హౌస్‌కి చేరుకుంటాడు. అనుని చూసి దయ్యమనుంకుంటాడు. తలుపు తీయమన్నా తీయడు. ఈ లోపు పోలీసులు హడావుడి తగ్గి వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిన అతనికి 'కనబడటలేదు' యాడ్‌లో అను ఫోటో కన్పిస్తుంది. ఆమెను మిత్రుడు రాజేష్‌తో కలిసి కిడ్నాప్‌ చేయాలన్న ఆలోచన వస్తుంది. అసలా ప్రకటన ఇచ్చింది ఎవరన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.‌

    వూహించని మలుపులు సినిమాకు ప్రాణం. కథ మొత్తం సినిమాటిక్‌గా కొంత కృతకంగా నడిచినా కథనంలో వేగం కారణంగా ఎక్కడా బోర్‌ కొట్టదు. రెండు పాటలు బాగున్నాయి. అసభ్యత, మితిమీరిన హింస లేకపోవడం వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చవచ్చు.‌

    ఎక్కడో ప్రారంభమై మరెక్కడో ముగిసిన ఈ కథలో ఏ పాత్రకీ స్పష్టమైన వ్యక్తిత్వం లేకపోవడం స్క్రిప్టు లోపం. హీరోయిన్‌ అను తనను ఎవరు ఇరికించారో తెలుసుకోడానికి ప్రయత్నించకపోవడం విడ్డూరం. అంత పెద్ద జులాయి అయిన హీరో అంత తేలిగ్గా మారిపోవడం అసహజం. హీరోయిన్‌ ఉంటున్న ప్రదేశంలోనే ఆమెను కిడ్నాప్‌ చేసి అక్కడే బంధిస్తాడు హీరో. ఆమెను అక్కడ బంధించిందెవరో తెలుసుకోడానికి హీరో ప్రయత్నించడు. సినిమాలో క్లెయిమాక్స్‌ పాత సినిమాల్లో లాగా గ్రూప్‌ ఫోటోలా ఉంది. సినిమా పోలీసులు వచ్చి చిక్కుముడి విడదీస్తారు. కథ సుఖాంతం.‌

    కృష్ణ భగవాన్‌, బ్రహ్మానందం అతిధి నటులని టైటిల్స్‌లో వేసినప్పటికీ వారు ఒక్క సీన్‌లోనూ కన్పించరు (ఎడిటింగ్‌లో ఎగిరిపోయి ఉంటారు). కెమెరా కొన్నిచోట్ల మాత్రమే బాగుంది. మాటలు పెద్దగా ఆకట్టుకోవు. ఎడిటింగ్‌ షార్ప్‌గా లేదు. కథలో మలుపులే గానీ దర్శకుడి మెరుపులు లేవు. స్క్రీన్‌ ప్లేని పూర్తిగా మరిచిపోయారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X