ఈ సినిమా చూస్తారా? నో!

చిత్రం: నో
నటీనటులు: తారకరత్న, ఛాయాసింగ్, ఆశిష్ విద్యార్ధి,
బ్రహ్మానందం, శివాజీ రాజా, వేణుమాధవ్ తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం: పప్పు
నిర్మాతలు: డి.అనిల్‌కుమార్, మారిసెట్టి సుధాకర్, పల్లి కేశవరావు
సీనియర్ సౌండ్ ఇంజినీరుగా సినిమా పరిశ్రమకు చిరపరిచితుడైన పప్పు మొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను బాధపెట్టింది. హీరో తారకరత్నకు బ్రేక్ ఇసుందని భావించిన ఈ చిత్రం అతని భవిష్యత్తుకే బ్రేక్ వేసేలా ఉంది. అర్ధం పర్ధం లేని కథ సినిమాను బలి తీసుకుంది.
కథ: శివ (తారకరత్న) అనే పనీపాటా లేని కుర్రాడు ఓరోజు బస్టాపులో ప్రియ (ఛాయాసింగ్)ను చూసి ఢామ్మని ప్రేమలో పడిపోతాడు. ఆమె చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాడు. ప్రియ ఓ ఛారిటబుల్ ట్రస్టులో పనిచేస్తుంటుంది. ఆ ట్రస్టు ఛైర్మన్ డికె (ఆశిష్ విద్యార్ధి). అతని భార్యతో ఆమెకి స్నేహం ఏర్పడుతుంది. భార్యలను చంపేసే అలవాటున్న డికె కొత్త భార్యను చంపినప్పుడు ప్రియ అతడిని నిలదీస్తుంది. డికె ఆమెపై పగపడతాడు. గుండాల్ని వెంటేసుకుని ఆమెను వెంబడిస్తుంటాడు. అప్పుడామె హీరో సహాయాని అర్ధిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఏ సినిమాలోనైనా కథకు సంబంధం లేని ట్రాక్‌లు ఉన్నాయంటే ఆ సినిమాలో కథే లేదని అర్ధం. ఈ సినిమాలో వేణుమాధవ్ ట్రాక్, అందుకోసం ఫైట్స్ అటువంటివే. హీరో హీరోయిన్లను కలపడమే కథ కావడంతో ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. ఈ సినిమా ఇంటర్వల్ నుండి ప్రారంభం కావడం గొప్ప విశేషం. సినిమాలో మూడు ఐటమ్ సాంగ్స్ ఉండడం మరో రికార్డు. హీరో హీరోయిన్ల కుటుంబ నేపధ్యం ఎస్టాబ్లిష్ కాలేదు. దృశ్యాలు మంచి విజువల్ సెన్స్‌తో బాగా వచ్చాయి కానీ ఆ దృశ్యాలలో కథకు సంబంధించిన ఫీల్‌లేకపోవడంతో చల్లబడ్డాయి.
హీరో విలన్‌ని ముఖాముఖి ఎదుర్కొన్నప్పుడే ఏ సినిమా కథ అయినా పండుతుంది. ఈ సినిమాలో హీరో విలన్‌ని ఏమీ చేయడు. సినిమా 'రూల్స్' ప్రకారం ఫైట్ కూడా చేయడు. కాగల కార్యం గంధర్వుడు చేసినట్టు సిబిసిఐడి అధికారి వచ్చి విలన్‌ను అరెస్టు చేస్తాడు. మొదటి పాటలో ఎన్టీఆర్, బాలకృష్ణలను పోలిన డ్యాన్స్ సీక్వెన్సుల ద్వారా తారకరత్న వారి వారసుడన్న విషయాన్ని గుర్తు చేశారు. మరో పాటలో హీరో గుప్పిట్లోని ఇసుక హీరోయిన్‌గా మారడం బాగుంది. మెక్‌బ్రూక్స్ 'సైలెంట్ మూవీ'లోని సీన్‌ని చివర్లో వాడుకుని కామెడీని తెద్దామనుకున్నా అది తుస్సుమంది. వేణుమాధవ్, బ్రహ్మానందం డైలాగులు పేలాయి. సీన్స్‌ను షార్ప్‌గా కట్ చేయడం బాగుంది. తారకరత్న బాగా కృషి చేశాడు కానీ అది బూడిదలో పోసిన పన్నీరు అయింది. మంచి కథను ఎంచుకుంటే ఈ సినిమాలోని ప్లస్ పాయింట్లు కలిసివచ్చేవి. మొత్తంగా ఈ సినిమాను చూడకపోవడమే మంచిది.


Click it and Unblock the Notifications











