'దమ్ము'న్న... (రివ్యూ)
-జోశ్యుల సూర్య ప్రకాష్
సంస్థ: సి.సి.మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లి.
నటీనటులు: ఎన్టీఆర్, త్రిష, కార్తీక, వేణు, కోట శ్రీనివాసరావు, సుమన్, నాజర్, కిశోర్, సంపత్, శ్రీధర్‌రెడ్డి, చలపతిరావు, భానుప్రియ, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు
రచన: ఎమ్.రత్నం
పాటలు: చంద్రబోస్
కెమెరా: ఆర్థర్ విల్సన్
సంగీతం: కీరవాణి
నిర్మాత: కె.ఎ.వల్లభ
సమర్ఫణ :కె.ఎస్.రామారావు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను
"దమ్ము పట్టుకున్న కత్తి లో ఉండదు రా రక్తంలో ఉండాలి...", "సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసేది ఎగిరి కొరకడానికే....." వంటి మాస్ డైలాగులతో దమ్ము వచ్చేసింది. సింహా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి చాలా జాగ్రత్తలు తీసిన ఈ చిత్రం ఎన్టీఆర్ లోని మరో యాంగిల్ ని వెలికి తీసిందనే చెప్పాలి. చాలా సెటిల్డ్ గా ఎమోషన్స్ ని ఎక్కడా తొణకకుండా ఎక్కువ, తక్కువా కాకుండా ప్రదర్శించాడు. ఫస్టాఫ్ అదిరిపోయిన దమ్ము.. సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ కొద్దిగా నీరసపడ్డా... ఓవరాల్ గా దమ్మున్న సినిమా అనిపించుకుంది.
తనకి సంభందం లేని వారు ప్రమాదంలో ఉంటే వారి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడే అనాధ రామచంద్ర(ఎన్టీఆర్). సిటీలో చిన్న చిన్న ఫైట్ లు చేసుకుంటూ అప్పుడప్పుడూ త్రిష (సత్య)అనే కోటీశ్వరాలు ప్రేమలో పడి తిరుగుతూ హ్యాపీగా లైఫ్ గడిపేస్తూంటాడు. అయితే సత్య తండ్రి అనాధకు తన కూతురుని ఇచ్చి చేయడని తెలియటంతో తప్పనిసరి పరిస్తితుల్లో ... వాసిరెడ్డి వంశీకులైన ఓ పెద్ద జమీందార్(కోట శ్రీనివాసరావు) కుటుంబానికి వారసుడుగా దత్తతకు వెళతాడు. అయితే ఆ వారసత్వం లభించాలంటే అనాధ అనే నిజం దాచి పెట్టి పాతికేళ్ల తర్వాత ఆ వంశానికి వస్తున్న నిజమైన వారసుడు అని చెప్పాలంటారు. అలాగే అని ఆ పల్లెకు వెళ్లి ఆ కుటుంబంలో ప్రవేశిస్తాడు.
చక్కగా ఆ కుటుంబాన్ని చూపించి పెళ్లి చేసుకుని వెళ్లిపోదామనుకున్న అతనికి అక్కడో ట్విస్టు ఎదురవుతుంది. ఆ కుటుంబానికి కొన్ని తరాలుగా రగులుతున్న పగ ఉందని తెలుస్తుంది. అవతలి వాళ్లు పగే ప్రాణంగా బ్రతుకుతున్నారని,అందుకోసం ప్రాణాలు సైతం తీయటానికి వెనకాడరని తెలుస్తుంది. అంతేగాక ఆ ఇంటి వారసుడుగా వెళ్లినందుకు ఆ పగకోసం అతను సైతం పోరాటానికి బయిలుదేరాల్సి వస్తుంది. ఈ మధ్యలో అక్కడ అతనికో మరదలు నీలవేణి (కార్తీక) పరిచయ్యి అతనిపైనే ఆశలు అన్ని పెట్టుకుంటుంది. ఆ సమయంలో రామచంద్ర ఏం చేసాడు...అప్పటికే ఆ ఇంటితో అల్లుకున్న అనుబంధం కోసం పోరాడాడా లేక... పలాయినం చిత్తగించాడా అన్నది తెరపై చూడాల్సిందే.
రెండు జమీందారీ కుటుంబాలు.. వాటి మధ్య తగువు వంటి పిక్షన్ కథతో వచ్చిన ఈ చిత్రం కథగా వింటే పాత వాసనలు వచ్చినా, సినిమాటెక్ గా దాన్ని తెరపై ఎక్కడా ఆలోచన తలఎత్తకుండా... తెరపై నుంచి చూపు మరల్చకుండా టెంపోతో నడిపిన ఘనత బోయపాటి శ్రీనుదే. ఫస్టాఫ్ మొత్తం ఎక్కడా ఆగకుండా నడిచిన ఈ చిత్రం ..ఆ ఫస్టాఫ్ మొత్తం కథని సెటప్ చేయటానికే సరిపెట్టారు. సెకండాఫ్ లో విలన్ తో పోరాటంలో కాస్త స్క్రీన్ ప్లే బిగువు తగ్గి,క్లైమాక్స్ కి వచ్చేసరికి బాగా డల్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మారటం కథకు నిండుతనం ఇవ్వలేదు. విలన్ చుట్టూనే అల్లుకున్న ఈ కథ..ఒక్క సన్నివేశంతో అంత దారుణమైన విలన్ మారటం అసంభవమనిపిస్తుంది.
అంతేగాక ఎంతో మంది ప్రాణాలు తీసి అరాచకం సృష్టించిన విలన్ కి సరైన శిక్ష పడలేదని అసంతృప్తి మిగులుస్తుంది. అలాగాక విలన్ ని చంపేయటమో..విలన్ తనంతట తాను చావటమో చేసి ఉంటే అంత బిల్డప్ చేసిన విలన్ నాజర్ పాత్రకు కరెక్టు జస్టిఫికేషన్ ఇచ్చినట్లు ఉండేది. అలాగే సెకండాఫ్ లో రొమాన్స్ ,కామెడీ సీన్స్ పెడితే నిండుతనం వచ్చి పస్టాఫ్ లాగానే బాగుండేది.
ఇక ఈ చిత్రంలో చెప్పుకోతగ్గ అంశాలులో మొదటి మాట్లాడుకోవాల్సింది ఫైట్స్ గురించి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఫైట్ చాలా అద్బుతంగా ఎన్టీఆర్...బ్రతకండి బ్రతకండి అంటే వినలేదు కదరా..వంటి డైలాగులు చెపుతూ చంపే సీన్ చాలా ఎమోషనల్ గా కనెక్టు చేస్తుంది. అలాగే డైలాగులు సైతం ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి రాసారు. ఎన్టీఆర్ రాజకీయాలోకి రావాలనే ఉద్దేశంతో కొన్ని డైలాగులు, చరిత్ర గురించి చెప్పే డైలాగులు బాగా రెస్పాన్స్ వచ్చింది. అయితే చనిపోయాడనుకున్న సుమన్ మళ్లీ కనపడటం కథలో పెద్ద ట్విస్టు అనుకున్నారు కానీ అది పేలలేదు. దానికి కారణం... ఆ ట్విస్ట్ కు హీరో కు ఏ సంబంధం లేకపోవటమే. ఇక, ఎన్టీఆర్ బావ గా చేసిన వేణు పాత్ర సినిమాలో పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే అక్కా చెల్లెళ్లు సెంటిమంట్ సినిమాలో అంతగా లేకపోవటమే...
ఇక ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పుకునేదేమిలేదు. త్రిష,కార్తీక మాత్రం గ్లామర్ క్వీన్స్ గా మెరిసిపోయారు. కార్తీక కు మళ్లీ ఈ సినిమాతో లైఫ్ టర్న్ అయ్యి అవకాశాలు వచ్చే ఛాన్స్ కనపడుతోంది. కోట శ్రీనివాసరావు, నాజర్ తమ తమ పాత్రల్లో పూర్తిగా లీనమై చేసి సీన్స్ పండించారు. కామెడీ విషయానికి వస్తే కాస్త వల్గారిటీ ఉన్నా బాగానే పండింది. అలీ కామెడీ బాగానే ఉన్నా బ్రహ్మానందంని వాడుకోలేదు. ఎడిటింగ్, కెమెరా వర్క్ చాలా బాగున్నాయి. దర్శకత్వం బోయపాటి టిపికిల్ స్టైల్ లోనే ఉంది. కొన్ని సీన్స్ లో ఎన్టీఆర్. .సింహా లో బాలకృష్ణను గుర్తుకు తెచ్చాడు.
ఫైనల్ గా మాస్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం పూర్తిగా వారికి నచ్చే అవకాశం ఉంది. సెకండాఫ్ మరింత టైట్ గా ఉండి ఉంటే సినిమా రేంజి ఇంకా పెరిగేది. హింస డోస్ కాస్త తగ్గించి ఉంటే కుటుంబాలు కూడా బాగా రావటానికి అవకాశం ఉండేది. ఎందుకంటే చాలా సీన్స్ ప్రత్యేకంగా సెంటిమెంట్ తో మహిళలను ఉద్దేశించి చేసారు. ఎన్టీఆర్ అభిమానులుకు పండగ అనిపించే ఈ చిత్రం ఈ వేసవిలో మంచి ఎంటర్టైనరే...వారిని ఏ మాత్రం నిరాశ పరచదు.


Click it and Unblock the Notifications











