ఆకట్టుకుంటోన్న ఓదెల రైల్వే స్టేషన్
రేటింగ్ : 2.25
క్రైమ్ థ్రిల్లర్ లు అంటే తెలుగు వారికి ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. అది ఏ జానర్ మూవీ అయినా తెరకు అతుక్కుపోతారు. నరాలు తెగిపోయేంత ఉత్కఠ అందిస్తే చాలు సినిమాకు బ్రహ్మరథం పట్టేస్తారు. తాజాగా ఇదే క్యాటగిరీలో ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందింస్తామంటూ ఓదెల రైల్వేస్టేషన్ టీమ్ రంగంలోకి దిగింది. ఆహా వేదికగా విడుదలైన ఓదెల రైల్వేస్టేషన్ నిజంగానే ప్రేక్షకులకు కావాల్సినంత ఎగ్జైట్మెంట్ అందించిందో లేదో చూద్దాం.

కథా-కథనం
నిజ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఓదెల రైల్వేస్టేషన్ కథ ప్రారంభంలోనే ఒళ్లు జలదరింపజేస్తుంది. ఓ స్త్రీ ఒంటినిండా బురదతో, చేతిలో మొండెం లేని తలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోతుంది. ఆమెను ఆ విధంగా చూసిన గామస్థులు, పోలీసులు జడుసుకున్నట్లుగానే ప్రేక్షకులు కూడా ఒకింత భయపడతారు. ఇక కథలోకి వెళితే, ఓదెల అనే ప్రాంతంలో వరుసగా నవ వధువులందరూ హత్యకు గురవుతుంటారు. పెళ్లైన మరుసటి రోజే అమ్మాయిలను అపహరించి అతి కిరాతకంగా హత్య చేస్తుంటాడు ఓ సీరియల్ కిల్లర్. అదే ప్రాంతానికి ట్రైనింగ్ నిమిత్తం వచ్చిన ఐపీఎస్ అధికారి అనుదీప్ ఈ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మరోవైపు అదే ఊరికి చెందిన జంట రాథిక, తిరుపతి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ వరుస హత్యల నడుమ వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. అసలు నేరస్థుడు ఎవరు? ఐపీఎస్ అనుదీప్ ఈ వరుస హత్యలను ఆపగలిగాడా లేదా అన్నది అసలు కథ.

సూటిగా సుత్తిలేకుండా:
క్రైమ్ థ్రిల్లర్ లు అంటే సూటిగా సుత్తిలేకుండానే ఉండాలి. అప్పుడే కిక్ ఉంటుంది. అదే సూత్రాన్ని నమ్ముకుని ఈ సినిమాను సింపుల్ గా గంటన్నర నిడివిలో పూర్తి చేశారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంపత్ నంది రాసుకున్న కథను అశోక తేజ తెరకెక్కించారు. టెక్నికల్ పరంగా సినిమా క్వాలిటీ సూపర్ గా ఉందనే చెప్పాలి. ఇక్కడ సినిమాటోగ్రాఫర్ సౌందర రాజన్ కు మంచి మార్కులు పడాల్సిందే. సినిమాకు కావాల్సిన మూడ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు యాప్ట్ గా సరిపోయింది. అయితే డైరెక్టర్ కథ చెప్పిన విధానంలో కొన్ని లోటు పాట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పాత్రల క్యారెక్టరైజేషన్ పై మరి కాస్త వర్కౌట్ చేసి ఉంటే మరింత బాగుండేది. ముఖ్యంగా బోల్డ్ సీన్ల డోస్ కాస్త ఎక్కువైందనే చెప్పాలి. ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

యాక్టింగ్ పరంగా ఓకే :
ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇంచుమించు ప్రతి పాత్రలోనూ కాస్త పాప్యులర్ అయిన ఆర్టిస్టులే కనిపిస్తుండటంతో సినిమాకు కాస్త స్కోప్ పెరిగింది. హెబ్బా పటేల్ బోల్డ్ గా ఎప్పటిలాగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించేసింది. తిరుపతిగా వశిష్ఠసింహా ఆకట్టుకున్నాడు. సాయి రోనక్, గగన్, పూజిత పొన్నాడ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఏమైనా ఈ వీకెండ్ కాసేపు టైమ్ దొరికితే ఆహాలో స్ట్రీమ్ అవుతన్న ఓదెల రైల్వేస్టేషన్ కు ట్యూన్ అవ్వచ్చు.


Click it and Unblock the Notifications











