Oka Brundavanam Movie Review: ఒక బృందావనం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: బాలు, షిన్నోవా, సాన్విత, శివాజీ రాజా, రూపాలక్ష్మీ, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, మహబూబ్ భాషా, మహేందర్, వంశీ నెక్కంటి తదితరులు
దర్శకత్వం: సత్య బొత్స
నిర్మాతలు: కిషోర్ తాటికొండ, వెంకట్ రేగెట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు
సినిమాటోగ్రఫి: రాజ్ కే నల్లి
ఎడిటర్: తమ్మిరాజు, సంతోష్ కామిరెడ్డి
మ్యూజిక్: సన్నీ సాకేత్
బ్యానర్: సీర్ స్టూడియోస్ బ్యానర్
రిలీజ్ డేట్: 2025-05-23
ఈవెంట్ కంపెనీలో కెమెరామెన్‌గా పనిచేసే రాజా విక్రమ్ (బాలు)కు అమెరికాకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో డబ్బు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఇక తండ్రి (వంశీ నెక్కంటి) చేసే పెళ్లి ప్రయత్నాలను అడ్డుకొని ఓ డాక్యుమెంటరీ తీయాలని మహీ (షిన్నోవా) ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉండగా, అనాథాశ్రమంలో ఉండే చిన్నారి నైనిక (సాన్విత) జోసెఫ్ (శుభలేఖ సుధాకర్) అనే వ్యక్తిని కలువడానికి అక్కడి నుంచి పారిపోతుంది. అయితే తెలియని వ్యక్తి కోసం పారిపోయిన చిన్నారి నైనిక లైఫ్ ఆసక్తికరంగా ఉండటంతో ఆమె గురించి డాక్యుమెంటరీతో తీయాలని రాజా, మహీ ప్లాన్ చేస్తారు.

అమెరికాకు వెళ్లాలనే రాజా విక్రమ్‌కు ఎదురైన సమస్యలు ఏమిటి? తన లైఫ్‌లో జరిగిన లవ్ బ్రేకప్ తర్వాత రాజా పరిస్థితి ఏమిటి? ఆరు నెలలు పెళ్లి విషయం ఎత్తవద్దని తండ్రికి చెప్పి మహీ ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చింది? ఏ విషయంపై, ఎందుకు డాక్యుమెంటరీ తీయాలని మహీ ప్రయత్నించింది? తనకు తెలియని జోసెఫ్‌ను కలిసేందుకు నైనిక అనాథాశ్రమం నుంచి పారిపోయింది? చివరకు రాజా అమెరికాకు వెళ్లాడా? ఇంతకు జోసెఫ్ ఎవరు? అతడిని నైనిక ఎందుకు కలువాలని అనుకొన్నది? నైనిక కోరిక కోసం రాజా, మహీ చేసిన జర్నీ ఎలా సాగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఒక బృందావనం సినిమా కథ.
ఓ పాప చుట్టు దర్శకుడు సత్య బొత్స రాసుకొన్న ఎమోషనల్ పాయింట్ బాగుంది. ఈ కథలో ఎలాంటి పరిచయం లేని, భిన్నమైన లక్ష్యాలు ఉన్న యువతీ, యువకుడు ఆ పాప కోసం కలిసి ట్రావెల్ చేయడమనే పాయింట్ నిజంగానే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కథను ఎస్టాబ్లిష్ చేయడానికి, పాత్రలను పరిచయం చేసే క్రమం చూస్తే కాస్త ఎక్కువ టైమ్ తీసుకొన్నాడనిపిస్తుంది. కొన్ని చోట్ల కథ ముందుకు పోవడం లేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఓ మంచి ఎమోషనల్ పాయింట్‌తో ఫస్టాఫ్‌ను ముగించి సినిమా రెండో భాగంపై ఆసక్తిని పెంచడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.
ఒక బృందావనం సినిమా సెకండాఫ్ జర్నీ చాలా భావోద్వేగంతో సాగుతుంది. జోసెఫ్ కోసం నైనిక వెతుకులాట.. ఆమెతోపాటు రాజా, మహీ ప్రయాణం తెర మీద కొత్తగా ఉంటుంది. పెద్దగా పరిచయం లేని హీరో, హీరోయిన్లు, చిన్నారి పెర్ఫార్మెన్స్ సెకండాఫ్‌ను నిలబెట్టేలా చేసింది.కాకపోతే కథ, కథనాలపై మరింత జాగ్రత్త పడి ఉండే ఇంకా బెటర్‌గా ఫీల్ గుడ్ సినిమాగా మారి ఉండేది. అయినా దర్శకుడు చేసిన అటెంప్ట్‌ను అప్రిషియేట్ చేయాల్సిందే.
రాజా విక్రమ్‌గా బాలు తన పాత్రలో ఒదిగిపోయాడు. డిఫరెంట్ యాటిట్యూడ్‌తో కెమెరామెన్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేందుకు ప్రయత్నించాడనిపిస్తుంది. ఇక మహీగా షిన్నోవా కూడా ఇండస్ట్రీకి కొత్త అయినా అనుభవం నటిగా కనిపించింది. బాలు, మహీ పాత్రల మధ్య కెమిస్ట్రీని ఇద్దరు బాగా పండించారు. ఈ సినిమాకు నైనిక పాత్రలో కనిపించిన సాన్విత స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. సాన్విత యాక్టింగ్ ఈ సినిమాకు ఫీల్‌గుడ్‌గా మారింది. ఇక జోసెఫ్‌గా శుభలేఖ సుధాకర్, శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ, వంశీ నెక్కంటి తమ పాత్రలకు న్యాయం చేశారు. మహబూబ్ భాషా, మహేందర్ కామెడీ సీన్లు అక్కడక్కడా నవ్విస్తాయి.
ఒక బృందావనం సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ బలంగా నిలిచాయి. కేరళ అందాలను రాజ్ కే నల్లి బాగా చిత్రీకరించాడు. సన్నీ సాకేత్ తన మ్యూజిక్‌తో సన్నివేశాలను ఫీల్‌గుడ్‌గా మార్చారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. అశ్లీలత, అసభ్య లేకుండా సీన్లు బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా బాగానే ఉన్నా.. ఇంకా కొన్ని సీన్లపై కత్తెర పడి ఉండే ఇంకా ఫీల్‌గుడ్‌గా మారేది.అంతేకాకుండా సినిమా స్లో సాగిందనే ఫీలింగ్ పోయేదనిపిస్తుంది. ఈ సినిమాను విజువల్‌గా తీసుకు రావడంలో సీర్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ తాటికొండ, వెంకట్ రేగెట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సబ్జెక్ట్‌ను ఎంచుకొన్న విధానం చూస్తే.. వారికి సినిమాపై వారికి ఉండే తపన ఏమిటో కనిపించింది.
చైల్డ్ సెంటిమెంట్, యంగ్ ఏజ్ బ్రేకప్, రొమాంటిక్ నేచర్ సాగే ఫీల్‌గుడ్ మూవీ ఓక బృందావనం. కొత్త, పాత నటీనటులతో చేసిన ప్రయత్నం బాగుంది. పేరున్న హీరో, హీరోయిన్లతో చేసి ఉంటే.. రీచ్ ఇంకా ఎక్కువగా ఉండేదనిపిస్తుంది. కానీ బాలు, షిన్నోవా తమ పాత్రలకు న్యాయం చేశారు. మంచి ఉద్దేశంతో విలువలను పాటిస్తూ చేసిన చిన్న సినిమా ఇది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మరిన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం ఈ సినిమాను మీ ఆప్షన్‌గా ఎంచుకొండి.. తప్పకుండా ఓ డిఫరెంట్ అనుభూతిని పంచుతుంది.


Click it and Unblock the Notifications











