Om Bheem Bush Review హిలేరియస్ ఫన్ రైడ్.. శ్రీవిష్ణు వన్ మ్యాన్ షో.. ఓం భీమ్ బుష్ సినిమా రివ్యూ!
Rating: 3.25/5
నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ తదితరులు
దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
నిర్మాత: సునీల్ బలుసు
బ్యానర్: వీ సెల్యులాయిడ్,
సమర్పణ: యువి క్రియేషన్స్
సినిమాటోగ్రఫి: రాజ్ తోట డీవోపీ
మ్యూజిక్: సన్నీ ఎంఆర్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్: విష్ణువర్దన్ కావూరి
రిలీజ్ డేట్: 2023-03-22
కష్టపడకుండా కింగ్‌లా బతకాలనే కోరికతో ఉన్న కృష్ణకాంత్ (శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ) క్లోజ్ ప్రెండ్స్. లెగసీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రంజిత్ వినుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) వద్ద పీహెచ్‌డీ చేసి సైంటిస్టుల కావాలని అనుకొంటారు. యూనివర్సిటీలో చేసే అల్లరి చిల్లరి పనులు చేయడంతో మధ్యలోనే ప్రొఫెసర్ రంజిత్ తరిమివేస్తాడు. దాంతో ప్రియదర్శి గ్రామం భైరవకొండకు వెళ్తూ ఓ పాడుపడిన బంగ్లాలో క్షుద్ర శక్తులు చేసే బైరాగి (షాన్ కక్కర్) గ్రూప్‌ను చూస్తారు. అప్పుడే ఆ గ్రామంలో బ్యాంగ్ బ్రో A to Z సొల్యూషన్ అనే ఏజెన్సీ పెడుతారు. ఆ తర్వాత సంపంగి అనే దెయ్యం నివసించే పాడుబడిన బంగ్లాలో నిధులు తీసుకు రావాలని సర్పంచ్, బైరాగులు సవాల్ విసురుతారు.
యూనివర్సిటీలో ప్రొఫెసర్ రంజిత్‌ను కృష్ణకాంత్, వినయ్, మాధవ్ ఎలా ముప్పు తిప్పలు పెట్టారు. ఆ ముగ్గురిని ప్రొఫెసర్ ఎందుకు వర్సిటీ నుంచి ఎందుకు తరిమివేశాడు? భైరవపురం వెళ్లే క్రమంలో పాడుబడ్డ బంగ్లాలో జరిగిన సంఘటనలు వారి జీవితాలను ఎలా మలుపు తిప్పాయి? ఊర్లో ఈ ముగ్గురిని దేవుళ్లుగా కొలిచేలా వారు ఏం చేశారు? గ్రామానికి పట్టి పీడించే సంపంగి ఎవరు? పాడుబడ్డ బంగళాలో నిధుల కోసం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాలోకి వెళ్లిన ఆ ముగ్గురికి సంపంగి నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సంపంగిని ఈ మిత్రత్రయం శాంతింప చేశారా? వారికి నిధులు దొరికాయా? ఆ ఊరికి సంపంగి నుంచి వచ్చే కష్టాలు తొలిగాయా? గ్రామ సర్పంచ్ ఛాలెంజ్ గెలిచి జలజ (ప్రీతి ముకుందన్)ను పెళ్లి చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఓం భీమ్ బుష్ సినిమా కథ.

యూనివర్సిటీ ప్రొఫెసర్ రంజిత్ తనను విపరీతంగా వేధించిన ముగ్గురు యువకుల గురించి చెప్పడంతో కథ ఫ్లాష్ బ్యాక్‌లో మొదలు కావడమే హిలేరియస్ ఫన్‌తో మొదలవుతుంది. ఫన్ ఎలిమెంట్స్‌తో పట్టాలెక్కిన సినిమా కామెడీ ట్రాక్‌తో పరుగులు పెట్టింది. ఎపిసోడ్స్ గా దర్శకుడు హర్ష రాసుకొన్న సన్నివేశాలు వేటికి అవే బ్రహ్మండంగా వర్కవుట్ అయ్యాయి. ఫస్టాఫ్‌లో రెండు, మూడు ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను సీట్లపై లేచి నవ్వేలా చేస్తాయి. విష్ణు, రాహుల్, ప్రియదర్శి కలిసి పండించిన వినోదం ఓ లెవెల్‌లో ఉంటుంది. లాజిక్‌లేని, అర్ధం పర్థం లేని డైలాగ్స్ కడుపుబ్బ నవ్విస్తాయి. ఇలా ఫన్ రైడ్‌తో సాగే సినిమాకు మంచి ట్విస్ట్‌తో ఫస్టాఫ్ ముగించి సెకండాఫ్‌లో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సఫలమయ్యారని చెప్పవచ్చు.

ఇక సెకండాఫ్‌లో కూడా అదే ఫన్ ఫార్మూలాను కొనసాగిస్తూ.. ఎమోషనల్ ట్రాక్‌ను జోడించిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దంపడుతుంది. డైరెక్టర్ ఎక్కడైనా తప్పటడుగు వేస్తాడా? అని ఎదురు చూసిన వారికి ఆ అవకాశం ఇవ్వకుండా అత్యంత పకడ్బందీగా స్క్రిప్టును రాసుకొన్నారు. లాజిక్స్ లేవని ప్రమోషన్స్‌లో చెప్పినప్పటికీ.. లాజిక్కులతోనే కథను నడిపించిన విధానం చాలా బాగుంది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ స్టోరి ఎమోషనల్‌గా చెప్పడం అత్యంత బలంగా మారడమేకాకుండా సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో పెళ్లి ఎపిసోడ్ కొంత రొటీన్‌గా ఉన్నప్పటికీ.. పార్ట్ 2 కు ఇచ్చి లీడ్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.
ఇక శ్రీ విష్ణు ప్రతీ సినిమాకు అందర్నీ ఆశ్చర్య పరిచే విధంగా నటుడిగా మారిపోతున్నారు. సామజవరగమన సినిమాలో చేసిన ఫెర్ఫార్మెన్స్‌పై కలిగిన ఫీలింగ్ నుంచి బయటపడక ముందే.. ఓం భీమ్ బుష్ సినిమాతో మరో సర్‌ప్రైజింగ్ నటనతో అంచనాలు పెంచాడు. ఈ సినిమాలో హ్యుమర్, పెర్పార్మెన్స్‌తో కంప్లీట్ యాక్టర్ అనే ఫీలింగ్ కల్పించారు. ఇక శ్రీ విష్ణుతో కలిసి రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చెలరేగిపోయారు. అంచనాలకు అందరి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో సినిమాలో నవ్వుల పూలు పూయించారు.
ఇక ఉన్నది కాసేపైనా రంజిత్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ గుర్తుండిపోయేలా నటించారు. ఇక కామాక్షి భాస్కర్ల చిన్న పాత్రైనా కనిపించినంత సేపు గ్లామర్‌తో మెరుపులు మెరిపించారు. స్పెషల్ సాంగ్‌లో ప్రియా వడ్లమాని అందాల అరబోతతో మాస్ ఆడియెన్స్ ట్రీట్ అందించారు. ఆయేషా ఖాన్, ప్రీతీ ముకుందన్ తమ పాత్రలకు పరిధి మేరకు సినిమాకు యాడ్ అన్ ఫ్యాక్టర్‌గా మారారు. రచ్చ రవి తనదైన కామెడీతో ఆకట్టుకొన్నాడు. మిగితా పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరు సినిమాకు సపోర్టుగా నిలిచారు.

టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం 100 శాతం ఫర్‌ఫెక్షన్ చూపించింది. ముఖ్యంగా రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫి, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీకాంత్ చేసిన వర్క్ స్క్రీన్‌పై అద్బుతంగా కనిపించింది. ఇక విష్ణు వర్దన్ ఎడిటింగ్ సినిమాను పరుగుల పెట్టిస్తే.. సన్నీ మ్యూజిక్ చాలా సన్నివేశాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక సునీల్ బలుసు, యూవీ క్రియేషన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి.
ఫన్, కామెడీ, హ్యుమర్ అంశాలే కాకుండా ఓ బలమైన, ఎమోషనల్ పాయింట్‌తో రూపొందిన చిత్రం ఓం భీమ్ బుష్. పక్కాగా రాసుకొన్న స్క్రిప్టు, లోపాలు లేని సన్నివేశాలు సినిమాకు అత్యంత బలంగా మారాయి. హర్ష డైరెక్షన్ కమాండింగ్ ఉంది. శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి నెక్ట్స్ లెవెల్ ఫెర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్. ఎలాంటి అంచనాలు పెట్టుకొని వెళ్లినా ఈ సినిమా ఎక్కడా నిరాశపరచదు. తప్పకుండా నవ్వించడమేకాకుండా ఓ భావోద్వేగానికి గురి చేసేలా ఓ డిఫరెంట్ ఎమోషనల్ లవ్ స్టోరి. ఇది థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం. థియేటర్లోనే చూడండి. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఎంటర్‌టైనర్‌ను మిస్ చేసుకోకండి.


Click it and Unblock the Notifications











