Operation Valentine Review పుల్వామా దాడి.. పాక్‌పై ప్రతీకారం.. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రివ్యూ
Rating: 2.75/5
నటీనటులు: వరుణ్ తేజ్, మనుషీ చిల్లర్, నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు
రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా
నిర్మాతలు: సోని పిక్చర్స్, సందీప్ మడ్డా
సినిమాటోగ్రఫిం హరి కే వేదాంతం
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్ం మిక్కీ జే మేయర్
బ్యానర్స్: మిక్కీ జే మేయర్, రినాయిసెన్స్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2024-03-01
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అర్జున్ దేవ్ అలియాస్ రుద్ర వింగ్ కమాండర్. తోటి ఫైటర్స్ (నవదీప్, అలీ రెజా, మీర్ సర్వర్‌తో కలిసి వజ్ర మిషన్ ప్రారంభించి విఫలమవుతాడు. దాంతో రుద్రపై ఆంక్షలు విధిస్తారు. ఈ క్రమంలో పుల్వామా దాడి జరిగి చాలా మంది జవాన్లు వీరమరణం పొందుతారు. దాంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాలని సర్జికల్ స్క్రైక్స్ చేయాలని నిర్ణయిస్తుంది. ఆ మిషన్‌ను లీడ్ చేసే బాధ్యతను రుద్రకు అప్పగిస్తారు.

శత్రు సైన్యాన్ని సునాయసంగా ఎదురుదాడి చేసేలా రూపొందించిన వజ్ర మిషన్‌ను అమలు చేయడంలో రుద్ర అలియాస్ అర్జున్ దేవ్ ఎందుకు విఫలమయ్యాడు. వజ్ర మిషన్ ఫెయిల్యూర్‌తో రుద్రకు ఎలాంటి నష్టం వాటిల్లింది? వైమానిక దళంలో పనిచేసే అహానా గిల్ (మనుషీ చిల్లర్)తో ఎందుకు విభేదాలు వస్తాయి? పుల్వామా దాడి తర్వాత రుద్ర నాయకత్వంలోని వాయు సేనలు పాకిస్థాన్‌పై ఎలాంటి ఎదురుదాడి చేసింది? తాను అనుకొన్న విజ్ర మిషన్‌ను రుద్ర సక్సెస్ చేశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కథ.
గ్వాలియర్ ఎయిర్ బేస్‌లో జరిగిన ఓ సంఘటనతో కథ సీరియస్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత కథ బ్యాక్ డ్రాప్ శ్రీనగర్‌కు చేరుకొంటుంది. వరుణ్ తేజ్ ఎంట్రీ, మనుషీ చిల్లర్ క్యారెక్టరైజేషన్ తదితర అంశాలు అభిమానులను ఆకట్టుకొనేలా సాగుతాయి. కానీ కథలో బలమైన సన్నివేశాలు, ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఫస్టాఫ్‌లో లేకపోవడంతో రెగ్యులర్ ఆడియెన్స్‌కు ఏదో సాదాసీదాగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ ముందు దర్శకుడు ఎత్తుకొన్న పాయింట్ మూవీకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. దాంతో సెకండాఫ్‌లో ఏం జరుగబోతుంది? దర్శకుడు ఎలా డీల్ చేస్తాడనే ఉత్సాహం కలిగేలా చేస్తుంది.
సెకండాఫ్‌లో పాక్, ఇండియా మధ్య పరస్పర దాడుల చిత్రీకరణ గ్రిప్పింగ్గా ఉంటుందనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్రియేట్ చేసిన డ్రామా, క్లైమాక్స్‌లో ప్రధాని, జాతీయ భద్రత సలహాదారులు పన్నే వ్యూహాలు, అలాగే వందేమాతరం బ్యాక్ డ్రాప్ సాంగ్, బీజీఎం సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చాయి. దాంతో మంచి దేశభక్తి ప్రధానమైన సినిమాను చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది. స్క్రిప్టు పరంగా చాలానే లోపాలు కొట్టొచ్చాయి. కానీ దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే వల్ల అవి పైకి కనిపించకుండా పోయాయి.
వరుణ్ తేజ్ రుద్ర అలియాస్ అర్జున్ దేవ్‌గా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సక్సెస్, ఫెయిల్యూర్ అనే విషయాన్ని పట్టించుకోకుండా కథలను ఎంపిక చేసుకొనే విధానాన్ని అభినందించాల్సిందే. రొమాన్స్‌కు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ.. కొన్ని చోట్ల మనుషి, వరుణ్ మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. రుద్ర, అహానా మధ్య ఎమోషనల్ సీన్, డైలాగ్స్ ఫీల్'గుడ్‌గా మార్చాయని చెప్పవచ్చు. నవదీప్ క్యారెక్టర్ అసంపూర్తిగా ముగిసిపోవడం కొంత జీర్ణించుకోలేని విషయంగా కనిపిస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ తమ రోల్స్ వరకు ఫర్వాలేదనిపించారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. బీజీఏం, వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని పంచేలా సాంకేతిక విభాగాల పనితీరు ఉంది. సీన్లు చాలా రిచ్‌గా ఉన్నాయి. సోని పిక్చర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కొన్ని సన్నివేశాలు ఉద్వేగంగా, భావోద్వేగంగా సాగడం వల్ల ఫీల్‌గుడ్ మార్క్‌ను సినిమా సొంత చేసుకొనేలా చేశాయి.


Click it and Unblock the Notifications











