ఒట్టేసి చెపుతున్నా చూడొద్దు!

చిత్రం: ఒట్టేసి చెపుతున్నా
నటీనటులు: శ్రీకాంత్, స్రవంతి, శివాజీ, సునీల్
సంగీతం: విద్యాసాగర్
నిర్మాత: కె.అనిల్ కుమార్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు
దర్శకుడు ఇ.సత్తిబాబు గతంలో తీసిన రెండు చిత్రాలు కొద్దో గొప్పో కామెడీ చిత్రాలే. ఈ చిత్రం కూడా అదే రీతిలో ఉంటుందని ఆశించి వెళ్ళినవారికి భంగపాటు తప్పదు. మరీ పాత కథను అంతే పాతగా చెప్పడం ఈ సినిమా స్పెషాలిటీ. ఇందులో కామెడీ పాలు తక్కువ, సెంటిమెంట్ సీన్లే అధికం. హీరో శ్రీకాంత్ ను అందంగా చూపుతూ, 'త్యాగ'రాజు పాత్రలో ఎలివేట్ చేస్తూ...మహిళాభిమానులకు మరింత చేరువులో శ్రీకాంత్ ను చేర్చాలన్న సత్తిబాబు ప్రయత్నం ప్రేక్షకుల ప్రాణానికొచ్చింది. చిన్నప్పుడే తను అధికంగా ఇష్టపడే తల్లితండ్రులను కోల్పోయిన హీరో..ఇక తన జీవితంలో ఏదీ కోరుకున్నదీ దక్కదు అని భావిస్తాడు.
అలా తను ఇష్టపడ్డ అమ్మాయి కూడా దక్కదని భావిస్తాడు. అయితే, దేవుడు (వినాయకుడు), రచయిత ఉదయ్ రాజ్, దర్శకుడు ఇ.సత్తిబాబులు కలిసి లాజిక్ కు అందకపోయినా...కథలో హీరో అభిప్రాయం తప్పని రుజువు చేసి చూపుతారు. అదే ఈ సినిమా. సినిమా ప్రారంభం కూడా ఎనభై దశకం సినిమాల మాదిరిగా హీరో చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పేయే సీన్లు, దహనం సంస్కరణల బ్యాక్ గ్రౌండ్ లో ఒక విషాద గీతం, అనాథ శరణాలయంలో మరో మిత్రుడు పరిచయం కావడం వంటి దృశ్యాలతో మరీ పాత పద్దతిలో మొదలవుతుంది. 15 నిమిషాల తర్వాత సినిమా ఏమిటో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది.
కానీ దర్శకుడు..దాన్ని రెండున్నర గంటల పాటు పాటలు, కామెడీ స్కిట్ లతో నడిపించేందుకు ప్రయత్నించాడు. మధ్యలో ఫ్యాక్షన్ చిత్రాల హీరోలపై సెటైర్ గా సాగిన ఎమ్మెస్ నారయణ కామెడీ కాస్తా ఫర్వలేదనిపించినా..ఎమ్మెస్సార్ ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. సినిమాలో ఫోటోగ్రఫీ, రెండు, మూడు పాటలు మాత్రమే మెచ్చుకోదగ్గ అంశాలు. డైలాగ్స్ లో పంచ్ లేదు.
శ్రీకాంత్ ఓ బ్యాంక్ లో ఉద్యోగి. మేనేజర్ కావాలని అనుకుంటాడు. కానీ దక్కదు. ఒకరోజు పోస్ట్ లో పెళ్ళి చూపులకు రమ్మంటూ ఒక లెటర్ వస్తుంది. అందులో ఆ అమ్మాయి(స్రవంతి) ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటో చూడగానే అతనికి 'మంచి' జరుగుతుంటుంది. మేనేజర్ అవుతాడు. సో..అమ్మాయికి సంబంధం లేకుండానే హీరోగారు ఆమెను పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. వెంటనే ఆమెను కనుక్కునేందుకు మిత్రుడు సునీల్ తో కలిసి ఆ అడ్రెస్ కు వెళుతాడు. వాళ్ళ పై ఇంట్లో శివాజీ అద్దెకు ఉంటాడు. ఆ ఇంట్లో అద్దె షేర్ చేసుకొని కొన్నాళ్ళు ఉంటానని చెప్పుతాడు. శివాజీ ఒకే అంటాడు. అయితే, హీరోయిన్ స్రవంతి, ఆమె తల్లితండ్రులకు హీరో ముందే పరిచయం.
భార్యను తన పిచ్చితో వేధిస్తోన్న బ్రహ్మనందంకు శ్రీకాంత్ బుద్ది చెప్పుతాడు. ఈ దృశ్యాన్ని వాళ్ళు దూరం నుంచి చూసి హీరోకు ఫ్యాన్స్ అయిపోతారు. సో..హీరోయిన్ తండ్రి శ్రీకాంత్ పై రూం షేర్ చేసుకునేందుకు అంగీకరిస్తాడు. అయితే, శివాజీ, స్రవంతి ప్రేమించుకుంటారు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. శివాజీ ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. స్రవంతి శ్రీకాంత్ కు ఈ విషయం చెప్పి శివాజీకి ఉద్యోగం వచ్చేలా సాయం చేయమని కోరుతుంది. తొలుత శ్రీకాంత్ కుళ్ళుకొన్నా ..'త్యాగం' చేసి శివాజీకి ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే శివాజీ మంచి వాడు కాదు. సునీల్ వాడి అసలు స్వరూపాన్ని బయటపెట్టి తన ఫ్రెండ్ ను, స్రవంతిని ఒకటి చేయడంతో సినిమా ముగుస్తుంది.
ఇందులో శివాజీని విలన్ గా చూపించినా, నిజానికి శ్రీకాంతే విలన్. ఆ అమ్మాయికి సంబంధం లేకుండానే హీరోగారు ప్రేమించేస్తారు. బ్యాంక్ లో మేనేజర్ ఉద్యోగం తగలబెడుతోన్న హీరోగారు ..ఈ రూంలో ఎందుకు ఉంటున్నారో వారికి అనుమానం రాదు మరి? కానీ చివర్లో శివాజీ మంచి వాడు కాదనేగానే హీరోయిన్ కు ఎక్కడలేని ప్రేమ హీరో మీదికి ముంచుకొస్తుంది. ఇలాంటి అర్థంపర్థం లేని ఓల్డ్ కథలో అందరి నటన సామాన్యమే.


Click it and Unblock the Notifications











