For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Panchatantram Review హార్ట్‌ను టచ్ చేసేలా దివ్య శ్రీపాద, స్వాతి పెర్ఫార్మెన్స్.. బ్రహ్మనందం డిఫరెంట్‌‌గా!

  |

  Rating:
  3.0/5
  Star Cast: Divya Sripada, Swathi Reddy, Shivathmika Rajashekar
  Director: Harsha Pulipaka

  నటీనటులు: బ్రహ్మనందం, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద, సముద్రఖని, రాహుల్ విజయ్, ఉత్తేజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీవిద్య, దివ్యవాణి, నరేష్ అగస్త్య తదితరులు
  రచన, మాటలు, దర్శకత్వం: హర్ష పులిపాక
  నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు
  ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌
  సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి
  సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్
  పాటలు: కిట్టు విస్సాప్రగడ,
  బ్యాన‌ర్స్‌: టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్
  లైన్ ప్రొడ్యూసర్: సునిత పడోల్కర్
  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు
  క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి
  సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి
  అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్
  కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియం
  ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి
  పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)

  Panchatantram movie

  వేద వ్యాస్ (డాక్టర్ బ్రహ్మనందం) కథకుడు. 60 ఏళ్ల వయసులో తనలోని భావాలను, ఆలోచనలను కథలుగా చెప్పాలనుకొంటాడు. ఆడియో క్యాసెట్స్‌లో తన కథలను నిక్షిప్తం చేసుకొంటాడు. అయితే కథల పోటీల్లో పాల్గొనడం కోసం ఓ వేదికను ఎంచుకొంటాడు. పంచేద్రియాలు అనే థీమ్‌తో కథలను చెప్పి విజేతగా నిలువాలనుకొంటాడు. అయితే 60 ఏళ్ల వయసులో ఈ కథలు చెప్పడమేటనే సందేహంలో కూతురు (స్వాతిరెడ్డి) ఉంటుంది.

  60 ఏళ్ల వయసులో యువకులతో పోటీ పడుతూ వేదవ్యాస్ విజేతగా నిలిచాడా?. తాను ఎంచుకొన్న పంచేంద్రియాలు అనే థీమ్‌లో ఎలాంటి కథలను చెప్పాడు? తండ్రి చెప్పే కథలు కూతురును ఆకట్టుకొన్నాయా? వేదవ్యాస్ చెప్పిన కథలకు ఎలాంటి రియాక్షన్ వచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే పంచతంత్రం అంథాలజీ.

  దర్శకుడు హర్ష పులిపాక రాసుకొన్న పాయింట్స్, వాటిని కథగా విస్తరించిన తీరు బాగుంది. చూపు, వాసన, స్పర్శ, రుచి, వినికిడి అంశాలను ఆధారంగా చేసుకొని రాసిన కథలు బాగున్నాయి. ఒక్కో కథను ఒక్కో అంశంతో చెప్పడానికి చేసిన ప్రయత్నం దాదాపు మెప్పించిందనే చెప్పవచ్చు. ఒకట్రెండ్ కథల విషయంలో తడబాటు కనిపించినా.. మూడు కథలతో హృదయాన్ని సృశించే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు.

  1. చూపు - (బీచ్ చూడాలనే యువకుడి కోరిక),
  2. రుచి - (పెళ్లి చూపుల కోసం వచ్చిన యువకుడు (రాహుల్ విజయ్)ని మెప్పించే లేఖ (శివాత్మిక రాజశేఖర్),
  3. వాసన - (బాల్యంలోనే తల్లిని కోల్పోయిన కొడుకు (సముద్రఖని),
  4. స్పర్శ - (భార్య (దివ్య శ్రీపాద) ప్రాణాలను కాపాడుకోవాలనే భర్త తపన,
  5. వినికిడి - రేడియో జాకీగా చిన్నారి ప్రతిభకు పట్టం కట్టే రోషిణి(స్వాతిరెడ్డి) పాత్ర ద్వారా అంశాలను చెప్పిన తీరు గుండెను పిండేలా ఉంటాయి.

  ఐదు కథల సమాహారంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కథ, అలాగే దివ్య శ్రీపాదకు సంబంధించిన స్టోరి, స్వాతిరెడ్డి, ఉత్తేజ్‌కు సంబంధించిన కథ హైలెట్‌గా నిలువడమే కాకుండా విశేషంగా ఆకట్టుకొంటాయి. మిగితా రెండు కథలు ఒకే అనిపిస్తాయి.

  లేఖ పాత్రలో శివాత్మిక రాజశేఖర్ ఒదిగిపోయారు. చాలా మెచ్యురిటీతో రాహుల్ విజయ్, శివాత్మిక కథను ఫీల్‌గుడ్‌గా ముందుకు తీసుకెళ్లడం సక్సెస్ అయ్యారు.

  పంచతంత్రం కథల సమాహారంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న గర్బిణిగా దేవీ పాత్రలో దివ్య శ్రీపాద మరోసారి తనదైన శైలిలో పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అనే రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. కథలోని ఎమోషన్స్‌ను దివ్య శ్రీపాద బాగా పడించింది. నటిగా సరికొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేసింది. జీవన్మరణ సమస్యతో బాధపడుతున్న ఓ గృహిణిగా తన నటనతో దివ్య శ్రీపాద ఆకట్టుకొన్నది. దేవీ భర్తగా చేసిన నటుడు కూడా అద్బుతంగా నటించాడు.

  పంచతంత్రంలో చివరి కథగా వచ్చే లియా అండ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో రేడియో జాకీగా రోషిణిగా స్వాతి రెడ్డి తనదైన మార్క్ ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. అంగవైకల్యంతో బాధపడే యువతిగా స్వాతిరెడ్డి భావోద్వోగాలను పండించింది. చిన్నారితో కలిసి కంటతడి పెట్టించేంతగా ఎమోషన్స్‌ను తెరమీద పలికించారు. విక్రమ్‌గా ఆదర్శ్ బాలకృష్ణ తన మార్క్‌ను చాటుకొన్నారు. ఇక రామనాథంగా సముద్రఖని ఫెర్ఫార్మెన్స్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ఎపిసోడ్‌లో బలంగా ఎమోషన్స్ కనిపించకపోవడం, కథ ఆకట్టుకొనేలా లేకపోవడం మైనస్. ఇక మొదటి కథలో బీచ్‌కు సంబంధించిన ఎపిసోడ్ కాస్త డల్‌గా ఉంటుంది.

  ఐదు కథలను భావోద్వేగంగా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మనందం నటన స్పెషల్ ఎట్రాక్షన్. బంతిపూలను ఓ దండగా మార్చే దారంలా తన పాత్రను సమర్ధవంతంగా పోషించారు. బ్రహ్మనందం నటన గురించి కొత్తగా చెప్పడం బాగుండదు.

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది. 2, 4, 5 కథల్లో ఎమోషన్స్‌ను తమ బీజీఎంతో ఎలివేట్ చేశారు. రాజ్ నల్లి సినిమాటోగ్రఫి బాగుంది. గ్యారీ బీహెచ్ మరోసారి తన కత్తెరకు పదును చూపించాడు. అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు, పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక విషయానికి వస్తే.. సినిమాపై వారికి ఉన్న అభిరుచి తెలియజెప్పింది.

  సమాజంలో సమస్యలకు అద్దం పట్టే విధంగా ఎంచుకొన్న కథలు, వాటిలో లీనమై నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు అద్దంపట్టిన చిత్రం పంచతంత్రం. హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఈ కథలకు బలంగా మారాయి. ఏ రంగంలోనైనా రాణించాలంటే.. వయసు అడ్డంకి కాదు అనే ఒక సందేశంతో కూడిన చిత్రం. మంచి ఫీల్‌గుడ్ కథలను తెరపైన చూడాలంటే.. వారాంతంలో ఈ సినిమాను ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. అశ్లీలత, ద్వందార్థాలకు చోటులేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పంచతంత్రం.

  English summary
  Brahmanandam, Swathi Reddy, Shivathmika Rajashekar, Divya Sripada's latest movie Panchatantram. This movie is five stories anthology. Here is the Telugu filmibeat exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X