twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాలక్షేపం బఠాణీ 'పందెం'

    By Staff
    |

    Pandem
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: పందెం
    నటీనటులు: జగపతిబాబు, కళ్యాణి, శివాజీరాజా,
    చిన్నా, కృష్ణ భగవాన్‌, కొండవలస లక్ష్మణరావు,
    రామరాజు, ఎమ్మెస్‌ నారాయణ, అపూర్వ తదితరులు
    కథ, మాటలు: వేగిస్న సతీష్‌
    సంగీతం: చక్రి
    కెమెరా : శరత్‌
    దర్శకత్వం: సభాపతి
    నిర్మాత :వల్లూరుపల్లి రమేష్‌
    విడుదల తేదీ: 05-02-2005

    విజయవంతమైన 'కబడ్డి కబడ్డి' టీం అదే తరహా పాత్రలతో తీసిన 'పందెం' ఫర్వాలేదన్పించే సినిమా. ఫస్టాఫ్‌ ఊకదంపుడు డైలాగ్స్‌ కాస్త బోర్‌ కొట్టించినా సెకండాఫ్‌ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమా కొన్ని సెంటర్లలొ బాగా ఆడే అవకాశముంది.

    కథ: శ్రీను (జగపతిబాబు) తూగో జిల్లా రాజోలు దగ్గర ఓ పల్లెలో అల్లరి చిల్లరగా తిరిగే ఒక యువకుడు. అతనితో కలిసి ఒక టైలర్‌ (శివాజీరాజా), ఆర్‌ఎంపి డాక్టర్‌ (చిన్నా), ఇంకా కొండవలస లక్ష్మణరావు తిరుగుతుంటారు. ఆ ఊరు సర్పంచ్‌గా లింగరాజు (రామరాజు) ముప్పై ఏళ్ళ నుంచి చక్రం తిప్పుతుంటాడు. ఓ రోజు ఆ ఊరికి సీత (కళ్యాణి) అనే టీచరమ్మ వస్తుంది. ఆమెను చూడగానే శ్రీను అమాంతం ప్రేమలో పడిపోతాడు. ఆమెను తన దారికి తెచ్చుకోడానికి ఎన్ని ప్లాన్లు వేసినా ఫలించవు. ఒకరోజు ఎలాగైనా తన ప్రేమను ఆమె ఎదుట వెళ్ళగక్కాలని ఆమె ఇంటికి వెళ్ళేసరికి తండ్రికి ఆమెకు మధ్య సంభాషణలు అతని చెవిలో పడతాయి. తనకు కాబోయే భర్త తన కంటే ఉన్నత స్ధాయిలో ఉండాలని కళ్యాణి తండ్రితో చెబుతుంది. కళ్యాణి కంటే ఉన్నత స్ధాయిలో ఎలా ఉండాలని శ్రీను ఆలోచిస్తుండగా పంచాయితీ ఎన్నికలు వస్తాయి. శ్రీను లింగరాజు మీద పోటీకి దిగుతాడు. ఆవారాగా ఊరందరికీ తెలిసిని శ్రీనుకు ఎవరూ మద్దతు ఇవ్వరు. అప్పుడు సీత అతనికో సలహా ఇస్తుంది. దాని ప్రకారం శ్రీను ఆ ఊరు అభివృధ్ధికి స్వచ్ఛందంగా కృషి చేస్తాడు. శ్రీనును దెబ్బతీయడానికి లింగరాజు సీతను తన కోడలిని చేసుకోవాలనుకుంటాడు. శ్రీను లింగరాజుని ఎదిరించి ఆ ఊరు సర్పంచ్‌ ఎలా అయ్యాడు? సీత ప్రేమను ఎలా గెలుచుకుంటాడన్నది తెరమీద చూడాల్సిందే.

    ప్లస్‌ పాయింట్స్‌: దర్శకుడు సభాపతి షాట్‌ డివిజన్‌ బాగా చేసుకున్నాడు. లింగరాజుగా రామరాజు నటన బాగుంది. జగపతిబాబు, క ళ్యాణిలకు ఇటువంటి పాత్రలు కొట్టినపిండి. ఉన్న కాసేపు మంత్రిగా కృష్ణ భగవాన్‌ బాగా నవ్వించాడు. ఒక రొటీన్‌ కథను ఆసక్తికరంగా మలచడంలో స్క్రీన్‌ ప్లే ప్రతిభ మెచ్చుకోదగినది.

    మైనస్‌ పాయింట్స్‌: చక్రి సంగీతం ఈ సినిమాకు పెద్ద మైనస్‌. గ్రామీణ నేపధ్యం గల ఈ సినిమా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా ఉంటే సినిమా విజయావకాశాలు ఇంకా పెరిగి ఉండేవి. ఇది వంశీ సినిమానా అన్న అనుమానం ప్రేక్షకులకు కలుగుతుంది. సభాపతి అంత దారుణంగా వంశీని అనుకరించాడు. ఎంతో కాలంగా పట్టణంలో చదువుకుని వచ్చిన కళ్యాళి హాయిగా పల్లెటూరి భాషలో, హాహభావాలతో కన్పించడం అసహజంగా ఉంది.

    థట్స్‌తెలుగు డాట్‌కాం రిమార్క్స్‌: సెకండాఫ్‌ ఉత్కంఠ భరితంగా సాగడం సినిమా విజయవంతం కావడానికి దోహదపడవచ్చు. కాలక్షేపానికి చూడదగిన చిత్రమిది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X