Papam Prathap Movie Review: పాపం ప్రతాప్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, అజయ్ ఘోష్, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, రాశి, రూపాలక్ష్మీ, అవసరాల శ్రీనివాస్, ప్రసాద్ బెహ్ర, రఘుబాబు, భాషా తదితరులు
దర్శకత్వం: ఎస్‌పీ దుర్గా నగేష్
నిర్మాత: మిత్రవింద మూవీస్, గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మాధి రెడ్డి
మ్యూజిక్: కేఎం రాధాకృష్ణన్
సినిమాటోగ్రఫి: విశ్వేశ్వర్ ఎస్ వీ
ఎడిటింగ్: అన్వర్ అలీ
బ్యానర్స్: ఈటీవీ విన్, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్
గ్రామంలో ఫెర్టిలైజర్ షాపు నడుపుకొనే ప్రతాప్ (తిరువీర్) తన తండ్రి (అజయ్ ఘోష్) ఇష్టానికి వ్యతిరేకంగా చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను వివాహం చేసుకొంటాడు. పెళ్లి తర్వాత మూడు రాత్రులు గడిచిన తర్వాత ప్రతాప్‌ను వదిలేసి బుజ్జమ్మ పుట్టింటికి వెళ్తుంది. దాంతో ప్రతాప్‌పై గ్రామస్థులంతా అనుమానాలు వ్యక్తం చేస్తారు. అయితే బుజ్జమ్మను కన్విన్స్ చేసి మళ్లీ ఇంటికి తీసుకు వస్తాడు. కానీ రాత్రి గడిచిన తర్వాత అదే పరిస్థితి ఎదురువుతుంది.

ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకొన్న ప్రతాప్, బుజ్జమ్మ దాంపత్య జీవితంలో ఏర్పడిన సమస్య ఏమిటి? ఎవరిలో సమస్య వల్ల వారిద్దరూ విడిపోయారు? భార్య బుజ్జమ్మ విడిచి వెళ్లిన తర్వాత ప్రతాప్‌కు ఊర్లో ఎదురైన పరిస్థితులు ఏమిటి? ప్రతాప్ వల్ల తండ్రి ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు? బుజ్జమ్మతో కాపురం చేయడానికి ప్రతాప్ ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు చేపట్టాడు? ప్రతాప్ తీసుకొన్న జాగ్రత్తలు వర్కవుట్ అయ్యాయా? బుజ్జమ్మ తిరిగి ప్రతాప్ వద్దకు వచ్చిందా? అనే ప్రశ్నలకు సమాధానమే పాపం ప్రతాప్ సినిమా కథ.
పాపం ప్రతాప్ సినిమాలో భార్య, భర్తలకు సంబంధించి ఓ ఎమోషనల్, గుండెను పిండేసే పాయింట్ ఉంది. అంతేకాకుండా అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని బలంగా చెప్పే అంశం ఉంది. ఇలాంటి రెండు అంశాలను చక్కగా ఉపయోగించుకోవాల్సిన దర్శకుడు దుర్గా నగేష్ తన కథను అస్తవ్యస్తమైన స్క్రీన్ ప్లేతో ప్రతీ నిమిషం విసుగు పుట్టించాడు. చాలా సన్నివేశాల్లో ఈటీవీ విన్ నిర్మాణ నిబంధనలకు వ్యతిరేకంగా సినిమాను రూపొందించి రోత పుట్టించినంత పనిచేశాడు. ఫస్టాఫ్‌లో చాలా సందర్భాల్లో ఇంటర్వెల్ ఎప్పుడవుతుంది? అని, సెకండాఫ్‌లో ఇక సినిమా అయిపోతే బాగుంటుందనే విధంగా సినిమాను అవుడేటెడ్ కామెడీ, సెంటిమెంట్ నడిపించడమే కాకుండా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాడు. చివరకు పాపం ప్రేక్షకుడు అనుకొనేంతగా ఈ సినిమా చూపించాడు. టోటల్‌గా ఏ మాత్రం ఆకట్టుకోలేని సన్నివేశాలు, ఫ్యామిలీ డ్రామాతో విసుగు పుట్టించి ఈ సినిమాను ముగించాడు.
తీరువీర్ విషయానికి వస్తే.. ఏ మాత్రం సందేహం లేకుండా టాలెంటెడ్ యాక్టర్ అనే విషయాన్ని గతంలో చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకొన్నాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తన క్యారెక్టర్‌కు న్యాయం చేయడానికి, తనలోని ప్రతిభనంతా తెరపైన పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమా విషయంలో కూడా తిరువీర్ అదే చేశాడు. కానీ తిరువీర్ టాలెంట్‌ను దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. పాయల్ రాధాకృష్ణ తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. అజయ్ ఘోష్ పర్వాలేదనిపిస్తాడు. గోపరాజు రమణ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. రాశీ, రూపాలక్ష్మీని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. మిగితా నటులందరూ వెగటు కామెడీకి బలి అయిపోయారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అసలు పిండే బాగా లేకపోతే వంటకాలు ఎలా బాగుంటాయి అంటారు. పసలేని కథ, కథనాల కారణంగా టెక్నిషియన్స్ కూడా న్యాయం చేయలేకపోయారు. అంతలో కొంత కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫి బెటర్‌గా అనిపిస్తుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ కంగాళీగానే ఉంది. ఈటీవీ విన్, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ఈ సినిమాలో కంటెంట్ పరంగా ఎలాంటి నాణ్యత కనిపించదు. రెండున్నర గంటలపాటు ఈ సినిమా ప్రేక్షకుడికి మానసిక సమస్యగానే మారుతుంది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా తెచ్చుకొన్న బజ్‌కు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఇన్నీ విషయాలు చర్చించుకొన్న తర్వాత.. పాపం ప్రతాప్ సినిమా చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుడి నిర్ణయానికే వదిలి వేస్తున్నాం.


Click it and Unblock the Notifications