Param Sundari Movie Review: పరమ్ సుందరి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, సంజయ్ కపూర్, రెంజీ పనికర్, సిద్దార్థ్ శంకర్, మనోజ్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఇనాయత్ వర్మ తదితరులు
దర్శకత్వం: తుషార్ జలోటా
నిర్మాత: దినేష్ విజన్
సినిమాటోగ్రఫి: సంతాన కృష్ణన్ రవిచంద్రన్
ఎడిటింగ్: మనీష్ ప్రధాన్
మ్యూజిక్: సచిన్ జిగర్
బ్యానర్: మడోక్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-08-29
బిజినెస్ మ్యాగ్నెట్ పర్మిత్ సచ్‌దేవ్ (సంజయ్ కపూర్) కుమారుడైన పరమ్ సచ్‌దేవ్ (సిద్దార్థ్ మల్హోత్రా) సాఫ్ట్‌వేర్ రంగంలో స్టార్టప్ కంపెనీలు పెట్టి కోట్ల రూపాయలు నష్టాన్ని తెచ్చిపెడుతుంటాడు. శేఖర్ అనే (అభిషేక్ బెనర్జీ) డేటింగ్ యాప్ క్రియేట్ చేయడంతో దానిని ప్రమోట్ చేయడానికి రెడీ అవుతాడు. డేటింగ్ యాప్‌లపై నమ్మకం లేని పరమ్.. దానిని టెస్ట్ చేయడానికి అందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొంటాడు. అందులో కేరళలో టూరిస్ట్‌లకు అతిథ్యమిచ్చే ఇంటిని నిర్వహిస్తున్న తెక్కెపట్టు సుందరి దామోదరన్ పిళ్లై ( జాన్వీ కపూర్) ప్రొఫైల్‌తో 100 పర్సెంట్ మ్యాచ్ కావడంతో ఆమెను వెతుక్కొంటూ వెళ్తాడు. తన అభిరుచులకు భిన్నమైన సుందరిని ప్రేమలో పడేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.
డేటింగ్ యాప్ స్టార్టప్‌ను ప్రమోట్ చేయడానికి పరమ్ తండ్రి పర్మిత్ ఎందుకు నిరాకరించాడు? డేటింగ్ యాప్‌కు ఫండింగ్ చేయడానికి కొడుకు పరమ్‌కు పర్మిత్ పెట్టిన కండీషన్స్ ఏమిటి? మోహిని ఆట్టం డ్యాన్స్‌ను ఇష్టపడే సుందరి ఎందుకు టూరిస్ట్ స్టే హోటల్‌ను నిర్వహించాల్సి వచ్చింది? పరమ్ పంపే లవ్ సిగ్నల్‌ను సుందరి ఎలా రిసీవ్ చేసుకొన్నది? సుందరితో వేణు (సిద్దార్థ్ శంకర్) పెళ్లిని ఆమె కుటుంబం ఎందుకు చేయాలని నిర్ణయించింది? సుందరి ఎంగేజ్‌మెంట్, పెళ్లిని అడ్డుకోవడానికి పరమ్ ఏం చేశాడు? పరమ్ తన తండ్రిని, సుందరి తండ్రిని పెళ్లికి ఒప్పించాడా? సుందరితో పరమ్ పెళ్లి జరిగిందా? అనేది ఈ సినిమా కథ.

సౌత్ అమ్మాయి నార్త్ అబ్బాయి ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్‌తో 2 స్టేట్స్, చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలు ఇంతకు ముందే భారీ విజయాన్ని అందుకొన్నాయి. ఇక ఓనమ్ పండుగను టార్గెట్ చేసి.. మలయాళం నేటివిటితో దర్శకుడు తుషార్ జలోటా అల్లుకొన్న ప్రేమ కథలో అసలు కొత్తదనం కనిపించదు. షారుక్, ఇతర బాలీవుడ్ సినిమాల్లోని పలు సీన్లను కాపీ కొట్టి రీ రైట్ చేసిన స్క్రిప్టులా పరమ్ సుందరి కనిపిస్తుంది. ఇక అంతా ఊహించినట్టే కథ సాగడం.. సన్నివేశాలు పేలవంగా ఉండటం ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటుంది. ఈ సినిమా పక్కా మూస కథ.. రెగ్యులర్ రొటీన్ లవ్ డ్రామాగా చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పాత సినిమాలను మిక్సీలో వేసి గ్రౌండ్ చేసిన కథగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాను కేవలం జాన్వీ కపూర్ గ్లామర్ మాత్రమే కొంత మేరకు కాపాడగలిగిందనే చెప్పాలి.
ఫస్టాఫ్‌లో సిద్దార్థ్ మల్హోత్రా, సంజయ్ కపూర్ అంటే తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రొటీన్‌గా, ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. ఇక జాన్వీ, సిద్దార్థ్ మధ్య కెమిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి రాసుకొన్న సీన్లు పరమ రొటీన్‌గా ఉండటంతో సినిమా ఎంగేజింగ్‌గా లేకపోయింది. స్టిప్ట్‌లోను, క్యారెక్టర్ల డిజైన్ మెచ్యురిటీ కనిపించదు. ఇక సెకండాఫ్‌లో ఏదైనా స్టోరీలో మ్యాజిక్ జరుగుతుందా? అనే ఆశించిన వారికి నిరాశే జరుగుతుంది. పక్కాగా రెగ్యులర్ పాటర్న్‌లో కథ సాగడం.. క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోవడంతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. సినిమా రెండో భాగం సాగదీయడం ప్రేక్షకుడి ఓపికకు పరీక్షలా ఉంటుంది.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. హీరోయిన్‌కు మించి సిద్దార్థ్ మల్హోత్రా తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించడంపై పెట్టిన శ్రద్ద.. యాక్టింగ్‌పై పెట్టి ఉండాల్సిందనిపిస్తుంది. వాస్తవానికి పరమ్ పాత్రను నెక్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సరుకు లేకపోవడం వల్ల సిద్దార్థ్ కూడా ఏమీ చేయలేకపోయాడనిపిస్తుంది. ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాను పూర్తిగా నిలబెట్టే బాధ్యతను తన భుజానికి ఎత్తుకొన్నది. గ్లామర్‌తో ఆకట్టుకోవడమే కాకుండా రొమాంటిక్ సీన్లలో చెలరేగిపోయింది. యూత్‌కు గిలిగింతలు పెట్టే బాడీ లాంగ్వేజ్‌తోనే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నది. ఇన్ని లోపాల మధ్య కూడా ఈ సినిమా చూద్దామనే ఫీలింగ్‌ను కలిగించడంలో జాన్వీ సక్సెస్ అయింది. చాలా సందర్భాల్లో జాన్వీ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేస్తుంది. చాలా రోజుల తర్వాత తెరపైకి వచ్చిన సంజయ్ కపూర్ క్యారెక్టర్ అత్యంత ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. మనోజ్ సింగ్, అభిషేక్ బెనర్జీ, జాన్వీ కపూర్ చెల్లెలుగా నటించిన ఇనాయత్ వర్మ ఫర్వాలేదనిపిస్తారు.
ఇక బలహీనమైన స్క్రిప్టు, క్యారెక్టరైజన్ పక్కన పెడితే.. ఈ సినిమా కంటెంట్ పరంగా కొంత మేరకు స్ట్రాంగ్‌గా కనిపించడానికి టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ దోహదపడ్డాయి. కేరళ అందాలను సినిమాటోగ్రాఫర్ సంతానకృష్ణ రవిచంద్రన్ అద్బుతంగా కెమెరాలో బంధించాడు. సినిమాను అందమైన పెయింటింగ్‌లా మార్చాడు. సచిన్ జిగర్ మ్యూజిక్ ఈ సినిమాకు బలంగా నిలిచింది. సోను నిగమ్ పాడిన పర్దేశియా పాట ఆడియెన్‌ను వెంటాడుతుంది. ఆ పాటను బ్యాక్ గ్రౌండ్ స్కోరుగా వాడుకోవడం సినిమాకు పాజిటివ్‌గా మారింది. బీగీ సారీ, సున్ మేరే యాక్ వే, సుందరి కే ప్యార్ మే పాటలు తెరపైన బాగున్నాయి. దినేష్ విజన్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
పరమ్ సుందరి సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఏ మాత్రం కొత్తదనం లేని లవ్ స్టోరిగా ఈ మూవీ కనిపిస్తుంది. పాత సీసాలో కొత్త వైన్ లాంటి సినిమా. ఈ సినిమాకు కేవలం జాన్వీ కపూర్, పాటలు స్ట్రెంగ్త్‌గా నిలిచాయి. కథ, కథనాలపై బెటర్‌గా వర్కువుట్ చేసి ఉంటే.. డెఫినెట్‌గా జెన్ జీ ఆడియెన్స్‌కు మంచి లవ్ స్టోరి అందించే అవకాశాన్ని మిస్ చేసుకొన్నారని చెప్పవచ్చు. ఈ మూవీ చూడటానికి జాన్వీ కపూర్, పాటలు తప్పా మరొక కారణం కనిపించదు. యూత్‌ను ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ గ్లామర్, అందాల ఆరబోత కోసం థియేటర్‌కు వెళ్లి చూడండి. లేకపోతే ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేయండి..


Click it and Unblock the Notifications











