Pareshan Review తెలంగాణ నేటివిటితో ఫన్.. ఎంటర్‌టైన్‌మెంట్! తిరువీర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
Rating: 2.5/5
నటీనటులు: తిరువీర్, మురళీధర్ గౌడ్, పావనీ కరణం, బన్నీ అభిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుడ్డెరా ఖాన్, రవి, రాజు బెడిగాల, శృతి రాయన్, అంజి బాబు వాల్గమన్, పద్మ వసంత, సురభీ రాఘవ, శివరాం, సాయి కిరణ్ యాదవ్
దర్శకత్వం: రూపక్ రొనాల్డ్‌సన్
నిర్మాత: సిద్దార్థ్ రాళ్లపల్లి
సమర్పణ: రానా దగ్గుబాటి
సహ నిర్మాత: విశ్వదేవ్ రాచకొండ, హేమ రాళ్లపల్లి
బ్యానర్: వాల్తేర్ ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫి: వాసు పెండమ్
ఎడిటర్: హరిశంకర్
మ్యూజిక్: యశ్వంత్ నాగ్
ఆర్ట్: శ్రీపాల్
సాహిత్యం: చంద్రమౌళి అక్కాల
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2023-06-02
క్రైస్తవ మతానికి చెందిన బొగ్గు గని కార్మికుడు సమర్పణం (మురళీధర్ గౌడ్) కుమారుడు ఐజాక్ (తిరువీర్). చేతికి అంది వచ్చిన కొడుకు కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా స్నేహితులతో అల్లరి చిల్లరిగా తిరుగుతుండటంతో తన ఉద్యోగాన్ని ఐజాక్‌కు ఇవ్వాలని అనుకొంటాడు. ఉద్యోగ మార్పిడి కోసం అధికారి రెండు లక్షల రూపాయలు లంచం అడగడంతో భార్య నగలు అమ్మి కొడుకు ఐజాక్‌కు ఉద్యోగం పెట్టించాలని అనుకొంటాడు. అయితే మధ్యవర్తికి డబ్బు అప్పజెప్పమని కొడుకు ఐజాక్ పెద్ద మొత్తం తల్లి ఇస్తుంది. కానీ ఆపదలో ఉన్న స్నేహితులు పాషా, శ్రీనుకి డబ్బు ఇస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లికి ముందే గర్ల్‌ఫ్రెండ్ శిరీష ప్రెగ్నెంట్ అని ఐజాక్ తెలుస్తుంది.
ఐజాక్ స్నేహితుడు పాషా ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయాడు? పాషాకు ఎందుకు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. మిగిలిన డబ్బు శ్రీనుకి ఎందుకు ఇచ్చాడు? సకాలంలో స్నేహితులు డబ్బులు ఇవ్వకపోవడంతో ఐజాక్‌కు ఎలాంటి కష్టాలు వచ్చాయి? ఉద్యోగం కోసం నగలు అమ్మిన డబ్బును కొడుకు దుబారా చేయడంతో తండ్రి సమర్పణం రియాక్షన్ ఏమిటి? ప్రేయసి శిరీషకు ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఐజాక్ పరిస్థితి ఏమిటి? టైమ్‌కు డబ్బు చేతికి రాకుండా, అదే సమయంలో ప్రేయసి ప్రెగ్నెన్సీ విషయాలను ఐజాక్ ఎలా డీల్ చేశాడనే ప్రశ్నలకు సమాధానమే పరేషాన్ సినిమా కథ.

క్రైస్తవ మత ప్రార్థనలతో వినోదం, కొడుకును ప్రయోజకుడిని చేయాలనే సమర్పణం ప్రయత్నాలతో పరేషాన్ ఎమోషనల్‌గా ప్రారంభం అవుతుంది. ఐజాక్ స్నేహితులు లైఫ్ స్టైల్, తెలంగాణ పల్లె వాతావరణం లాంటి అంశాలు ఫన్‌తో సాగుతాయి. డబ్బు స్నేహితులకు ఇవ్వడంతో ఎదురైన సమస్యలతో ఐజాక్ పడే పరేషాన్, హైరానా వినోదాత్మకంగా సాగుతుంది. ప్రేయసి అబార్షన్ కోసం సంపాదించిన డబ్బును స్నేహితుడు ఎత్తుకెళ్లడం లాంటి ఎమోషనల్ సన్నివేశంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. కథలో ఇంటెన్సిటీకి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం వినోదాన్ని పండించడమే లక్ష్యంగా సినిమా సాగుతుంది.
ఇక సెకండాఫ్‌లో కథలో ఏదైనా ట్విస్టులు, ఎమోషనల్ అంశాలు కనిపిస్తాయా అని ఎదురు చూసిన వారికి నిరాశే మిగులుతుంది. కథలో వైవిధ్యం లేకుండా స్నేహితుల కష్టాలు నుంచి ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేయడమే ప్రధాన ఉద్దేశంగా సాగుతుంది. తెలంగాణ యాస, వాతావరణం ఒద్దికగా ఉండటం సినిమాకు బ్యూటీగా అనిపిస్తుంది. కాకపోతే కథ ఒకే మూసతో సాగడం, సన్నివేశాల్లో వైవిధ్యం కొరవడటం సినిమాకు కొంత మైనస్ అనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి తప్ప.. మిగితా వారికి కనెక్ట్ అవుతుందా? అంటే కష్టమే అని చెప్పాల్సి ఉంటుంది. సెకండాఫ్‌లో సత్తి వేలు తెగిన సీన్లు, ఐజాక్ బ్యాండ్ డ్రస్ సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. తిరువీర్ మరోసారి వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. అమాయకత్వంతో కూడిన పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని సీన్లలో మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతానని మరోసారి ఐజాక్ పాత్రతో తిరువీర్ స్పష్టం చేశాడు. ఇక శిరీషగా పావని యాక్టింగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సమర్పణం పాత్రలో మురళీధర్ గౌడ్ మరోసారి మెరుపులు మెరిపించారు. బ్యాండ్ మేళం సీన్‌లోను, క్రైస్తవ మత ప్రార్థనల సీన్లలో తనదైన శైలిలో నటించారు. మిగితా పాత్రల్లో పాషా, టైగర్ శ్రీను,ఆర్జీవి, శ్రీను, మైదాక్ పాత్రల్లో నటించిన వారు కొత్తవారైనప్పటికీ.. అనుభవం ఉన్న యాక్టర్ల మాదిరిగా నటించడమే కాకుండా నాన్ స్టాప్ కామెడీని వడ్డించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం సినిమాటోగ్రఫి. తెలంగాణ ప్రాంతంలోని పచ్చదనాన్ని, మనుషుల్లో ఉండే నిజాయితీని, పల్లె వాతావరణాన్ని వాసు పెండమ్ చక్కగా కాప్చర్ చేశారు. లైటింగ్, కలర్ ప్యాటర్న్ తెరను రిచ్‌గా, ఫీల్‌గుడ్‌గా మార్చింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ఈ సినిమాకు మరో స్సెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగినట్టు ఉన్నాయి.
పరేషాన్ సినిమా తెలంగాణ పల్లె వాతావరణం, యాస, భాషను బేస్ చేసుకొని పూర్తిగా ఫన్, వినోదంగా రూపొందించిన చిత్రంగా చెప్పుకోవచ్చు. అయితే ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ఎమోషన్స్ కూడా జొప్పించి ఉంటే ఈ ప్రయత్నం, ప్రయోగానికి సార్థకత ఉండేది. తెలంగాణ అంటే యూత్‌కు తాగుడు తప్ప మరో పని ఉండదనే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందనిపిస్తుంది. తెలంగాణ యాస, భాషతో కూడిన డైలాగ్స్ మంచి హాస్యాన్ని పండిచాయి. పరేషాన్ జస్ట్ టైంపాస్ మూవీ. తెలంగాణ నేటివిటితో కూడిన వినోదాన్ని ఆశించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చతుంది. అంచనాలు లేకుండా వెళితే.. మంచి ఫీల్‌తో బయటకు వచ్చే అంశాలు ఉన్నాయి. తెలంగాణేతర ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే దానిని బట్టే సినిమా హిట్టా? ఫట్టా అనేది ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications











