Pindam Review ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్.. హారర్ మూవీ ఎలా ఉందంటే.. పిండం సమీక్ష
Rating: 2.75/5
నటీనటులు: శ్రీరామ్, ఖుషీ రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు తదితరులు
దర్శకత్వం: సాయికిరణ్ దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స
సహ నిర్మాత: ప్రభు రాజా
సమర్పణ: ఆరోహి దైదా
కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
పాటలు: కవి సిద్దార్థ
మ్యూజిక్: కృష్ణ సౌరబ్ సూరంపల్లి
సినిమాటోగ్రఫి: సతీష్ మనోహర్
ఆర్ట్: విష్ణు నాయర్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
కాస్ట్యూమ్స్: పద్మ ప్రియ
ఫైట్స్: జష్వ
బ్యానర్: కళాహి మీడియా
రిలీజ్ డేట్: 2023-12-15
క్రిస్టియన్ మతానికి చెందిన ఆంథోని (శ్రీరామ్) రైస్ మిల్లులో అకౌంటెంట్. భార్య (ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు సోఫి, తార, తల్లి సూరమ్మతో కలిసి ఓ గ్రామంలో అతిపురాతన ఇంటిని కొనుగోలు చేసి నివాసం ఉంటాడు. ఆ ఇంటిలో చేరిన తర్వాత ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడంతో గర్బిణిగా ఉన్న భార్య హాస్పిటల్‌లో చేరుతుంది. తల్లి ఊహించని రీతిలో ప్రమాదానికి గురి అవుతుంది.

ఆంథోని పురాతన ఇంటిని కొనుగోలు చేసి అక్కడే ఎందుకు ఉండాలని అనుకొన్నాడు? పాత ఇంటిలో చేరిన తర్వాత పిల్లలకు, కుటుంబానికి ఎదురైన సమస్యలు ఏమిటి? ఇంటిలో జరిగిన సంఘటనలతో ఆంథోని ఎలా స్పందించాడు? ఆంథోని ఇంటిలోని క్షుద్ర శక్తులను అరికట్టేందుకు అన్నమ్మ (ఈశ్వరీరావు) ఏం చేసింది. అన్నమ్మ, ఆమె సన్నిహితుడు (అవసరాల శ్రీనివాస్) ఆంథోని కుటుంబాన్ని సమస్యల నుంచి గట్టెక్కించారా? ఆ ఇంటిలో అంతకు ముందు ఏం జరిగింది? తన ఇంటిని ఆంథోని వదిలి వెళ్లాడా? ఆ ఇంటిలో చిన్న కూతురికి ఆవహించిన ఆత్మను ఎలా విదిలించారనే ప్రశ్నలకు సమాధానమే పిండం సినిమా కథ.
దర్శకుడు సాయికిరణ్ రాసుకొన్న స్టోరీ.. ఆ కథను చెప్పడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. భావోద్వేగంతో సాగే పాత్రలకు ఆయన ఎంచుకొన్న నటీనటులు ఈ సినిమాకు పాజిటివ్‌గా మారిందని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్ చెప్పడమే కాకుండా నిజంగా కొన్ని సీన్లలో భయపెట్టించే ప్రయత్నం చేశారు. సన్నివేశాల్లోని ఎమోషన్స్ పండించడానికి సినిమాటోగ్రఫి, మ్యూజిక్‌ను ఉపయోగించుకొన్న విధానం సినిమాకు మూడ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.
ఇక ఫస్టాఫ్‌ను పకడ్బందీగా మంచి సన్నివేశాలతో ముందుకు నడిపించిన సెకండాఫ్‌ను కూడా అదే స్థాయిలో నడిపించారనే చెప్పాలి. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు కథ రొటీన్‌గా అనిపించినా.. ఫ్లాష్ బ్యాక్ చెప్పిన విధానం గుండెను పిండేసేలా చేస్తుంది. కథను ముగించడానికి రాసుకొన్న డ్రామా కూడా బాగా పడింది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. సాయికిరణ్ మూవీని తీసిన విధానం చూస్తే తొలి చిత్ర దర్శకుడని ఎక్కడా అనిపించరు.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు గ్లామర్ హీరో, యాక్షన్ హీరోగా శ్రీరామ్ కనిపించారు. కానీ పిండం సినిమాలో చూస్తే ఢిఫరెంట్ లుక్, బాడీ లాగ్వేంజ్‌తో ఆకట్టుకొన్నారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. ఇక ఆంథోని భార్యగా నటించిన ఖుషి రవి తన పాత్రలో ఒదిగిపోయారు. కథకు బలంగా ఉండే పాత్రలో తన వంతు న్యాయం చేశారు. ఇద్దరు చిన్నపిల్లల నటన చాలా బాగుంది. ఇక ఈశ్వరీ రావు డిగ్నిఫైడ్ క్యారెక్టర్‌లో కథను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు. అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిధి తక్కువైనా గుర్తుండి పోతారు. రవివర్మ రోల్ ఈ సినిమాకు బలంగా ఉంటుందని చెప్పవచ్చు.

పిండం సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. పలు సన్నివేశాలను కృష్ణ సౌరబ్ సూరంపల్లి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాగా ఎలివేట్ చేశారు. లైటింగ్, కలర్ ప్యాటర్న్‌తో సన్నివేశాల మూడ్‌ను సతీష్ మనోహర్ ఎలివేట్ చేయడమే కాకుండా సినిమాను రిచ్‌గా మార్చారు. ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. యశ్వంత్ దగ్గుమాటి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫ్యామిలీ ఎమోషన్స్, హారర్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అంశాలతో రూపొందించిన చిత్రం పిండం. భావోద్వేగానికి గురిచేసే ఓ పాయింట్ చుట్టు అల్లుకొన్న థ్రిల్లర్ ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురి చేస్తుంది. చైల్డ్ సెంటిమెంట్ అంశాలు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. హారర్‌తో కూడిన సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా.. కథనం, ఎమోషనల్ సీన్లు, స్క్రీన్ ప్లేతో దర్శకుడు సాయికిరణ్ కట్టిపడేశాడనే చెప్పాలి. పక్కాగా ఇది థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ. థియేటర్‌లో చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది.


Click it and Unblock the Notifications











