twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పొగరు'

    By Staff
    |

    Pogaru
    పందెం కోడి చిత్రం తర్వాత విశాల్‌ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ యాక్షన్‌ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి చేసిన మరో ప్రయత్నమే - 'పొగరు'. ఈ చిత్రంలో మాస్‌ ఆడియెన్స్‌ను ఆకర్షించడానికి అన్ని మసాలాలు సమగ్రంగా ఉన్నాయి. బోల్డన్ని యాక్షన్‌ సన్నివేశాలు, రొమాంటిక్‌ డ్యూయెట్లు, ముగ్గురు హీరోయిన్లు రీమాసేన్‌, శ్రియారెడ్డి, కిరణ్‌ రాథోడ్‌. మధ్యమధ్యలో నేల, బెంచీ ప్రేక్షకుల చేత విజిల్స్‌ వేయించడానికి సరిపడా సీన్లు దట్టించి ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి మాస్‌ చిత్రంగా మలచడంలో దర్శకుడు తరుణ్‌ గోపి శ్రమించారు. ఒకరకంగా ఈ చిత్రం హీరో విశాల్‌ కోసమే ప్రత్యేకంగా రూపొందించినదిగా అర్థం అవుతుంది.

    ఆనందంగా గడిపే కుటుంబంలో ఒక్కగానొక్క కొడుకు గణేశ్‌ (విశాల్‌). అతని మామయ్య పోలీస్‌ ఆఫీసర్‌ (భానుచందర్‌). గణేశ్‌ మెడిసిన్‌ చదువుతుంటాడు. వారు ఓసారి గుడికి వెళ్తుండగా అక్కడ వడ్డీ వ్యాపారి ఈశ్వరి (శ్రియారెడ్డి) కొంతమంది గూండాలను వెంటేసుకుని వచ్చి దందా చేస్తుంటుంది. దానిని అడ్డుకున్న అమల (రీమాసేన్‌)ను ఈశ్వరి బట్టలూడదీసి అవమానిస్తుంది. అది చూసి కోపంతో గణేశ్‌ శ్రియారెడ్డికి కూడా అదే మాదిరి పరాభవం చేసి, ఆమెతో వచ్చిన గూండాలను చితకబాదుతాడు. అప్పటి నుంచి అతడి మీద ద్వేషం పెంచుకున్న ఈశ్వరి అతడిని పెళ్లాడి సాధిస్తానని శపథం చేస్తుంది. ఈశ్వరి ఇద్దరు అన్నయ్యలు కూడా గూండాలే. పెద్దన్నయ్య జైల్‌లో ఉంటాడు. రెండోవారు ఇక్కడ ఫైనాన్స్‌ దందాలు చేస్తుంటాడు. గణేశ్‌ను పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఈశ్వరి ప్రమాదానికి గురై మరణిస్తుంది. పోతూపోతూ.. గణేశ్‌కు జన్మలో మరెవ్వరితో పెళ్లి కాకుండా చేయాలని అన్నయ్యను కోరుతుంది. చెల్లెలు పోయిందన్న కోపంతో కక్ష సాధించేందుకు ఈశ్వరి అన్నయ్య సిద్ధమవుతాడు. అది తెలిసి గణేశ్‌ తల్లిదండ్రులు అతడిని వైజాగ్‌ పంపిస్తారు. వైజాగ్‌లో గణేశ్‌కు అమల పరిచయం అవుతుంది. వారిని హతమార్చడానికి ఒక ముఠా వెంటాడటంతో వారితో హీరో ఫైట్‌ చేయాల్సి వస్తుంది. ఆ పోరాటంలో ఈశ్వరి చిన్నన్నయ్య కూడా మరణిస్తాడు. అప్పుడు జైలు నుంచి వచ్చిన పెద్దన్నయ్య ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు వైజాగ్‌ రాగా, ఈ యుద్ధం ఇంతటితో ఆపేద్దామని, తాను డాక్టర్‌నని, ప్రాణం పోయడం తప్ప తీసే అధికారం లేనివాడనని చెప్పి ఈశ్వరి పెద్దన్నయ్యని ఒప్పిస్తాడు. అమల, గణేశ్‌ కథ సుఖాంతం అవుతుంది. సంక్షిప్తంగా ఇదీ కథ.

    యాంగ్రీ యంగ్‌మేన్‌గా పవర్‌ఫుల్‌గా నటిస్తునే మరోవంక అమాయకమైన స్టూడెంట్‌గా కూడా విశాల్‌ చక్కని నటన ప్రదర్శించాడు. శ్రియా రెడ్డి ఈ చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేసింది. వడ్డీ వ్యాపారిగా రఫ్‌గా డైలాగులు చెప్పడంలోనూ, రగ్డ్‌గా నటించడంలోనూ ఆమె చక్కని పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. హీరోతో కలిసి ఆమె పాడే ఓ డ్రీమ్‌ సాంగ్‌ రొమాంటిక్‌గా ఒకింత మోతాదు మించినా బావుంది. ఇంకా రీమాసేన్‌ చాలా గ్లామరస్‌గా కనిపిస్తుందీ చిత్రంలో. కిరణ్‌ రాథోడ్‌ ఒక ఐటెమ్‌ సాంగ్‌లో వచ్చినా... అలరిస్తుంది.

    ఈ చిత్రంలో మైనస్‌ పాయింట్లు గురించి చెప్పాలంటే.. విలన్స్‌ క్యారెక్టర్లు సరిగ్గా ఎస్టాబ్లిష్‌ కాలేదు. శ్రియారెడ్డి క్యారెక్టర్‌ బావున్నా ఆమె ఇద్దరన్నయ్యలు దాదాపు డమ్మీలుగా కనిపిస్తారు. హీరో మావయ్యగా భానుచందర్‌ క్యారెక్టర్‌ కూడా పెద్దగా ప్రాధాన్యం లేనిదే. వడివేలు కామెడీ అక్కడక్కడా బావున్నా అందరి చేత తన్నులు తినడం ఒకింత బోర్‌ కొడుతుంది.

    మొత్తానికి కమర్షియల్‌ అంశాలన్నీ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రంలో ఒకింత తమిళ వాసన ఉంటుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం ఫర్వాలేదు. ప్రియన్‌ కెమెరా పనితనం మెచ్చుకోతగ్గ విధంగా ఉంది. ఫస్ట్‌ హాఫ్‌ కొంత నిదానంగా నడిచినా, ద్వితీయార్థం వేగంగా పరిగెట్టించాడు దర్శకుడు. క్లయిమాక్స్‌ వరకూ ఆ పట్టును వదలకుండా దర్శకుడు తరుణ్‌ గోపి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. జికె ఫిలింస్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని రూపొందించింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X