twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోహీరోయిన్ల 'పోకిరి'

    By Staff
    |

    Pokiri
    సినిమా: పోకిరి
    విడుదల తేదీ: 28-04-2006
    నటీనటులు: మహేష్‌బాబు, ఇలియానా, ప్రకాశ్‌రాజ్‌, సాయాజి షిండే,
    నాజర్‌, ఆశీష్‌ విద్యార్థి, సత్యప్రకాశ్‌, బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్‌, జీవి,
    సుబ్బరాజు, అజయ్‌, విజయ్‌, సుధ, నర్సింగ్‌ యాదవ్‌, గణేష్‌ తదితరులు
    సంగీతం: మణిశర్మ
    కెమెరా: శ్యాం కె. నాయుడు
    ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
    ఫైట్స్‌ : విజయన్‌
    కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: పూరీ జగన్నాథ్‌
    సమర్పణ: ఇందిర

    పూరీ మాస్‌ ట్రీట్‌మెంట్‌కి మహేష్‌ క్లాస్‌ యాక్షన్‌ కలిపి తయారు చేసిన కాక్‌టెయిల్‌ 'పోకిరి' సినిమా. సెకండాఫ్‌ కథ కాస్తా పక్కదారి పట్టినా క్లైమాక్స్‌కు వచ్చే సరికి సర్దుకోవటంతో చిత్ర నిలబడింది. ప్రత్యేకంగా పోకిరిగా మహేష్‌ బాబు వంక పెట్ట వీలు లేని విధంగా నటించాడు.

    పండు (మహేష్‌బాబు) కిరాయి గుండా. 'నేనెంత వెధవనో నాకే తెలియదు' అని అంటూ ఒప్పుకున్న పనులను ఎంద మంది ఎదురొచ్చినా సునాయసంగా పూర్తి చేస్తూ వుంటాడు హీరో. శృతి ( ఇలియానా) ఎరోబిక్‌ టీచర్‌. తండ్రిలేని కుటుంబానికి అన్నీ తానే అయి నెట్టుకొస్తూ వుంటుంది. పశుపతి ( ఆశీష్‌ విద్యార్థి) అనే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆమెపై కన్నేసి వెంటపడుతూ వుంటే పండు అండతో తప్పించుకుంటుంది. తర్వాత ప్రేమలో పడి పాటలు పాడుతూ వుంటుంది. మరో పక్క పండు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని బెదిరించి లోకల్‌ మాఫియా దగ్గర పనిచేస్తూ పక్క గ్రూప్‌తో తగువు పడతాడు. వాళ్లు అతనిపై కక్ష పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా సిటీకి కొత్తగా వచ్చిన పోలీసు అధికారి (సాయాజి షిండే) ఈ గ్రూప్‌లను అణచేయాలని అనుకుంటూ వుంటాడు. పండు ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు, ఎలా రియాక్ట్‌ అయ్యాడు అన్నది తెరపై చూడాల్సిందే.

    తెలుగు తెరపై ఈ తరహా సినిమాలు కొత్త కాకపోయినా ట్రీట్‌మెంట్‌ భిన్నత్వమే ప్లస్‌ పాయింట్‌ అయింది. పోకిరిగా మహేష్‌ చెప్పే డైలాగ్‌లు, ఎమోషన్స్‌ బాగా పండాయి. ఫస్టాఫ్‌ పోకిరి ప్రేమకథగా నడిచే సినిమా ఇంటర్వెల్‌ తర్వాత దారి మార్చుకోవడం కొంత ఇబ్బందే. కొంత సేపు సెకండాఫ్‌లో కథ హీరోకు సంబంధం లేకుండా విలన్‌, కామెడీ ట్రాక్‌లు నడవడం స్క్రీన్‌ప్లే లోపం. హీరోయిన్‌ తనకు పోలీసు విలన్‌ నుంచి రక్షణ కావాలని ఏరి కోరి హీరో ప్రేమలో పడి తర్వాత నువ్వూ ఇలాంటి వాడివే అంటూ ఏడుస్తూ నిలదీయడం పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ తీసింది. ముఖ్యంగా లోకల్‌ మాఫియా కథగా మొదలై చివరికి విలన్‌ హీరోల మధ్య గొడవలుగా మారడం స్టోరీలైన్‌పై స్పష్టత లేకపోవడమే కారణం. ఇవన్నీ పక్కనపెడితే పూరీ ప్రత్యేకంగా పోకిరి పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది.

    అలాగే సీన్స్‌ కూడా బాగా ట్రీట్‌మెంట్‌ చేసి తయారు చేశారు. కానీ కథను మరిచి కసరత్తు చేయడంతో విలన్‌ పాత్రలు ఎక్కువ కావడం, కామెడీ ట్రాక్‌ వేరుగా నడవడం జరిగాయి. టీవీ చానెల్స్‌పై సెటైర్లు, బ్రహ్మానందం కామెడీ కథకు సంబంధం లేకపోయినా బాగానే అలరించాయి. హీరోయిన్‌ను ఆస్పత్రిలో చేర్పించినప్పుడు తనను తాను పోకిరిగా పరిచయం చేసుకునే సమయంలోని డైలాగ్‌లు చాలా బాగున్నాయి. 'గల గల పారుతున్న గోదావరిలా/ జలజల పారే కన్నీరులా' పాట మెలొడీగా చాలా బాగుంది. 'బీ థర్టీన్‌' సినిమా తరహా ఫైట్స్‌, ట్రైనింగ్‌ డే సినిమాలోని పోలీసు క్యారెక్టరైజేషన్‌ విశిష్టంగా కనిపించాయి. దర్శకత్వ పరంగా పూరీకి మంచి మార్కులు పడ్డట్లే.

    ఏది ఏమైనా బోర్‌ లేకుండా సినిమా నడపడం డైలాగ్‌లు ప్రత్యేక మోడ్యులేషన్‌లో ఉండడం, కెమెరా పనితనం, మహేష్‌ నటన, ఇలియానా అందాలు మామూలు కథను బాగుండేలా చేశాయి. ఈ చిత్రం యువతనే కాకుండా ఫ్యామిలీని కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X