Prasanna Vadanam Review: సుహాస్ ఖాతాలో హిట్టు పడిందా? ప్రసన్న వదనం సినిమా సమీక్ష
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్, వైవా హర్షా, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుషాలిని తదితరులు
దర్శకత్వం: అర్జున్ వైకే
నిర్మాతలు: జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టీఆర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
రిలీజ్ డేట్: 2024-05-03
సూర్య(సుహాస్) ఓ రేడియో జాకీ. అనర్గళంగా మాట్లాడేస్తూ... తన మిత్రుడు(వైవా హర్షా)తో ఎంతో సరదాగా జీవితం గడిపేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగి... ఆ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోతాడు సూర్య. అదే యాక్సిడెంట్ లో సూర్య తలకు బలమైన గాయం తగిలి ఎదుటి వ్యక్తుల ముఖాన్ని గుర్తుపట్టలేని (ఫేస్ బ్లైండ్ నెస్) డిజార్డర్ తో బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలో తన కళ్లెదుట అమృత(సాయి శ్వేత) అనే అమ్మాయిని ఓ వ్యక్తి లారీ కిందకు తోసేయడంతో ఆమె ఘోరంగా చనిపోతుంది. దీనిని సూర్య చూసి... పోలీసులకు చెబుతాడు. అయితే అమృతని తోసేసిన వ్యక్తిని గుర్తుపట్టలేని సూర్య... మరి ఈ కేసుల దోషులను పట్టించడంలో సూర్య ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అమృతని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఓ యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను కూడా బాగా ఎంగేజ్ చేస్తాయి. దర్శకుడు అర్జున్ ఎంచుకున్న ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ కూడా ఇలాంటి యూనిక్ కన్సెప్టే. చాలా కొత్తగా ఉంది. ఇలాంటి కొత్త పాయింట్ ని తీసుకున్న దర్శకుడు అర్జున్ ఆ పాయింట్ అంతే కొత్తగా తెరపై చూపించి థ్రిల్ చేశాడు.

సూర్య తల్లితండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవడం, సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం, దాంతో అతను పడే బాధలు... ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అధ్య( పాయల్ రాధకృష్ణ)తో రొమాంటిక్ సన్నివేశాలు.. ఫన్నీ సీన్స్ అన్నీ కలిపి యూత్ కి మంచి ఎంటర్ టైన్ ఇస్తాయి. ఫస్టాఫ్ కొంత స్లోగా సాగడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది.
ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేసి... ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథ, కథనాలను పరిగెత్తించారు దర్శకుడు. సెకెండాఫ్‌లో ఎక్కడా బోర్ అనేది లేకుండా సినిమాని ముందుకు తీసుకెళ్లారు. క్రైం ఎలిమెంట్ చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే... ఆద్యంతం ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. నిజమైన థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
సెకండ్ హాఫ్ ని మరింత గ్రిప్పింగ్ గా నడిపాడు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ట్విస్ట్ ని ఎవరూ పసిగట్టలేరు. అంత బలంగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. అప్పటి వరకూ కొంత నిదానంగా అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు క్లాప్స్ కొట్టేలా వుంటుంది.
ఎప్పటి లాగే సూర్య పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు సుహాస్. ఎమోషనల్ సీన్స్ లో తన నటన కట్టిపడేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు. యాక్షన్ ని చాలా రియల్ గా డిజైన్ చేశారు. పాయల్ లవ్ ట్రాక్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఆ పాత్రని క్లైమాక్స్ లో వాడుకున్న తీరు ఇంకా బావుంది. రాశి సింగ్ పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు. అది థియేటర్స్ లోనే చూడాలి.

నితిన్ ప్రసన్న మరోసారి సహజత్వంతో ఆకట్టుకున్నాడు. హర్ష కొన్ని సీన్స్ లో నవ్విస్తాడు. రెండు సీన్స్ లో కనిపించిన సత్య కూడా తనవంతుగా నవ్వులు పూయిస్తాడు. వరుణ్ పాత్రలో నందు ఆకట్టుకుంటారు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
బేబీ ఫేం విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా వుంది. హీరో సుహాస్, హీరోయిన్స్ అండ్ నందుని చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ లావిష్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టాడు దర్శకుడు అర్జున్. టిల్లూ స్క్వయర్ తరువాత థియేటర్లలో చూసే... ఓ మంచి థ్రిల్లర్ ని తెరకెక్కించి విజయం సాధించారు. దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా.. అంచనాలు పెట్టుకొని వెళ్లినా ఈ సినిమా అన్ని రకాల సంతృప్తిని అందిస్తుంది.


Click it and Unblock the Notifications











