KGF Chapter 2 review ప్రశాంత్ నీల్, యష్ సూపర్ మ్యాజిక్.. బాక్సాఫీస్‌ను కుదిపేసే మాన్‌స్టర్!
నటీనటులు: యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు, అర్చన జోస్, అచ్యుత్ కుమార్, వశిష్ట సింహ తదితరులు
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
నిర్మాత: విజయ్ కిరంగదూర్
సినిమాటోగ్రఫి: భువన్ గౌడ
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
మ్యూజిక్: రవి బస్రూర్
బ్యానర్: హేంబలే ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2022-04-14
Recommended Video


కేజీఎఫ్ చాప్టర్ 2 కథ ఇలా..
కేజీఎఫ్ ప్రాంతంలో అధిపత్యం కొనసాగిస్తున్న గరుడను మట్టుపెట్టిన తర్వాత రాకీ భాయ్ (యష్) తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు దూకుడు పెంచుతాడు. ఒకే ఒక బంగారు మైనింగ్ అనుకొంటున్న సమయంలో తొమ్మిదికిపైగా బంగారు గనులను కనుగొంటాడు. ప్రపంచ గోల్డ్ బిజినెస్ రంగంలో రాకీ భాయ్ రారాజుగా మారిపోతాడు. బయటి ప్రపంచం నుంచి వచ్చిన ఓ వ్యక్తి కేజీఎఫ్ ప్రాంతాన్ని వశం చేసుకొన్నాడనే వార్త సీబీఐ నుంచి దేశ ప్రధాని (రవీనా టాండన్) కి చేరుతుంది. అయితే రాకీ భాయ్ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి ప్రధాని రంగంలోకి దిగుతుంది.

KGF Chapter 2 కథలో ట్విస్టులు
కేజీఎఫ్‌లో తన సామ్రాజ్యాన్ని రాకీ భాయ్ ఎలా విస్తరించాడు? అప్పటికే అధిపత్యం కొనసాగిస్తున్న ముఠాను ఎలా తన మార్గం నుంచి తొలగించుకొన్నాడు? కేజీఎఫ్‌లో రాకీ భాయ్ వ్యవహారాలపై సీబీఐ ఎందుకు కన్నేసింది? రాకీ భాయ్‌ని నిలువరించేందుకు అధీరా (సంజయ్ దత్) ఎలాంటి పన్నాగాలు పన్నాడు. తన మార్గంలోకి ఎదురు వచ్చిన అధీరాను రాకీ భాయ్ ఎలా నిలువరించాడు? తన సామ్రాజ్యాన్ని కూల్చడానికి మాస్టర్ మైండ్‌గా మారిన కేంద్రమంత్రిపై రాకీ భాయ్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? రాకీ భాయ్ కథకు ముగింపు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే KGF Chapter 2 సినిమా కథ.

ఫస్టాఫ్ మూవీ అనాలిసిస్
అనంత్ నాగ్ కుమారుడిగా ప్రకాశ్ రాజ్ చేత నేరేషన్ ఇవ్వడంతో మళ్లీ కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్తారు. గరుడను హత్య చేసి కేజీఎఫ్ ప్రాంతంలో అధిపత్యం కొనసాగించిన తర్వాత తన ప్రేయసిని హైజాక్ చేసి తీసుకొని రావడమనే ఎపిసోడ్‌తో ఎమోషనల్‌గా మారుతుంది. నా ప్రియురాలికి పడుకొనేందుకు గదిని సిద్దం చేయమంటే.. ఇద్దరం కలిసి పడుకొనే విధంగా రూమ్‌ను డెకరేట్ చేశారేంటి అనే రొమాంటిక్ మూమెంట్స్‌తో అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఇక చనిపోయాడనుకొనే అధీరా ఎంట్రీ ఇవ్వడంతో స్టోరి మరింత ఇంటెన్స్‌గా పవర్ ప్యాక్‌గా మారిపోతుంది. ఊహకందని విధంగా సన్నివేశాలను పేర్చి ఫస్టాఫ్‌ను మరింత ఎమోషనల్‌గా, క్రేజీగా ప్రశాంత్ నీల్ మార్చేశాడు.

సెకండాఫ్ పవర్ ప్యాక్డ్‌గా
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. గడియారంలో గంట మోగడానికి పెద్ద ముల్లు 60 అడుగులు వేస్తే.. చిన్నముల్లు ఒక్క అడుగు వేస్తుంది అంటూ రాకీ భాయ్ లైఫ్ ఫిలాసఫీని అద్భుతంగా తెరమీద చూపించాడు. ఇక సెకండాఫ్‌లో కథలోకి ప్రధాని పాత్ర ప్రవేశించడంతో సినిమా జెట్ స్పీడ్‌లా దూసుకుపోతుంది.
హై ఓల్టేజ్ సన్నివేశాలతో ప్రేక్షకుడికి ఊపిరి పీల్చుకొనే టైమ్ కూడా ఇవ్వకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ తన టేకింగ్ అంటే ఏమిటో రుచి చూపించాడు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో రాకీ భాయ్ తండ్రి కాబోతున్నాడనే సీన్‌ను అద్భుతంగా తెరకెక్కించి సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చాడు. అలాగే చివరి 20 నిమిషాలు ఉత్కంఠను భరించలేకుండా శ్వాస ఆగిపోతుందా అనే టెంపోను క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

ప్రశాంత్ నీల్ మేకింగ్, టేకింగ్
ఎలాంటి అంచనాలు లేకుండా KGF Chapter 1 చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో KGF Chapter 2 పై దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ఒత్తిడి ఉంటుందని అనుకొంటారు కానీ.. అలాంటి ప్రెజర్ ఎక్కడ దర్శకుడిపై పడలేదనే విషయం ప్రతీ సన్నివేశంలో కనిపిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతీ సీన్‌ను ఓ సినిమాగా చెక్కినట్టు స్పష్టమవుతుంది. ఎమోషన్స్‌ను భారీగా క్యారీ చేస్తూనే.. అంతే మొత్తంలో యాక్షన్ సీన్లను, ఆ సన్నివేశాల్లో నటుల ఫెర్ఫార్మెన్స్‌ను కలబోసి ఓ ప్యాకేజీగా అందించాడు. సాధారణంగా ఓ సినిమాలో మూడు నాలుగు ఎలివేషన్ షాట్స్.. బిల్డప్ మూమెంట్స్ ఉంటే.. గొప్పగా చెప్పుకొనే పరిస్థితి. కానీ సినిమా మొత్తంగా ఎలివేషన్ షాట్స్.. బిల్డమ్ మూమెంట్స్ ప్రశాంత్ నీల్ కేకపెట్టించాడు. ఒక సన్నివేశం కూడా బాగాలేదనే విధంగా పవర్ ప్యాక్డ్‌గా KGF Chapter 2ను ఓ ఎపిక్ మూవీగా తీర్చిదిద్దాడు. ప్రశాంత్ నీల్ విజన్, మేకింగ్, టేకింగ్‌కు ప్రతీ ప్రేక్షకుడు తల వంచి హ్యాట్సాప్ అనే పరిస్థితే కనిపిస్తుంది.

యష్ భగభగ మండే నిప్పు కణికలా..
యష్ నటన విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ చేతిలో పదునైన ఆయుధంగా, తిరుగులేని బ్రహ్మస్త్రంలా రాకీ భాయ్ కనిపిస్తాడు. బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, కళ్లలో ఎక్స్‌ప్రెషన్స్‌తో తెర మీద భగభగ మండే నిప్పు కణికలా, నట అగ్నిపర్వతం బద్దలై లావా పొంగుతుందా అనే విధంగా యష్ నటన అనిపిస్తుంది. బంగారు కడ్డీని వేడి చేసి నచ్చిన విధంగా షేప్ చేసుకొనే విధంగా దర్శకుడి విజన్‌కు బానిసైపోయాడనిపిస్తుంది. రాకీ భాయ్ పాత్రలో యష్ ఒదిగిపోయాడని చెప్పడం కంటే జీవించాడని అనడం సమంజసంగా ఉంటుంది. ఫెర్ఫార్మెన్స్ నిలువెత్తు విగ్రహంగా యష్ తెరమీద కనిపిస్తాడు.

సంజయ్ దత్, రవీనా టాండన్, ఇతరుల గురించి
మిగితా పాత్రల విషయానికి వస్తే.. అధీరాగా సంజయ్ దత్ తన కెరీర్‌లోనే బెస్ట్ రోల్‌లో కనిపించాడని చెప్పవచ్చు. సంజూ బాబా ఓ హై ఓల్టేజ్ యాక్టింగ్ చేసినప్పటికి.. యష్ ముందు తేలిపోయినట్టే కనిపిస్తాడు. ఇక దేశ ప్రధానిగా రవీనా టాండన్ ఎంట్రీ తర్వాత కథ, కథనంలో టెంపో పెరిగిపోతుంది. శ్రీనిధి శెట్టి రోల్ ఎమోషనల్ డ్రైవ్‌గా కనిపిస్తుంది.
ఈ సినిమా విజయానికి కావాల్సిన ఫెర్ఫార్మెన్స్‌ను డెలివరీ చేయడంలో తనకు వచ్చిన అవకాశాన్ని పర్‌ఫెక్ట్‌గా ఉపయోగించుకొన్నది. రావు రమేష్ సీబీఐ ఆఫీసర్‌గా తన వంతు న్యాయం చేశాడనిపిస్తుంది. ఇక ప్రకాశ్ రాజ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిపోయాడు. తనదైన ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో కథను ఎమోషనల్‌గా మార్చాడు. మిగితా పాత్రల్లోని వారు తమ పాత్రలకు న్యాయం చేసే విధంగా నటించారు.

టెక్నికల్ విభాగాల పనితీరు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. KGF Chapter 2 సినిమాను Larger than Lifeగా మార్చింది సినిమాటోగ్రఫి అని నిస్పందేహంగా చెప్పుకోవచ్చు. ఎంచుకొన్న కలర్ ప్యాలెట్ తెర మీద సినిమాను డిఫరెంట్‌గా మార్చేసింది. తెర నిండా మట్టివాసన, శ్రామికుల చెమటనును పరిమళంలా, గుబాళించేలా భువన్ గౌడ్‌ను తన ప్రతిభను చాటుకొన్నాడు. ఇక ఈ సినిమాకు ఎడిటింగ్ ఓ మ్యాజిక్. ఉజ్వల్ కులకర్ణి సన్నివేశాలను ఆడుకొన్న తీరు, పేర్చిన విధానం, బిల్డప్ కట్స్‌తో ఉత్కంఠ రేపాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్లను గ్రౌండ్ చేసిన విధానం కొత్తగా ఉంది. ఇక ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో అద్భుతం. ప్రతీ సీన్‌ను ఎలివేట్ కావడానికి, మరో లెవెల్‌కు వెళ్లడానికి బీజీఎం మరో లెవెల్ అనిపిస్తుంది. ఆర్ట్ విభాగం, వీఎఫ్ఎక్స్ సినిమాను టాప్ క్లాస్ మూవీగా మార్చేశాయి. తెలుగు డబ్బింగ్ టెక్నికల్ ఇచ్చిన అవుట్‌పుట్, తెలుగు వెర్షన్ కోసం మాటలు రాసిన హనుమాన్ చౌదరికి సక్సెస్‌లో ఫుల్ క్రెడిట్ ఇవ్వాల్సిందే.

ఇండియన్ సినిమాను మరో మెట్టు ఎక్కించేలా..
ప్రోడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. ఇక దర్శకుడి విజన్‌కు అనుగుణంగా రాజీలేని, ఖర్చుకు వెనుకాడని నిర్మాతగా విజయ్ కిరంగదూర్ నూటికి నూరు మార్కులు సంపాదించుకొన్నాడు. ఖర్చు పెట్టిన ప్రతీ పైసా స్క్రీన్ మీద ప్రతీ అంగుళం కనిపిస్తుంది. కన్నడ సినిమాకు ప్రైడ్‌గా ఇండియన్ సినిమాను మరొ మెట్టు ఎక్కించడానికి విజయ్ చేసిన ప్రయత్నం అభినందనీయం.

ఫైనల్ జడ్జిమెంట్
KGF చాప్టర్ సినిమా విషయానికి వస్తే.. యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, పవర్ ప్యాక్డ్ ఫెరాఫెర్మెన్స్, టేకింగ్, మేకింగ్ అన్ని ఉన్నత ప్రమాణాలతో కలబోసిన చిత్రంగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ సినిమా పంచభక్ష పరమాన్నం, విందు భోజనం అంటే ఆ మాట తక్కువే అవుతుంది. ఈ సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్ కాకుండా ఇండియన్ సినిమా లిఖించబోయే చరిత్రకు సాక్షిగా ప్రతీ ప్రేక్షకుడు మారిపోతాడంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. సినిమా చరిత్రలో ఓ తరానికి మలుపు తిప్పే ట్రెండ్ సెట్టర్ కేజీఎఫ్ చాప్టర్ 2. ఎంతో ఔత్సాహిక దర్శకులకు ప్రేరణగా, స్టార్ డైరెక్టర్లమనుకొనే వారికి మేకింగ్, టేకింగ్, విజన్ విషయంలో కనువిప్పు కలిగించే చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఏడాదికి వందల సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ KGF Chapter 2 అరుదైన సింగిల్ పీస్. సో లెట్స్ ఎంజాయ్ ది గ్రేట్ మూమెంట్స్ ఇన్ థియేటర్.


Click it and Unblock the Notifications











