Prema Katha Review డిఫరెంట్ లవ్ స్టోరి.. ప్రేమ కథ మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: కిషోర్ శాంతి దినకరన్, దియా సీతపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు తదితరులు
డైరెక్టర్: శివశక్తి రెడ్ డీ
నిర్మాతలు: విజయ్ మట్టపలి, సుశీల్ విజప్పిల్లి, సింగనమల కల్యాణ్
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్రాఫర్: వాసు పెండెం
ఎడిటర్: ఆలయం అనిల్
రిలీజ్ డేట్: 2024-01-05
మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రేమ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల ఫ్యామిలీ కోసం ఐరన్ మానుఫాక్చర్ కంపెనీలో ఉద్యోగిగా చేరుతాడు. ప్రేమ్‌కు తన స్నేహితుడు యాదవ్ (వినయ్ మహాదేవ్) కు సరోజా (నేత్రా సాధూ) ప్రేమలో ఉంటాడు. తన ఫ్రెండ్ కోసం వెళ్లడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన సరోజా ఫ్రెండ్ (దియా)తో పరిచయం ఏర్పడుతుంది. నిత్యం ఈ రెండు జంటలు ప్రేమలో మునిగి తేలుతుంటాయి.
ప్రేమ్ లవ్ స్టోరి ఎలా మొదలైంది? తనకు ప్రాణంగా ప్రేమించే అమ్మాయి కోసం అలాగే కష్టాల్లో ఉన్న ఫ్యామిలీ కోసం ప్రేమ్ ఎలా నలిగిపోయాడు? సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయితో లవ్‌లో పడిన ప్రేమ్‌కు యాదవ్, సరోజా నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది? యాదవ్, సరోజా లవ్‌కు ప్రేమ్ ఎలా అండగా నిలిచాడు? అయితే చివర్లో ప్రేమించిన అమ్మాయి నుంచి ప్రేమ్‌ను ఎందుకు దూరంగా ఉండమని యాదవ్ చెప్పాడు? చివరకు ప్రేమ్ తన ప్రేమను గెలిపించుకొన్నాడా? ప్రేమ్ ప్రేయసి ఇంటి నుంచి ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రేమ్ లవర్ తన ప్రేమ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమ కథ సినిమా స్టోరి.

ప్రేమ్‌కు సంబంధించిన ఓ ఎమోషనల్ సీన్‌తో కథ ప్రారంభమైనప్పటికీ.. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సాగే స్టోరీలో యాదవ్, సరోజా లవ్ స్టోరి, అలాగే ప్రేమ్ ప్రేమ కథ చాలా రొటీన్‌గా ప్రారంభం అవుతుంది. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో సాగే కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం, రెండు జంటల లవ్ స్టోరీలను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయమే తీసుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండాఫ్‌లో గానీ అసలు కథలో ప్రేక్షకుడిని తీసుకెళ్లడం వల్ల ఎమోషనల్‌గా కనెక్ట్ కావడానికి అవకాశం ఏర్పడింది. దర్శకుడు శివశక్తి చివరి 20 నిమిషాల్లో కథను నడిపించిన విధానం ప్రేక్షకులను ఓ కొత్త జోన్‌లోకి తీసుకెళ్లడమే కాకుండా మంచి అనుభూతిని పంచాడని చెప్పవచ్చు.
నటీనటులు విషయానికి వస్తే.. ప్రేమ్‌గా కిషోర్ శాంతి దినకరన్, గొప్పింటి అమ్మాయిగా దియా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కిషోర్, దియా చాలా సహజసిద్దంగా తన పాత్రలో లీనమై బిహేవ్ చేశారు. కొత్తవారైనప్పటికీ మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. అలాగే యాదవ్‌గా వినయ్, సరోజగా నేత్ర డిసెంట్‌గా నటించారు. తెలంగాణ యాసలో నేత్ర చెప్పిన డైలాగ్స్, నటించిన విధానం ఓ ఫీల్‌ను కలుగజేశాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఈ నలుగురు చేసిన ఫెర్ఫార్మెన్స్ ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అలాగే రాజ్ తీరందాజ్ కూడా సాఫ్ట్ విలనిజంతో ఆకట్టుకొన్నాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రేమ కథకు రధన్ మ్యూజిక్ టాప్ క్లాస్‌గా ఉంది. సన్నివేశాలను ఫీల్‌గుడ్‌గా మార్చడంలోను అలాగే సెకండాఫ్‌లో ఎమోషన్స్ ఎలివేట్ చేయడంలో బీజీఎం బాగా పనిచేసింది. పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్ వాసు పెండెం కెమెరాలో బంధించిన తీరు అతడి ప్రతిభకు అద్దం పట్టింది. ఆలయం అనిల్ ఎడిటర్‌గా కాస్తగా కఠినంగా వ్యవహరించాల్సిందనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కనీసం 20 నిమిషాలు కట్ చేయొచ్చు అనే ఫీలింగ్ కలిగింది. అలాగే సెకండాఫ్‌లో కొన్ని సీన్లు అనవసరం అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్రేమ కథ అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే ఎమోషనల్ బంధం. అయితే ఈ బంధానికి ఎలాంటి ఎమోషన్స్ జోడించి.. ముగింపు ఇస్తారనేదే సక్సెస్‌కు కారణం అవుతుంది. రెగ్యులర్ పాయింట్‌ను దర్శకుడు రాసుకొన్న విధానం, బ్యాక్ డ్రాప్ బాగుంది. కానీ బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో కొంత తడబాటుకు గురయ్యాడు. కానీ క్లైమాక్స్ డీల్ చేసిన విధానం అతడి టాలెంట్ ఏమిటో కనిపించింది. స్క్రిప్టుపై కొంత వర్క్ చేసి ఉంటే బాగుండేది. మంచి ప్రేమ కథగా సినిమా ఉండేదనిపిస్తుంది. నిదానంగా సాగే లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











