Premalu Review in Telugu యూత్ ఫుల్, ఫన్ అండ్ లవ్ స్టోరి.. ప్రేమలు సినిమా సమీక్ష
నటీనటులు: నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షమీర్ ఖాన్, శ్యామ్ మోహన్ ఎం తదితరులు
దర్శకత్వం: గిరీష్ ఏడీ
నిర్మాతలు: ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతతన్, శ్యామ్ పుష్కరణ్
స్క్రీన్ ప్లే: కిరణ్ జోసే
సంగీతం: విష్ణు విజయ్
సినిమాటోగ్రఫి: అజ్మల్ సాబు
డైలాగ్స్: ఆదిత్య హాసన్ (90's మిడిల్ క్లాస్ బయోపిక్)
ఎడిటింగ్: ఆకాష్ జోసెఫ్ వర్గీస్
డిస్ట్రిబ్యూషన్: ఎస్ఎస్ కార్తీకేయ
బ్యానర్: భావన స్టూడియోస్
రిలీజ్ డేట్: 2024-03-08
వన్ సైడ్ లవ్‌తో బ్రేకప్‌తో నిరాశలో ఉన్న సచిన్ (నస్లేన్ కే గఫూర్)కు వీసా రిజెక్ట్ కావడంతో యూకే వెళ్లాలనే ఆశ కూడా అడియాస అవుతుంది. తల్లిదండ్రుల మధ్య ఓ సమస్యతో సచిన్ నిరాశలో ఉంటాడు. ఆ సమయంలో గేట్ కోచింగ్ తీసుకోవాలనుకొంటున్న అమూల్ డేవిస్ (సంగీత్ ప్రతాప్) కలవడంతో ఇద్దరు కలిసి హైదరాబాద్‌కు చేరుకొంటారు. అమూల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన సమయంలో రీనూ (మమితా బైజూ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. అప్పటికే తాను పనిచేసే సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడర్ ఆది (శ్యామ్ మోహన్)తో రీనూ చాలా క్లోజ్‌గా ఉంటుంది. రీనూ, ఆది మధ్య స్నేహానికి మించి ఏదో బంధం ఉందని సచిన్ అనిపిస్తుంది.

హైదరాబాద్‌లో అమూల్ డేవిస్‌తో సచిన్ గేట్ కోచింగ్ ఎలా సాగింది? ఫ్రెండ్ పెళ్లి కోసం వెళ్లిన సచిన్, అమూల్‌కు ఎలాంటి పరిస్థితుల్లో రీనూ పరిచయమైంది. పెళ్లి నుంచి తిరుగు ప్రయాణంలో సచిన్, అమూల్ కారులో రీనూ, కార్తీక (అఖిలా భార్గవన్) ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? రీనూకు సచిన్ దగ్గరవుతున్నాడా? అనే అభద్రతాభావం ఆది ఎందుకు కలిగింది? రీనూ, ఆది, సచిన్ మధ్య ట్రయాంగిల్ లవ్ ప్రపోజల్ ఎలా సాగింది? చివరకు లవ్ ప్రపోజల్‌ను రీనూ తీరస్కరించడంతో సచిన్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఆదిని రీనూ పెళ్లి చేసుకొందా? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమలు సినిమా కథ.
కాలేజీలో సచిన్ ఫస్ట్ బ్రేకప్‌తో మూవీ ఎంత ఎమోషనల్‌గానే మొదలవుతుంది. సచిన్ ఇంట్లో ఫ్యామిలీ గొడవలు, యూకే వీసా రిజెక్షన్ లాంటివి వెంట వెంటనే జరిగిపోవడంతో స్టోరి హైదరాబాద్‌కు చేరుకొంటుంది. హైదరాబాద్‌లో రీనూ, ఆది గ్యాంగ్ ఓ పక్క.. మరో వైపు సచిన్, అమూల్ జంట మధ్య ఫన్, ఎమోషన్స్‌తో కూడా సన్నివేశాలతో పూర్తి వినోదాత్మకంగా సాగిపోతుంది. రీనూకు కార్తీక ద్వారా లవ్ ప్రపోజల్ చేసిన సచిన్‌కు నిరాశ కలిగే చిన్న సీన్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది.

ప్రేమలు సినిమా సెకండాఫ్‌కు ఫన్, సున్నితమైన హాస్యం, ఎమోషన్స్ బలంగా మారడంతో ప్రేక్షకుడు ఫుల్లుగా కనెక్ట్ అవుతాడు. సరదాగా సాగిపోయే సన్నివేశాలు, భావోద్వేగంతో కూడిన సీన్లకు 90's మిడిల్ క్లాస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ రాసిన డైలాగ్స్ భారీగా పేలాయి. దాంతో ఈ సినిమా మరో రేంజ్‌కు చేరుకొని రకరకాల ఎమోషన్స్‌తో సాగిపోతుంది. క్లైమాక్స్‌ను డీల్ చేసిన విధానం దర్శకుడు గిరీష్ ఏడీ ప్రతిభకు అద్దంపట్టిందనే చెప్పాలి.
సచిన్‌గా నెస్లెన్ కే గఫూర్ తన పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా పాత్ర కావాల్సిన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో అదరగొట్టేశాడు. నెస్టేన్ నటించాడనే కంటే.. పాత్ర తీరు తెన్నులను బట్టి సచిన్‌గా బిహేవ్ చేశాడనే ఫీలింగ్‌ను కల్పించాడు. ఇక రీనూ పాత్రలో మమితా బైజూ నటించిన విధానం సినిమా మొత్తానికే హైలెట్. సినిమా భారాన్నంత తనపైనే వేసుకొని మోసిందని చెప్పాలి. అందం, అభినయంతోనే కాకుండా ఎమోషనల్ సీన్లలో ఆమె నటన ప్రేక్షకులను ఎమోషన్‌కు గురిచేసేలా చేస్తుంది.
ఏదైనా భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను డబ్ చేస్తున్నారంటే.. పెద్ద ఎత్తున అంచనాలు ఉంటాయి. ప్రేమలు సినిమాను మలయాళ భాషలోనే దాదాపు మల్టీప్లెక్స్ ఆడియెన్స్ చూసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయాలంటే.. పక్కాగా తెలుగు నెటివిటీని భాష పరంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సినిమాను మాతృక నుంచి డబ్బింగ్ చేసిన విధానం, రాసిన డైలాగ్స్ అన్నీ పక్కాగా కుదిరడంతో తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక విష్ణు విజయ్ సంగీతం తెలుగు నేటివిటికి దూరంగా ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

తెలుగు ప్రేక్షకులకు హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుందా? అనే విధంగా సినిమాను అజ్మల్ సబు అద్బుతంగా చిత్రీకరించాడు. కొన్ని సీన్లు సాగదీసినట్టు ఉంటాయి. అలాంటి వాటిపై కొంత కత్తెర వేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ రూపొందించిన ఈ సినిమా నిర్మాణ విలువలు హై స్టాండర్ట్స్‌లో ఉన్నాయి.
ప్రేమలు మూవీ కేవలం యూత్‌కు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడానికి కావాల్సినన్నీ అంశాలు ఉన్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ముఖంపై చిరునవ్వు.. మంచి సినిమా చూశామనే ఫీల్ గుడ్ అనుభవంతో వస్తారు. ఎన్ని అంచనాలు పెట్టుకొని వెళ్లినా ప్రేక్షకుడిని సంతృప్తికి గురి చేసే కథ, కథనాలు ఈ సినిమాకు హైలెట్. మీరు చూడండి.. మనసు తేలికపడిన ఫీలింగ్‌తో డెఫినెట్‌గా బయటకు వస్తారు.
ట్యాగ్ లైన్: ప్రేమలు .. మస్ట్ వాచ్ ఫిలిం


Click it and Unblock the Notifications











