twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త సీసాలో పాత సారా

    By Staff
    |

    Premathora
    -జలపతి గూడెల్ల
    చిత్రం: ప్రేమతో...రా!
    నటీనటులు: వెంకటేష్‌, సిమ్రాన్‌, ఇషాగోపికర్‌, సురేష్‌, ప్రేమ,
    ఆషాషైనీ, మింకీసింగ్‌, కోటశ్రీనివాసరావు, అలీ.
    సినిమాటోగ్రఫీ: ఎస్‌.గోపాల్‌ రెడ్డి
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: టి. త్రివిక్రమరావు
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఉదయ్‌ శంకర్‌

    ప్రేమతో..రా అన్నారు కదా అని వెళ్ళితే నిరాశతో వెనుదిరిగిరావాల్సి ఉంటుంది. పాత చింతకాయ పచ్చడిని మళ్ళీ మళ్ళీ నూరి తీసిన సినిమా ఇది. ఏ మాత్రం కొత్తదనం లేని కథ, కథనం. భూపతిరాజా తన 'సెంటిమెంటల్‌ ' పట్టును మరోసారి నిరూపించుకున్నాడు. హీరో 'మంచి తనాన్ని' ఎలివేట్‌ చేసే కథలను రూపొందించడంలో దిట్టైన భూపతిరాజా ఈసారి పాతసినిమాలను అన్నింటిని కలిపి ఒక దగ్గర చేర్చి కథను రూపొందించాడు. వెంకటేష్‌ కు ఏమాత్రం సూట్‌ కాని పాత్ర ఇది. ప్రేక్షకులకు బోర్‌ కొట్టించే సినిమా. స్క్రీన్‌ ప్లేలో సృజనాత్మకత నిల్‌. దర్శకుడు ఉదయ్‌ శంకర్‌ కొత్త సీసాలో పాత సారా పోసేందుకు చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు.

    చందమామతో దోస్తీ కట్టి..వందభామలతో నేస్తం చేసే వెంకటేష్‌ గోపాలకృష్ణుడు. ప్రేమ మీద నమ్మకం లేని వెంకటేష్‌ కు సెక్స్‌ మినహా మరే సంబంధం తెలియదు. అలాంటి వెంకీకి సిమ్రాన్‌ చూడగానే నచ్చుతుంది. పవిత్రంగా ఉండే సిమ్రాన్‌ ను కూడా వెంకీ ఎలాగోలా నమ్మించి అపవిత్రం చేస్తాడు. సిమ్రాన్‌ అది ప్రేమనుకుంటుంది. వెంకీ అన్న సురేష్‌ ప్రేమను ప్రేమిస్తాడు. ప్రేమ చెల్లెలు సిమ్రాన్‌. సిమ్రాన్‌ కు జరిగిన అన్యాయం తెలుసుకొని సురేష్‌ తో పెళ్ళికి నిరాకరిస్తుంది ప్రేమ. దాంతో సురేష్‌, ప్రేమలను కలిపేందుకు వెంకీ మారేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు నిజంగానే సిమ్రాన్‌ ను ప్రేమిస్తాడు. వెంకీ, సిమ్రాన్‌ లు మళ్ళీ ఎలా కలుస్తారనేది క్లైమాక్స్‌.

    ఇలాంటి చప్పటి కథకు ఆరేడు పాటలు జోడించి రూపొందించాడు దర్శకుడు ఉదయ్‌ శంకర్‌. ఒక పాట ఆ తర్వాత కొన్ని స్టుపిడ్‌ సీన్స్‌...మళ్ళీ పాట.... మధ్యలో కొద్దిగా నవ్వులు. నవ్వలేక నవ్వే కామెడీ సీన్స్‌. చందు పాత్ర వెంకటేష్‌ కు ఏ మాత్రం సరిపోలేదు. వెంకీ ఈ సినిమాలో మరీ ముదిరిపోయిన( ఐ మీన్‌ వయసుపైబడ్డ) యాక్టర్‌ గా కనిపించాడు. ముఖంలో గ్లామర్‌ లేదు. అనాసక్తతే ఫేస్‌ లో కనిపించింది. సిమ్రాన్‌ నటన మాత్రం బావుంది. మిగతా వారి నటన గురించి చెప్పుకోవాల్సినంత సీన్‌ లేదు. సారీ వారికి అంత సీన్స్‌ లేవు.

    ఇషాగోపికర్‌, ఆషా సైనీ, మింకీ సింగ్‌ వీరంతా రెండు పాటలకు, మరికొన్ని సంబంధంలేని సీన్స్‌ కు మాత్రమే పరిమితం. ఈ చిత్రంలో విలన్స్‌ ఎవరూ లేరు. స్కీన్‌ ప్లే రచయిత ఉదయ్‌ శంకర్‌, కథ అందించిన భూపతి రాజాయే నిజమైన విలన్స్‌. ప్రేమతో ....రా చిత్రానికి పరమార్థం ఏమిటో! ప్రేమ కథ అసలే కాదు. మణిశర్మ సంగీతం ఫర్వాలేదు. చందమామతో దోస్తీ కడుతా... పున్నమిలా వచ్చింది ప్రేమా...అనే రెండు పాటలు మాత్రమే వినడానికి బాగున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X