Mrs Undercover Review: భార్య సీక్రెట్ ఏజెంట్ అయితే? మెప్పించేలా రాధిక నటన!
టైటిల్: మిసెస్ అండర్ కవర్ (హిందీ)
నటీనటులు: రాధిక ఆప్టే, సుమిత్ వ్యాస్, రాజేష్ శర్మ, సాహేబ్ ఛటర్జీ, అంగనా రాయ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: అభిమన్యు సేన్ గుప్తా
సంగీతం: అమిత్ సావంత్, అంకిత్ షా, అభినవ్ శేఖర్
నిర్మాతలు: అనుశ్రీ మెహతా, వరుణ్ బజాజ్, ఉత్కర్ష దిఘే, ఇషాన్ సక్సేనా, అభిర్ సేన్ గుప్తా, సునీల్ షా
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అనుశ్రీ మెహతా, అభిర్ సేన్ గుప్తా
దర్శకత్వం: అనుశ్రీ మెహతా
ఓటీటీ విడుదల తేది: ఏప్రిల్ 14, 2023
ఓటీటీ వేదిక: జీ5
బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధిక ఆప్టే గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటి బాలకృష్ణ లెజెండ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. హిందీలోనే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ అలరిస్తుంటుంది. అంతేకాకుండా కంటెంట్ ఉంటే బోల్డ్ పాత్రలు, టాప్ లెస్ సన్నివేశాల్లో కూడా నటించేందుకు ఏమాంత్రం వెనుకాడదు ఈ హాట్ బ్యూటి. కాన్సెప్ట్ ఉండే కథలను ఎంచుకునే ఈ భామ కొంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా 'మిసెస్ అండర్ కవర్'. ఏప్రిల్ 14న నేరుగా జీ5 ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:కోల్ కతా సిటీలో కామన్ మ్యాన్ పేరుతో మహిళలను హత్య చేస్తూ వాటిని రికార్డ్ చేసి వైరల్ చేస్తుంటాడు ఓ సీరియల్ కిల్లర్ (సుమిత్ వ్యాస్). సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏజెంట్లను కూడా అతను చంపుతుంటాడు. చివరి ఏజెంట్ ను సీరియల్ కిల్లర్ మర్డర్ చేసే వీడియో కల్లోలం సృష్టిస్తుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు కొత్త ఏజెంట్ కోసం వెతుకుంటాడు స్పెషల్ ఫోర్స్ చీఫ్ రంగీలా (రాజేష్ శర్మ). ఈ క్రమంలోనే అతనికి ఓ ఇంట్లో గృహిణిగా ఉంటున్న దుర్గా (రాధిక ఆప్టే) అండర్ కవర్ ఏజెంట్ అని రంగీలాకు తెలుస్తుంది.
ఒకరికి భార్యగా:దుర్గా అండర్ కవర్ ఏజెంట్ అని తెలుసుకున్న రంగీలా సీరియల్ కిల్లర్ ఎవరో ఇన్వేస్టిగేట్ చేయాలని కోరుతాడు. కానీ దుర్గా అందుకు ఒప్పుకోదు. అసలు దుర్గా సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు ఎందుకు ఒప్పుకోదు? పదేళ్లుగా ఎలాంటి మిషన్ లేకుండా దుర్గా ఒకరికి భార్యాగా ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? వుమెన్ ఎంపవర్ మెంట్ కోసం ప్రయత్నించే మహిళలనే కామన్ మ్యాన్ ఎందుకు చంపుతున్నాడు? అతను ఏం ప్లాన్ చేశాడు? మరి అతని ప్లాన్ ను దుర్గా అండ్ టీమ్ చేధించిందా? వంటి తదితర సన్నివేశాలతో తెరకెక్కిన సినిమానే 'మిసెస్ అండర్ కవర్'.

విశ్లేషణ:'మిసెస్ అండర్ కవర్' ఒక కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్, రైటర్ అయిన అనుశ్రీ మెహతా దర్శకత్వం వహించారు. ఆమె డైరెక్టర్ గా డెబ్యూ చిత్రం ఇది. సినిమా టైటిల్ లో చెప్పినట్లుగా ఒక గృహిణి అండర్ కవర్ అయితే ఎలా ఉంటుందో చూపించారు. ఓవైపు ఇల్లాలిగా తన పనులు అన్ని చేసుకుంటా భర్త, అత్త మామలకు తెలియకుండా సీక్రెట్ గా ఎలా ఇన్వెస్టిగేషన్ చేసిందో క్రైమ్ కు కామెడీని జోడించి చూపించారు. ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు కామెడీతో చెప్పించడం సాహసమనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది కానీ, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి.
భార్య గొప్పతనం చెబుతూ..:సినిమా ప్రారంభంలో మర్డర్ సీన్ తో సినిమాపై మంచి ఇంటెన్స్ క్రియేట్ చేశారు దర్శకురాలు అనుశ్రీ మెహతా. కానీ తర్వాత వచ్చే సన్నివేశాలు కామెడీ పరంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇందులో ఎక్కువగా ఒక ఇల్లాలు పోషించే పాత్ర గొప్పతనం గురించి చెప్పాలనుకున్నారు. 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' వంటి సినిమాతో ఒగ గృహిణి పాత్ర ఎలాంటిదో చాలా చక్కగా చూపించారు. ఈ 'మిసెస్ అండర్ కవర్' సినిమాలో భార్య గొప్పతనం చెబుతూనే దానికి క్రైమ్, సీరియల్ కిల్లర్ అంశాలను అద్దారని తెలుస్తోంది. ఈ అంశాన్ని తెరపై అంతగా ఆవిష్కరించలేదనే చెప్పాలి.

వివరంగా చెప్పని అంశాలు:భార్యకు భర్త ఎలా సపోర్ట్ చేయాలనే విషయాన్ని కొడుకుతో తల్లి వెటకారంగా చెప్పే సీన్, హోటల్ లో తన భార్య జస్ట్ హౌజ్ వైఫ్ అని వెయిటర్ తో భర్త అంటే.. అప్పుడు ఆ వెయిటర్ ఇచ్చే సమాధానం ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ తదితర సన్నివేశాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. కొన్ని విషయాలు వివరంగా చెప్పకుండా అంసపూర్ణంగా వదిలేశారు. వుమెన్ ఎంపవర్ మెంట్ కోసం ప్రయత్నించే మహిళలనే సీరియల్ కిల్లర్ ఎందుకు టార్గెట్ చేశాడు వంటి తదితర విషయాలు ఉన్నాయి. కానీ వాటిని చర్చిస్తే స్టోరీ స్పాయిలర్ అవుతుంది. అయితే దీనికి సీక్వెల్ వస్తున్నట్లుగా హింట్ ఇచ్చారు. బహుశా అందులోనైనా చెబుతారో చూడాలి.
ఎవరెలా చేశారంటే..:ఇల్లాలుగా, అండర్ కవర్ ఏజెంట్ గా రాధిక ఆప్టే చాలా బాగా చేసింది. ముఖ్యంగా ఆమె ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీతో హాస్యం పండించింది. ఓవైపు భయపడే గృహిణిగా, జేమ్స్ బాండ్ లా సీక్రెట్ ఏజెంట్ అవ్వాలని కలలు కనే మహిళగా తను ఒదిగిపోయింది. సీరియల్ కిల్లర్ పాత్రలో సుమిత్ వ్యాస్ మెప్పించాడు. ఇక చీఫ్ రంగీలాగా రాజేష్ శర్మ నటన, కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రాధిక ఆప్టే, రాజేష్ శర్మ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. క్రైమ్ సన్నివేశాల్లో ఇమిడిపోయేలా బీజీఎమ్ తదితర సాంకేతిక అంశాలు అన్నీ ఓకే.
ఫైనల్ గా చెప్పాలంటే..:ఎలాంటి అడల్ట్ కంటెంట్, బీభత్సమైన వయెలన్స్ (మొదటి మర్డర్ సీన్ మినహా), రక్తపాతం వంటివి ఏం లేకుండా ఉన్న 'మిసెస్ అండర్ కవర్' కుటుంబ సమేతంగా చూసే చిత్రమిది. థ్రిల్లింగ్ అంశాల కంటే కామెడీ ఆకట్టుకుంటుంది. హిందీ వచ్చిన వాళ్లు లేదా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మ్యానేజ్ చేస్తాం అనుకునేవాళ్లు ఫ్రీ టైమ్ లో చూడోచ్చు.


Click it and Unblock the Notifications











