For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాత చింతకాయ పచ్చడి 'రాఘవయ్యగారి అబ్బాయి'

  By Staff
  |

  -సౌమిత్‌

  చిన్న చిత్రాల నిర్మాణం గగనంగా మారిన నేపథ్యంలో ఎంతో సీనియర్‌ నిర్మాత అయివుండి, మారిన కాలాన్ని పట్టి సినిమా తీయలేక, చూద్దాంలే అన్నట్టు చిత్ర నిర్మాణాన్ని చేపట్టిన నిర్మాత పుండరీకాక్షయ్య తాజాగా నిర్మించిన చిత్రమే 'రాఘవయ్యగారి అబ్బాయి'.

  నిర్మాతగా మిన్నకుండిన కాలంలో కర్తవ్యం చిత్రంలో విలన్‌గా నటించి నటుడిగా మారారాయన. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో కన్పించినప్పటికీ బిజీనటుడు కాలేకపోయారు. ఓ సారి ముఖానికి రంగు వేసుకున్న తరువాత నటుడికి ఆ తపన జీవితాంతం వదలదన్న అక్షర సత్యాన్ని నిజం చేయడానికన్నట్టు తను టైటిల్‌ రోల్‌ ధరించి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ఉంది తప్ప వ్యాపారపరంగా పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా అన్న ఆలోచన లేనట్టుంది. అగ్రహీరోలు నటించిన చిత్రాలకే ఓపెనింగ్స్‌ లేక వెల వెల పోతుంటే శ్రీహర్ష అనే కుర్రాడితో తను ప్రధాన పాత్రగా చిత్రం తీయడం హాస్యాస్పదం అనిపిస్తుంది. ఇది వారిని కించపరచడం కాదు. వర్తమాన పరిస్థితుల పట్ల వాళ్ళ అవగాహనను ప్రశ్నించడమే. అన్ని దానాల్లోకి అక్షర దానమే గొప్పదనే పాయింటుతో ఈ చిత్రం రూపొందింది. అయితే ఇమేజ్‌ ఉన్న ఆర్టిస్టులుంటే అయితే కొంత వరకు ప్రయోజనం ఉండేదేమో.

  ఈనెల 16న విడుదలైన ఈ చిత్రం కథ విషయానికి వస్తే పోతుగడ్డ గ్రామానికి రారాజైన యుద్దం వీరభద్రం (శ్రీహరి) అంటే ఆ చుట్టు పక్కల గ్రామాల వారందరికీ హడల్‌. తమ కుటుంబంలోని వారు తప్ప ఆ చుట్టుపక్కల గ్రామంలోని వారెవ్వరూ చదువు కోకూడదని భావించే వీరభద్రం ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తన పశువుల శాలగా మారుస్తాడు. దాంతో ఆ గ్రామానికి ఉపాధ్యాయులుగా రావడానికి అందరూ భయపడుతుంటారు. ధైర్యంగా ముందుకు వచ్చిన రాఘవయ్య మాస్టారు కూతుర్ని చంపడంతో, కొడుకు సాయంతో నాటకం ఆడిన మాస్టారు గ్రామస్తుల్లో పరివర్తన తెప్పించి, వీరభద్రాన్ని అంతమొందించి, పాఠశాలను పునరుద్ధరించడంతో చిత్రం ముగుస్తుంది. వీరభద్రం కూతురు రాఘవయ్యగారి అబ్బాయిని ప్రేమించడం, రాఘవయ్యగారి అబ్బాయి అనుకుంటున్న శ్రీహర్ష వీరభద్రం నమ్మిన బంటైన సత్యప్రకాష్‌ కొడుకు కావడం, చదువు కోసం పుట్టిన బిడ్డను సత్యప్రకాష్‌ తల్లి జయంతి పురిటిలోనే రాఘవయ్య మాస్టారి వద్ద వదిలి వెళ్లడం వంటి కొన్ని ట్విస్ట్‌లు ఈ చిత్రంలో ఉన్నాయి.

  అక్షరాస్యత శూన్యంగా ఉన్న రోజుల్లో తీయాల్సిన చిత్రమిది. నట్టడవుల్లో వున్న గ్రామాల్లో కూడా అంతో ఇంతో అక్షరాస్యత ఉన్న ఈ రోజుల్లో ఈ తరహా చిత్రాలను ఆదరిస్తారనుకోవడం ఓ భ్రమ. సినిమాకు వచ్చే ప్రేక్షకులు చక్కని కాలక్షేపాన్ని ఆశిస్తారే తప్ప 'అక్షరదానం' గొప్పది అంటూ చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాల్ని వినేంత ఒపిక చూపించరు. చిత్రంలో చెప్పుకోవాల్సింది ఏవైనాఉంటే అది కీరవాణి అందించిన మెలోడీ సంగీతమే. అయితే హీరో హీరోయిన్స్‌ మైనస్‌ కావడంతో అవి అంతగా రిజిస్టర్‌ అవ్వవు. దర్శకుడిగా పేరాల గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. కథ పాతదే అయినప్పటికీ కథనం విషయంలో కూడా సరైన జాగ్రత్త వహించలేక పోయాడాయన. ఏతావాతా సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఉస్సూరుమని నిట్టూరుస్తూ వస్తాడు తప్ప ఆనందం మచ్చుకైనా కనిపించదు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X