twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాత పచ్చడి 'రాజాబాబు'

    By Staff
    |

    Rajababu
    చిత్రం: రాజాబాబు
    విడుదల తేదీ: 24-02-2006
    నిర్మాత: పరుచూరి శివరామ ప్రసాద్‌
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముప్పులనేని శివ
    సంగీతం: ఎస్‌. ఎ. రాజకుమార్‌
    మాటలు: వేగీశ్న సతీష్‌
    నటీనటులు: రాజశేఖర్‌, శ్రీదేవిక, సుధ, రియాజ్‌ ఖాన్‌, శివారెడ్డి,
    విజయకుమార్‌, శారద, బ్రహ్మానందం, కోవై సరళ, కృష్ణ భగ్వాన్‌,
    కొండవలస లక్ష్మణరావు, సుదర్శనం తదితరులు

    రిమేక్‌లే మేలని నమ్మే రాజశేఖర్‌ ముప్పలనేని శివ మరో మారు మలయాళీ హిట్‌ 'జావటన'ను రాజాబాబుగా తెరకెక్కించారు. కథ మరీ అంతస్థులు సినిమా మ్యాటర్‌ కావడం, టేకింగ్‌ దానికి తగ్గట్టే టీవీ సీరియల్‌లా సాగడం ప్రేక్షకులకు పారిపోయే స్థితిని కల్పిస్తుంది.

    అనగనగా చంద్రగిరి గ్రామం. అక్కడ అందర్నీ ఆపదలో ఆదుకుంటూ దేవుడిలా కొలవబడే రాజాబాబు (రాజశేఖర్‌) నివాసం. తండ్రి దశరథ రామయ్య (విజయకుమార్‌), తల్లి (శారద), తమ్ముడు (శివారెడ్డి), చెల్లెలతో చల్లగా కాపురం చేస్తుంటాడు. ఆ ఊళ్లో ఉన్న కో ఆపరేటివ్‌ ఆఫీసులో రుణాల రికవరీ ఆఫీసరుగా పని చేసే రాజాబాబుని అంజలి (శ్రీదేవిక) అనే అమ్మాయి ప్రేమించి పెళ్లాడేస్తుంది. కథ ఇలా కాలక్రమేణా బబుల్‌ గమ్‌లా సాగుతుంటే ఓ రోజు తండ్రి హార్ట్‌ అటాక్‌తో చనిపోతూ బాంబు లాంటి ఓ నిజాన్ని కక్కుతాడు. అది ఆయనకు ఈ కాపురమే కాక మరో ఇద్దరు కూతుర్లు ఉన్న రెండో భార్య ఉందనేది. అంతేగాక వాళ్ల బాధ్యత తీసుకోమని కుటుంబ పరువు ప్రతిష్టల దృష్ట్యా ఎవరికీ ఈ విషయం చెప్పవద్దని కొడుకును అభ్యర్థిస్తాడు. ఇక అక్కడి నుంచి రాజాబాబు ఆ రెండో కుటుంబం సేవలు, అప్పులు చేస్తుంటాడు. ఇది ఇంట్లోవారికి తెలియక అపార్థం చేసుకుంటారు. విషయం చెప్పలేక కుమిలిపోయే అతని సమస్యకు ఎలా పరిష్కారం లభిస్తుందనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే.

    సెంటిమెంట్‌తో సీరియస్‌గా సంవత్సరాల తరబడి నడిచే సీరియల్స్‌లా సినిమా తీస్తే డబ్బులిచ్చి థియేటర్‌కి రావడం మరీ కష్టం. గతంలో అక్కినేని నటించిన అంతస్థులు సినిమాకే పక్కా కాపీ అయిన దీనికి రీమేక్‌ రైట్స్‌ ఎందుకు కొన్నారో అర్థం కాదు. ఆ చిత్రం కథలో హీరో తండ్రి జమీందారు. ఆయనకు పరువు ఎంత అవసరమో ఎంతగా విలువ ఇస్తాడో స్పష్టంగా ఎస్టాబ్లిష్‌ చేసి కథలోకి వస్తాడు. అదే దీనిలో కొరవడింది. మరోవైపు నేటి సమాజంలో ఈ సమస్య అంత సీరియస్‌ విషయం కాకపోవచ్చు.

    ఫస్టాఫ్‌ అంతా స్టోరీ సెటప్‌కే తీసుకోవడంతో ఇంటర్వెల్‌ వద్ద సమస్య ముందుకు వచ్చి కథ ప్రారంభమవుతుంది. దాంతో సగం సినిమా పూర్తిగా బోర్‌. పోనీ సెకండాఫ్‌లోనైనా సీరియస్‌గా నడక సాగిస్తుందా అంటే పాత్రల మధ్య సంఘర్షణ లేక చల్లబడిపోతుంది. ఇది పూర్తిగా స్క్రీన్‌ప్లే లోపమే. అంతస్థుల్లో తండ్రి రెండో భార్య కూతురు (భానుమతి) తన ఆ ఇంటికి సంబంధించినదాన్నేనని నిరూపించుకుంటానని శపథం చేసి హీరోకు సవాలుగా మారుతుంది. దాంతో మెలోడ్రామా పెరిగి ఆసక్తిగా కథ నడుస్తుంది. ఇక దర్శకత్వ పరంగా యువదర్శకులు అద్భుతాలు చేస్తుంటే దానికి విరుద్ధంగా అతి సామాన్యమైన టేకింగ్‌తో సినిమా తీశారు. కామెడీకి వాడుకున్న చంద్రముఖి ట్రాక్‌ పండినా ఇప్పటికే చాలా సినిమాల్లో పేరడీగా రావడం సినిమాకు కలసి రాలేదు. సంగీతం రాజకుమార్‌ గత చిత్రాలను గుర్తుకు తెస్తూ సాగింది. రాజాబాబు టైటిల్‌ సాంగ్‌ 'జాణా జాణా నువ్వెంత కిలాడివో' మెలోడీగా బాగుంది. మాటలు కామెడీగా కొన్ని చోట్ల బాగా పండాయి. ఎడిటింగ్‌, రీరికార్డింగ్‌ గురించి చెప్పవలసిందేమీ లేదు. నటుల్లో శారద రీ ఎంట్రీ సంతోషమే అయినా పాత్ర పెద్దది కాకపోవడం వెలితే.

    ఏదేమైనా మహిళలను ఉద్దేశించి తీసినట్లున్న ఈ చిత్రం వారినైనా సీరియల్స్‌ నుంచి థియేటర్‌ వైపు నడిపిస్తుందా అంటే సందేహమే.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X