విజువల్ ట్రీటే కానీ...('ఈగ'రివ్యూ)
---సూర్య ప్రకాష్ జోస్యుల
సంస్థ: వారాహి చలనచిత్రం
నటీనటులు: నాని, సమంత, సుదీప్, ఆదిత్య మీనన్, దేవదర్శిని, నోయల్, హంసానందిని తదితరులు.
స్టోరీ ఐడియా: విజియోంద్రప్రసాద్
డైలాగ్స్ : జనార్దన మహర్షి
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సమర్పణ: డి.సురేష్‌బాబు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: సాయి కొర్రపాటి
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
విడుదల: శుక్రవారం.
సమర్పణ: డి.సురేష్‌బాబు.
ప్రారంభం రోజే కథ చెప్పేయటం, రిలీజ్ కు ముందే ట్రైలర్స్ లో ఆ కథను ఎట్లా తెరకెక్కించనున్నారో హింట్స్ ఇస్తూ చూపటంతో 'ఈగ'పై అంచనాలు భారీగా మొదలయ్యాయి. రెగ్యులర్ గా అన్ని చిత్రాల తరహాలో చిత్రం కథ ఏమిటి..ఎలా ఉండబోతోంది అనేదాని కన్నా ఎలా కేవలం గ్రాఫిక్స్ 'ఈగ'ను హీరోగా చూపుతూ రెండు గంటలు సేపు ఆ పాయింట్ ని ప్రేక్షకుడుకు నచ్చేలా రాజమౌళి చెప్పి ఒప్పిస్తాడు అనే కోణంలో ఇంట్రెస్టు పెరిగింది. అయితే రాజమౌళి కూడా దాని మీదే దృష్టి పెట్టారు. టెక్నికల్ గా సౌండ్ గా ఉండేలా చూసుకున్నారే కానీ, కథ, కథనాలలపై అంతగా దృష్టి పెట్టలేదు. దాంతో ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ ప్లాట్ గా మారిపోయింది.
మొదటి నుంచీ తెలుసిన కథనే మళ్లీ చెప్పుకుంటే...సరదా కుర్రాడైన నాని (నాని)ఎదురింటి అమ్మాయి బిందు (సమంత)ని ప్రేమిస్తాడు. అతని ప్రేమను ఆమె అంగీకరిస్తుందనే సమయానికి రావణాసుడులా సుదీప్ (సుదీప్)ఆమెపై కన్నేసి అడ్డుపడతాడు. అంతేగాక ఆమెను దక్కించుకోవటం కోసం నానిని దారుణంగా హత్య చేస్తాడు. అయితే కథ అక్కడితో అయిపోదు.. మగధీరలా నాని.. మరుజన్మ ఎత్తుతాడు. అయితే ఈ సారి ఈగ గా జన్మిస్తాడు. గతజన్మ స్మృతులతో తన ప్రేయసిని కాపాడుకునేందుకు సుదీప్ పై ఎడతెగని యుద్దం ప్రకటిస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఎలా బలవంతుడైన సుదీప్ నుంచి అతి సాధారణమైన ఈగ అయిన తాను .. తన ప్రేయసిని తప్పించాడు అనేది మిగతా కథ.
ట్రీట్ మెంట్ లో Mousehunt (1997), ధీమ్ లో Ghost (1990) చిత్రాలని గుర్తు చేసే ఈ చిత్రం అత్యంత చిన్న ప్రాణి అయిన ఈగ .. అతి బలవంతుడైన మనిషిని ఎలా మట్టికరిపిస్తుంది..అదీ తన ప్రేమకోసం.. అనేది సింగిల్ లైన్ లో వినడానికి చాలా ఆసక్తిని రేపే అంశం. అయితే ఈ కథ పూర్తిగా ట్రీట్ మెంట్ మీద ఆధారపడిచేయాల్సిందే. మంచి సీన్స్ పడితేనే కథనం పండి సినిమా గట్టెక్కుతుంది. ఆ దిశగా రాజమౌళి టీమ్ బాగానే కసరత్తు చేసింది. అయితే ఈ క్రమంలో సీన్స్ రిపీట్ అవుతూండటం పట్టించుకోలేదు. ఫస్టాఫ్ లో ఏ విధంగా ఈగ ..సుదీప్ ని ఇబ్బంది పెడుతుందో సెకండాఫ్ లోనూ కొంచెం అటూ ఇటూగా అదే క్రమంలో అడ్డు పడుతూంటుంది.
అలాగే సుదీప్ పాత్ర పూర్తిగా ఈగ నుంచి తన ఆత్మరక్షణ మాత్రమే చేసుకోగలుగుతాడే కానీ ఈగ ని ఏమీ చేయలేని నిస్సహాయ స్ధితిలో ఉంటాడు. దాంతో పూర్తిగా ఏక పక్షంగా ఈగ .. నడిపించిన కథగా మారింది. ఈగ గెలుస్తూ పోతూంటుంది కానీ ఎక్కడా ఈగకు అడ్డు అనేది ఉండక కాప్లిక్ట్ పుట్టదు. దాంతో సెకండాఫ్ లాగుతున్న ఫీల్ వస్తుంది. కథలో డైనమిక్స్ ని పట్టించుకుని, ఫస్టాఫ్ కి సెకండాఫ్ కి వేరియేషన్ చూపించగలగితే ఇంకా బావుండేది.
అలాగే సెకండాఫ్ లో ఈగ వెళ్లి తన ప్రేయసి సమంతకి అసలు విషయం వివరించి చెప్పుతుంది. అప్పుడు సమంత లీడ్ తీసుకుని కథ నడిపించాలి. ఎందుకంటే అతి చిన్న ఈగే తన ప్రయత్నం చేస్తోంది కదా. అలాంటిది తన కోసం మరణించిన తన ప్రియుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న ఆమె విలన్ ని ఇరికించే ప్రయత్నం కానీ చట్టానికి పట్టించే ప్రయత్నం కానీ చెయ్యకుండా ఈగపైనే పూర్తిగానే ఆధారపడటం కథన లోపమే అనిపించుకుంటుంది. ఇక ఈగని చంపటానికి విలన్ సుదీప్.. మాత్రికుడిని ఆశ్రయించే సీన్స్ కథలో కలవకుండా మారి సహన పరీక్ష పెట్టాయి.
అంత మాత్రికుడూ.. తన మంత్ర శక్తితో ఏ చేతబడో చేసినట్లుగా ఈగను పట్టి రప్పించుకోకుండా చంపటానికి రెండు పక్షులను పంపంటం విచిత్రమనిపిస్తుంది. ఈగ జిమ్ చేయటం, సూది మోయటం వంటి విషయాలు అయితే పిల్లల కోసం తీసారనుకుని సరిపెట్టుకోవాలి. సినిమా ప్రారంభంలో ఓ చిన్న పిల్లకు ఈ 'ఈగ' కథను నేరేట్ చేస్తున్నట్లు చెప్తారు. కాని పిల్లలకు ఇలాంటి ఓ వ్యక్తి కాముకతను గురించి, హింసను జోడించి చెప్పే కథలు చెప్తారా అనేది సందేహం.
నటీనటులు విషయానికి వస్తే నాని, సుదీప్ బాగా చేసారు. సమంత ఎప్పటిలాగే తన అందంతో కొట్టుకొచ్చేసింది. తాగుబోతు రమేష్ ఉన్నది ఒక్కసీనే గానీ బాగా చేసాడు. టెక్నికల్ గా ఈగ ని తెరపై చూపటం తెలుగులో రాజమౌళి చేసిన అరుదైన ఫీట్ అని చెప్పాలి. కీరవాణి పాటల్లో ఫస్టా సాంగ్, టైటిల్ సాంగ్ బాగున్నాయి. కెమెరా, ఎడిటింగ్ రెగ్యులర్ రాజమౌళి చిత్రాలలలో లాగానే బాగున్నాయి. దర్శకత్వం గురించి రాజమౌళికి వంక పెట్టేదేమీ లేదు కానీ కథనం మరింత బాగా చేసుకుని ఉంటే బావుండేది.
డైలాగులు పెద్దగా పంచ్ లు, ప్రాసలు కోసం పాకులాడకుండా నీట్ గా జనార్దన మహర్షి రాసి మెప్పించారు. హైలెట్స్ లో సమంత, నానిల మధ్య రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. అలాగే మొదటిసారి ఈగ వచ్చి సుదీప్ ని ఇబ్బంది పెట్టడం బాగా నవ్వించింది.
ఏదైమైనా 'ఈగ' ఎక్సపెక్టేషన్స్ కి తగినట్లు లేదనే చెప్పాలి. అయినా కొత్త తరహా ప్రయత్నం, ప్రయోగం కాబట్టి ఒకసారి చూసి రాజమౌళి ని అభినందవచ్చు. హీరో లేకుండా కూడా సినిమాలు చేయవచ్చు అనే ఆయన ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి జోహార్లు అర్పించవచ్చు. ఇక పిల్లలను టార్గెట్ చేసిన ఈ సినిమా వారు ఎంజాయ్ చేసి చూస్తేనే రేంజి పెరుగుతుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











