Ramam Raghavam Review: రామం రాఘవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: సముద్రఖని, హరీష్ ఉత్తమన్, ధన్ రాజ్, సత్య, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ రాజ్, ప్రమోదిని తదితరులు
దర్శకత్వం: ధన్ రాజ్ కొరనాని
నిర్మాత: పృథ్వీ పోలవరపు
మ్యూజిక్: అరుణ్ చిలువేరు
కథ: శివ ప్రసాద్ యానాల
సినిమాటోగ్రఫి: దుర్గా ప్రసాద్ కొల్లి
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
ఫైట్స్: నటరాజ్
కొరియోగ్రఫి: జిత్తు
బ్యానర్: స్లేట్ పెన్సిల్ స్టోరీస్
రిలీజ్ డేట్: 2025-02-21
దశరథ రామం (సముద్ర ఖని) రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగి. నీతి, నిజాయితీ తన విధులను నిర్వహిస్తూ.. లంచగొండితనానికి దూరంగా ఉంటాడు. రామం కుమారుడు రాఘవ (ధన్ రాజ్) చదువు సంధ్యలు లేక.. అల్లరి చిల్లరిగా బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. కొడుకు రాఘవ్ అంటే దశరథ రామానికి కోపం, ద్వేషం. తన కొడుకు చేసే పనులు సహించలేక తిడుతూ, అవసరమైతే దండిస్తుంటాడు. తండ్రి కొడుకుల మధ్య సఖ్యత, సత్సంబంధాలు కనిపించవు. ఈ నేపథ్యంలో తండ్రి దశరథ రామాన్ని చంపాలని రాఘవ ప్లాన్ వేస్తాడు.
కొడుకు పుట్టగానే తండ్రిగా దశరథ రామం ఏం కోరుకొన్నాడు? తన ఆశలు, ఆశయాలకు విభిన్నంగా ప్రవర్తించే కొడుకు రాఘవను దారిలో పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? తండ్రి కోపానికి రాఘవ ఎలాంటి శిక్షలు అనుభవించాడు. తండ్రి, కొడుకుల మధ్య ఎడబాటు, దూరం, ద్వేషం కలుగడానికి ఎలాంటి సంఘటనలు కారణమయ్యాయి? కన్న తండ్రిపై విద్వేషం పెంచుకొన్న రాఘవ ఏం చేశాడు? తండ్రిపై కోపం వేసిన ఓ ప్లాన్ గురించి తన స్నేహితుడి (హరీష్ ఉత్తమన్)కి చెబితే అతడు ఎలా రియాక్ట్ అయ్యాడు? చివరకు తండ్రి రామం, కొడుకు రాఘవ మధ్య విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయనే భావోద్వేగమైన ప్రశ్నలకు సమాధానమే రామం రాఘవం సినిమా కథ.

తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు, ద్వేషం లాంటి పాయింట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ఎవర్ గ్రీన్ లాంటి పాయింట్‌ను దర్శకుడిగా అవతారం ఎత్తిన కమెడియన్ ధనరాజ్ ఏ విధంగా, ఎంత ప్రభావితంగా చెప్పాడనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశంగా చూడాలి. అయితే కన్నతండ్రిని ద్వేషించే కొడుకు, కుమారుడిని సరైన మార్గంలో పెట్టాలనే తండ్రి తపన లాంటి పాయింట్‌ను తీసుకొని ధన్ రాజ్ చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. పాత్రలను రాసుకొన్న విధానం.. వాటిని నడిపించిన విధానం చూస్తే.. కొత్త దర్శకుడు తెరకెక్కించినట్టు ఎక్కడా కనిపించదు. అలాగే నటుడు, దర్శకుడు సముద్రఖని నుంచి రాబట్టుకొన్న పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో భావోద్వేగాన్ని నింపి కథను నడిపించిన విధానం చాలా బాగుంది. దర్శకుడిగా నూటికి నూరు మార్కులు సంపాదించుకొన్నారనే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే.. సముద్రఖని నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఆయన దశరథ రామంగానే కనిపించాడే కాని.. ఎక్కడా సముద్రఖని తెర మీద కనిపించలేదనే విధంగా నటించాడు. సినిమా భారాన్నంత తన భుజాలపై మోశాడనే చెప్పాలి. ఇక దర్శకత్వం బాధ్యతలతోపాటు ఈ సినిమాలో ప్రధాన పాత్రను కూడా ధన్ రాజ్ పోషించి మెప్పించాడు. అత్యంత భారమైన పాత్రలో ధన్ రాజ్.. సముద్రఖనితో పోటీ పడుతూ తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. సత్య కామెడీ బాగుంది. తల్లిగా ప్రమోదిని, స్నేహితుడిగా హరీష్ ఉత్తమన్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా మారిందని చెప్పాలి. హైలీ ఎమోషనల్ సీన్లను బీజీఎం బాగా ఎలివేట్ చేసింది. సన్నివేశాలను మరింత భావోద్వేగంతో నింపింది. పాటలు కూడా హృదయానికి హత్తుకొనేలా ఉన్నాయి. దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫి, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ప్రమాణాలకు తగినట్టుగా ఉన్నాయి. నిర్మాత పృథ్వీ పోలవరపు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రల కోసం నటీనటులను ఎంచుకొన్న విధానం చూస్తే.. సినిమాపై ఆయనకు ఉన్న తపన, అభిరుచి కనిపిస్తుంది.
రామం రాఘవం సినిమా తండ్రి కొడుకులు, తల్లి కుమారుల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా. సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం.. వాటికి తగినట్టుగా రాసుకొన్న డైలాగ్స్ సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకోవడం, ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు రొటీన్‌గా సాగదీసినట్టు అనిపించడం ఈ సినిమాకు మైనస్. సెకండాఫ్‌ను ట్విస్టులతో గ్రిప్పింగ్‌గా చెప్పడం సినిమాకు ప్లస్ పాయింట్. గుండెను పిండేసే భావోద్వేగమైన కథ కారణంగా ప్రేక్షకుడు భారమైన హృదయంతో బయటకు రావడం తథ్యం. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా. థియేటర్లలో తప్పక చూడండి. . లాజిక్స్ వెతకుండా చూస్తే మంచి అనుభూతిని పంచుతుంది.


Click it and Unblock the Notifications











