twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హే కృష్ణా.... ('కృష్ణం వందే జగద్గురుమ్‌' రివ్యూ)

    By Srikanya
    |

    హీరో చిన్నప్పుడు అతని తల్లి తండ్రులను విలన్ చంపేస్తాడు. అయితే పసిపిల్లాడైన హీరో అప్పుడు తప్పించుకుని పెద్దయ్యాక... అఫ్పటికి ప్రజా కంటకుడుగా తయారైన ఆ విలన్ ని... చంపేసి... తన పగని, జనాల కష్టాల్ని తీర్చేస్తాడు. పనిలో పనిగా.. ఆ జర్నిలో కలిసే హీరోయిన్ తో ప్రేమలో పడిపోతాడు... దాదాపు కమర్షియల్ సినిమా పుట్టిననాటి నుంచీ ఇదే కథ.. హీరోలను మార్చుకుంటూ తెరపై రిపీటవుతోంది. ఇప్పుడు క్రిష్ కూడా అదే కథ తీసుకుని దిగాడు. అయితే ఆ కథను కూడా సరిగ్గా చెప్పక కన్ఫూజ్ అవటంతో చతికిలపడింది.

    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    సంస్థ: ఫస్ట్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: రాణా, నయనతార, మిలింద్‌ గునాజీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, బ్రహ్మానందం, హేమ, ఎల్బీ శ్రీరామ్‌, నాగినీడు, సత్యం రాజేష్‌ తదితరులు. ప్రత్యేక గీతంలో వెంకటేష్‌, సమీరారెడ్డి.
    సంగీతం: మణిశర్మ
    మాటలు: సాయిమాధవ్ బుర్రా,
    కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్,
    నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి
    దర్శకత్వం: రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌)
    విడుదల: శుక్రవారం.

    గమ్యం, వేదం చిత్రాలతో విభిన్న చిత్రాల దర్శకుడు గా పేరు తెచ్చుకున్న క్రిష్ ఈ సారి తెలుగు రెగ్యులర్ కమర్షియల్ దర్శకుడుగానూ ప్రూవ్ చేసుకోవాలనుకుని ఫిక్సైనట్లున్నాడు. అందుకు తగినట్లుగా యాక్షన్,రొమాన్స్ ,విలన్స్,ఐటం సాంగ్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి వంటకం తయారు చేసి వదిలాడు. అయితే వంటకం సరిగా కుదరలేదు. కథలో పాత్రలు,డైలాగులు తప్ప సినిమాకు అవసరమైన కథ,కథనం లేక దారి తప్పింది. దాంతో ఈ చిత్రం వరస ఫ్లాపుల హీరో రాణా ఖాతాలో మరొక చిత్రంగా జమ అయ్యేటట్లు కనపడుతోంది.

    కళ అంటే జాతిని జాగృతం చేసేది అని నమ్మి నాటక సమాజం నడిపే...సురభి సుబ్రహ్మణ్యం (కోట) మనవడు బీటెక్‌ బాబు (రాణా). నాటకాలపై ఏ మాత్రం ఆసక్తి ఉండని బాబు కి వీసా వస్తే అమెరికా వెళ్లిపోవాలన్నది ఆశయం. అయితే ఈలోగా తాత చనిపోవటంతో ఆయన ఆఖరి కోరిక అయిన తన సొంత ఊరు బళ్లారిలో నాటకాల ప్రదర్శించాలని బయిలుదేరతాడు. బళ్లారిలో మైనింగ్ మాఫియాదే రాజ్యం. మైనింగ్ మాఫియాని రెడ్డప్ప(మిలింగ్ గునాజీ)ఏకపధ్యాధిపత్యంగా నడుపుతూంటాడు. అతనితో అనుకోని పరిస్దితుల్లో బాబు తలపడాల్సి వస్తుంది. అంతేగాక అతనికి తన తల్లి తండ్రులను చంపింది కూడా రెడ్డప్ప అని తెలుస్తుంది. అప్పుడు బాబు...అంత పెద్ద మాఫియా కింగ్ ని ఎలా ఎదుర్కొన్నాడు..తన తాత చివరి కోరక ఎలా తీర్చాడు.. అలాగే ఈ జర్నిలో బాబుకి దేవిక(నయనతార)పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

    కమర్షియల్ సినిమా రూపకల్పన అనేది అంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు...ఎందుకంటే పైనే చెప్పుకున్నట్లు తెలిసిన కథనే కొత్త కథగా భ్రమింప చేస్తూ చెప్పాలి. అలాగే..విలన్ కి, హీరోకి మధ్య జరిగే పోరుని ఆసక్తి కరంగా చూపగలిగాలి. హీరో,హీరోయిన్ మధ్య రొమాన్స్ ని హత్తుకునేలా చేయగలగాలి. అదే ఈ చిత్రంలో మిస్సైంది. హీరోకి తన తల్లి,తండ్రి ది సహజమరణం కాదు..హత్యకి గురి అయ్యారు..అని తెలిసే సరికే సగం సినిమా అయిపోతుంది. ఇక మిగతా సినిమా అసలు ఆ చంపిది ఎవరు..వాడ్ని ఎలా పట్టుకోవాలి అన్నదానికే సరిపోయింది. ఇక విలన్ ఎవరో తెలిసి మరుక్షణం..ఒకే ఒక దెబ్బతో విలన్ ని చంపేయటం జరుగుతుంది.అంత పెద్ద విలన్ ని హీరో ఏ ఎత్తుతో పడేస్తాడో అనుకుంటే..ఆశ్చర్యంగా...ఒక్క క్షణంలో చాలా సాదాసీదాగా జరిగిపోతుంది. దాంతో హీరో పాత్ర సినిమా క్లైమాక్స్ దాకా చాలా డల్ గా నడుస్తుంది. అదే..విలన్ ఎవరో తెలిసి..అతన్ని పడగొట్టటానికి హీరో ఏం చేసాడు అన్నది రెగ్యులర్ అయినా ఆసక్తికరంగా ఉండే నేరేషన్. ఇక నయనతార పాత్ర కథకు గానీ,హీరోకి కానీ ఎందుకూ ఉపయోగపడదు. పాత సినిమాల్లో విలన్స్..జర్నలిస్ట్ ని చంపాలని తిరుగుతున్నట్లే ఈ సినిమాలోనూ మొదటినుంచి చివరివరకూ ఆమెను చంపాలని తిరుగతూంటారు..ఆమె తప్పించుకుంటూంటుంది. ఇదంతా స్క్రీన్ ప్లే సరిగ్గా అల్లుకోకపోవటంతో వచ్చిన సమస్య. హీరో పాత్ర ప్యాసివ్ గా మారిందని గుర్తించలేదు. అంతేగాక మైనింగ్ మాఫియా..అనేది అతి పెద్ద సమస్య అయినా చాలా మందికి ఆ సమస్య వల్ల సామాన్యులు జరిగే అన్యాయం ఏమిటో అర్దంకాదు. అలాంటప్పుడు విలన్..పై పెద్దగా నెగిటివ్ ఫీలింగ్ రాదు. అఫ్పుడు హీరో అతన్ని చంపాలని తిరిగినా,అతని వ్యక్తిగత పగ కోసం చంపుతున్నట్లే ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా తేలిపోయింది.

    నటీనటుల్లో రాణా ఇంతకుముందుకన్నా పరిణితితో నటించాడు. రఘుబాబు.పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఎల్భి శ్రీరామ్ పాత్ర అనుకున్నంతగా పేలలేదు. అందరికన్నా టిప్పు సుల్తాన్ గా...పోసానికృష్ణ మురళి చెప్పే డైలాగులుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మానందం,హేమ,సత్యం రాజేష్ చాలా రొటీన్ సీన్లకు,రొటీన్ నటన అందించి అలరించారు. సమీరారెడ్డి ఐటం సాంగ్,వెంకటేష్ అప్పీరియన్స్ అంతగా కిక్కు ఇవ్వలేదు. నయనతార..ఎప్పటిలాగే బాగా చేసింది. ఆమె సీన్స్ చాలా కట్ చేసేసినట్లున్నారు.కొన్ని చోట్ల లింక్ లు మిస్సయ్యాయి. సురభి నాటకాలు సినిమాకు కొత్త బ్యాక్ గ్రౌండ్ ని ఇవ్వగలిగాయి కానీ...ఈ కాలం వారికి తెలియని నేపధ్యం కావటం కొంత ఇబ్బందికరమే. సినిమా హైలెట్స్ లో చెప్పుకోవాల్సింది డైలాగ్స్. కొత్త డైలాగ్ రైటర్ అయినా చాలా చోట్ల ఆలోచింప చేసే డైలాగులు రాసారు. మణిశర్మ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినంతబాగా పాటలు ఇవ్వలేదు. కెమెరా,ఎడిటింగ్ ఉన్నత స్ధాయిలోనే ఉన్నాయి. దర్సకుడుగా క్రిష్ కొన్ని ఎపిసోడ్స్ లో మంచి మార్కులే వేయించుకుంటారు. కానీ..కమర్షియల్ లుక్ సినిమాకు ఇవ్వలేకపోయారు.

    ఈ చిత్రం ఎత్తుగడ బాగున్నట్లుగా ముగింపు బాగోదు. ముగింపే ముఖ్యంకాబట్టి... సినిమా విజయావకాసాలు సందేహమే. అలాగే సినిమా యాక్షన్ సీన్స్ ఉన్నా..క్లాస్ బ్యాక్ డ్రాప్ ఉండటంతో బి,సి సెంటర్లకు దూరం అవుతుందనిపిస్తుంది. ఏదైమైనా మంచి దర్శకుడు అని ఓ వర్గం చేత అనిపించుకున్న క్రిష్..తన పంథాలోనే ముందుకు వెళితే తనను నమ్మే అభిమాన వర్గాన్ని అయినా దూరం చేసుకోకుండా మిగులుతారు. ఇలాంటి యాక్షన్ చిత్రాలకు తెలుగులో ఇప్పటికే లెక్కకు మించిన దర్శకులు ఆల్రెడీ ఉన్నారు...ఇంకా రాబోతారు కాబట్టి క్రిష్..వేదం,గమ్యం లాంటి చిత్రాలతోనే ప్రయాణం చేస్తే తనదైన ముద్ర మిగులుతుంది. రాబోయే చిత్రాలలో ఆ జాగ్రత్త తీసుకుంటాడని ఆశిద్దాం.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Krishnam Vande Jagadgurum is an bilingual film directed by Krish released today with average talk. The film made simultaneously in Telugu and Tamil languages. It features Rana Daggubati and Nayantara in the lead roles. Mani Sharma composed the music for the film. The film has been named Ongaram in Tamil. The film is also to be dubbed in Hindi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X