Rangamarthanda Movie review గుండెను పిండేసే సినిమా.. హ్యాట్పాఫ్ కృష్ణవంశీ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్
నటీనటులు: ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా, చిరంజీవి (అతిథి పాత్రలో) తదితరులు
నిర్మాతలు: అభిషేక్ జాకర్, కలిపి మధు, వెంకట్ రెడ్డి
దర్శకత్వం: కృష్ణవంశీ
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫి: రాజ్ నల్లి
రిలీజ్ డేట్: 2023-03-22

రంగ మార్తండ కథ
రాఘవరావు (ప్రకాశ్ రావు) ప్రముఖ రంగస్థల నటుడు. తన జీవితాన్ని నాటక రంగానికి అంకితం చేసి ఎన్నో అద్బుతమైన పాత్రలను పోషించడమే కాకుండా రంగస్థలానికి మంచిపేరు తెచ్చినందుకు ఆయనకు రంగ మార్తండ అనే బిరుదును ఇచ్చి సన్మానిస్తారు. తన సన్మాన కార్యక్రమంలో ఇక నాటక రంగానికి సెలవు అంటూ రాఘవరావు సంచలన ప్రకటన చేస్తారు. అలాగే జీవిత కాలంలో సంపాదించిన ఆస్తులను కూతురు బంగారం అలియాస్ శ్రీ (శివాత్మిక రాజశేఖర్) కొడుకు రంగారావు (ఆదర్శ్ బాలకృష్ణ)కు సమానంగా పంచి ఇస్తారు. ఇక తన శేష జీవితాన్ని భార్య సావిత్రి అలియాస్ రాజు (రమ్యకృష్ణ), కుటుంబంతో గడపాలని నిర్ణయించుకొంటారు.

రంగ మార్తండ కథలో మలుపులు
అయితే ఆస్తులన్నీ రాసిచ్చేసిన రాఘవరావు దంపతుల జీవితం సవ్యంగా సాగిందా? కొడుకు, కోడలు (అనసూయ భరద్వాజ్) నుంచి రాఘవరావుకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. రాఘవరావు కుమార్తె శ్రీ, అల్లుడు రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్)తో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి రాఘవరావు జీవితంలో చక్రవర్తి (బ్రహ్మానందం) పాత్ర ఏమిటి? చక్రవర్తి తన జీవితంలో అనుభవించే సమస్య ఏమిటి? చక్రవర్తి ఎందుకు ఆత్మత్యాగం చేయాలని అనుకొన్నాడు. రాఘవరావు దంపతుల జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే రంగ మార్తండ సినిమా కథ.

సినిమా ఎలా సాగిందంటే?
రంగ మార్తండ చిత్రం రాఘవరావుకు స్వర్ణ కంకణం తొడిగి రంగ మార్తండ అనే బిరుదు ఇవ్వడంతో కథ మొదలవుతుంది. కొడుకు, కూతురుకు తన మొత్తం ఆస్తిని రాసిచ్చిన తర్వాత వారిలో పెరిగిన స్వార్ధపు ధోరణుల వల్ల కుటుంబంలో వచ్చిన సమస్యలతో కథ ముందుకు సాగుతుంది. సినిమా ఆరంభంలో కొంత ఆర్ట్ ఫిలింలా సాగినప్పటికీ.. ప్రతీ సన్నివేశంలో గుండెను పిండేసే భావోద్వేగం ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కథలో పాఠశాలల్లో తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం, వివక్షను చక్కగా చూపించడమే కాకుండా ప్రజలకు కనువిప్పు కలిగేలా దర్శకుడు కృష్ణ వంశీ చెప్పగలిగారు. సెకండాఫ్ విషయానికి వస్తే.. చక్రవర్తి పాత్రను మలిచిన తీరు, అలాగే కొన్ని సన్నివేశాలను ప్రకాశ్ రాజ్, బ్రహ్మనందం మధ్య రాసుకొన్న తీరు అద్బుతంగా ఉంటాయి. రంగ మార్తండ భావోద్వేగాలకు, నటీనటులు ప్రతిభకు, నటనకు పరాకాష్టగా కనిపిస్తాయి.

ప్రకాశ్ రాజ్, బ్రహ్మనందం ఫెర్ఫార్మెన్స్
ఇక రంగ మార్తండ చిత్రంలో పాత్రల్లో జీవించిన నటీనటుల విషయానికి వస్తే.. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసే ప్రకాశ్ రాజ్ ఈ చిత్రానికి కొండంత అండగా కనిపిస్తాడు. ప్రతీ సన్నివేశంలోను ఆయన బిహేవ్ చేసిన తీరు రాఘవరావు పాత్రకు కిరిటాన్ని తొడిగింతేగా ఉంటుంది. ఇక ప్రకాశ్ రాజ్‌తో పోటీ పడుతూ చక్రవర్తి పాత్రలో బ్రహ్మనందం తన విశ్వరూపాన్ని చూపించారు. సెకండాఫ్‌లో బ్రహ్మనందం తన నటనతో కంటతడి పెట్టించేస్తారు. ప్రేక్షకుడు ఇప్పటి వరకు చూడని కొత్త పాత్రలో బ్రహ్మనందం కనిపిస్తారు. రమ్యకృష్ణ మరోసారి భారమైన పాత్రలో ఒదిగిపోయారు. కళ్లతో పలికించిన హావభావాలు ప్రేక్షకుడిని భావోద్వేగంతో కట్టిపడేస్తాయి.

రంగ మార్తండలో మిగితా పాత్రల్లో
ఇక మిగితా పాత్రల్లో రాఘవ రావు కూతురిగా శివాత్మిక రాజశేఖర్ తన వయసుకు మించిన పరిణతిని బంగారం పాత్రలో చూపించారు. ఇప్పటి వరకు గ్లామర్ తారగా కనిపించిన శివాత్మిక అద్బుతమైన నటి తనలో దాగి ఉందనే విషయాన్ని చెప్పగలిగారు. అనసూయ తన పాత్ర పరిధి మేరకు మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటారు. ఆదర్శ్, రాహుల్ సిప్లిగంజ్, అలి రెజా తమ ఇమేజ్ భిన్నమైన పాత్రలతో మెప్పిస్తారు. చిరంజీవి ఓ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా సినిమాకు నిలుస్తారు.

సాంకేతిక నిపుణులు గురించి
తన కెరీర్‌లో సింధూరం, మురారీ లాంటి ఎన్నో అద్బుతమైన చిత్రాలను అందిచంిన కృష్ణంశీ మరాఠీలో ప్రేక్షకులను ఆలరించిన నటసామ్రాట్ సినిమాను అద్బుతంగా రీమేక్ చేయడంలో సఫలమయ్యారు. సినిమా నిండా తెలుగుదనాన్ని, కుటుంబ విలువలు, మనుషుల్లో అంతరించి పోతున్న మానవత్వాన్ని తట్టిలేపుతూ ఓ మంచి ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించారు. రంగ మార్తండ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం వెన్నుముక. ఈ చిత్రంలోని పాటలు ఆకట్టుకొనే విధంగా సాగుతాయి. కెమెరా పనితనం కథకు తగినట్టుగానే ఉంటుంది. మిగితా సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది.

రంగ మార్తండ గురించి ఫైనల్‌గా
కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయత, అనురాగాల, భావోద్వేగాలు దట్టించిన చిత్రం రంగ మార్తండ. దర్శకుడు కృష్ణవంశీ సన్నివేశాలను తెరపైన పేర్చిన తీరు..పాత్రలను రాసుకొన్న తీరు.. స్క్రీన్ మీద సజీవంగా మార్చాయి. నాగరికత పేరుతో విచ్చిన్నమవుతున్న కుటుంబాలు, స్వార్ధంతో బతుకుతున్న మనుషులకు రంగ మార్తండ చెంపపెట్టులా ఉంటుంది. ఆనందం, బాధ, దు:ఖం, వినోదం అందిస్తూ.. ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. కుటంబంలో పిల్లలు ఎలా ఉండాలి? జీవిత చరమాంకంలో తల్లిదండ్రుల ధీనస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఫ్యామిలీ అంతా చూడాల్సిన చిత్రం రంగ మార్తండ.


Click it and Unblock the Notifications











