»   » రంగస్థలం మూవీ రివ్యూ: రాంచరణ్ చితక్కొట్టేశాడు..

రంగస్థలం మూవీ రివ్యూ: రాంచరణ్ చితక్కొట్టేశాడు..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Rangasthalam Movie Review రంగస్థలం రివ్యూ

    Rating:
    4.0/5
    Star Cast: రాంచరణ్, సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు
    Director: సుకుమార్

    బాహుబలి తర్వాత తెలుగు చిత్రసీమలో విభిన్నమైన చిత్రాల నిర్మాణం ఊపందుకొన్నది. ఆ క్రమంలోనే రంగస్థలం విలక్షణమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధృవ చిత్రం తర్వాత రాంచరణ్, నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో విశేషాలను సొంతం చేసుకొన్నది.

    80 దశకం నాటి పరిస్థితులు, కథా నేపథ్యంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో సమంత అక్కినేని, అనసూయ, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, నరేష్ లాంటి నటుల పాత్రలు ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. రంగస్థలం కోసం వేసిన గ్రామం సెట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎన్నో విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    రంగస్థలం కథ..

    చెవిటివాడైన చిట్టిబాబు (రాంచరణ్) రంగస్థలం గ్రామవాసి. పొలానికి నీటి సౌకర్యాన్ని అందించే పంపుసెట్ల ఇంజినీర్. చిట్టిబాబుకు కుమార్ అనే అన్నయ (ఆది పినిశెట్టి), తల్లి, తండ్రి (నరేష్), ఓ చెల్లలు ఉంటుంది. చిట్టిబాబు అన్యాయాన్ని అసలే సహించడు. రామలక్ష్మీ (సమంత)తో ప్రేమలో పడుతాడు. గ్రామంలో ప్రెసిడెంట్ (జగపతిబాబు) చేసే అన్యాయాలను ఎదురించడానికి అన్నదమ్ములు సిద్ధమవుతారు. గ్రామాభివృద్ధి కోసం ప్రసిడెంట్‌గా పోటీ చేయాలని కుమార్ ఎన్నికల బరిలోకి దిగుతాడు. కుమార్‌కు అండగా నవభారత్ పార్టీ ఎమ్మెల్యే (ప్రకాశ్ రాజ్) అండగా నిలుస్తాడు.

    రంగస్థలం ముగింపుకు

    ఎన్నికల బరిలోకి దిగిన కుమార్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఎన్నికల బరిలోకి దిగిన తన అన్నయ్యకు చిట్టిబాబు ఏ విధంగా తోడ్పాటునందించాడు? ప్రేమించిన రామలక్ష్మీని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎన్నికల్లో కుమార్ గెలిచాడా? ప్రసిడెంట్ పరిస్థితి ఏమైంది? రంగస్థలంలో ప్రసిడెంట్ దురాగతాలను ఎలా చరమగీతం పాడారు అనే ప్రశ్నలకు సమాధానమే రంగస్థలం సినిమా కథ.

    ఫస్టాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    గ్రామ రాజకీయాలకు అద్దంపట్టే విధంగా రూపొందిన స్క్రిప్టు రంగస్థలం. ఈ కథలో కుటుంబంలో ఉండే విభేదాలు, భావోద్వేగాలు సజీవంగా నిలుపడంలో దర్శకుడు సుకుమార్ సఫలమయ్యాడు. 1980 నాటి బ్యాక్ డ్రాప్‌తో ప్రారంభమయ్యే రంగస్థలం సినిమా కథలో తొలి భాగంలో క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ చక్కగా సాగుతుంది. బలమైన పాత్రలు కథకు ప్రాణంగా నిలిచాయి. తొలిభాగంలో చిట్టిబాబుగా రాంచరణ్, సమంత రామలక్ష్మీ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఓ అనూహ్యమైన మలుపు రెండో భాగంపై ఆసక్తి పెరుగుతుంది.

    సెకండాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    రంగస్థలం రెండో భాగంలో గ్రామ రాజకీయాలు, ఎన్నికలు, ప్రేమ, కుటుంబం మధ్య భావోద్వేగభరితమైన అంశాలు కథపై పట్టుసాధిస్తాయి. దర్శకుడు కథ చెప్పడంలో ఏమాత్రం తొందరపాటు కనిపించదు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు ఒకదానికి ఒకటి పోటీ పడుతూ సినిమాను మరోమెట్టు ఎక్కించాయి. సినిమా చివరి గంటలో ఆదిపై దాడి ఘటనతో సినిమా ఎమోషనల్‌ స్థాయి పెరుగుతుంది. రెండోభాగంలో రాంచరణ్‌ నటన ఆయన కెరీర్‌లో అద్భుతమనిపిస్తుంది. రంగస్థలం సినిమాకు క్లైమాక్స్ ఆయువుపట్టు. కథపై పట్టు సడలకుండా దర్శకుడు కథను నడిపించిన తీరు అమోఘం అని చెప్పవచ్చు.

    డైరెక్టర్ సుకుమార్ విజన్, టేకింగ్

    రంగస్థలం కోసం సుకుమార్ రాసుకొన్న కథను మనకు తెలియకుండా ఎక్కడ నుంచో తీసుకొచ్చింది కాదు. గ్రామాల్లో మన కళ్లముందు కనిపించే సజీవ దృశ్యాలకు తెర రూపం కల్పించడంలో సుకుమార్ పరిణతికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఓ సాదాసీదా కథకు 1980 నాటి వాతావరణాన్ని, పరిస్థితులను జోడించి ఈ సినిమాను అందమైన దృశ్యకావ్యంలా మలిచారు. కథ చెప్పే క్రమంలో కొంత నమ్మదించిందా అనే ఫీలింగ్ కలిగిన సినిమాకు ఎలాంటి అవరోధం కలగకుండా సుకుమార్ జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇలాంటి కథకు తెరరూపం కల్పించడానికి సుకుమార్ చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

    రాంచరణ్ యాక్టింగ్

    ఇప్పటివరకు రాంచరణ్‌ ఓ స్టార్ హీరోగానే కనిపిస్తాడు. రంగస్థలం సినిమా చూసిన తర్వాత ఓ గొప్ప ఫెర్ఫార్మర్, మంచి నటుడు అని ఒప్పుకోకతప్పదు. సుకుమార్ మలిచిన చెవిటి చిట్టిబాబు పాత్రకు రాంచరణ్ జీవం పోశాడు. వందశాతం పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. చెవిటివాడిగా రాంచరణ్ మెప్పించకపోతే ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గానే మిగిలేది. కానీ చిట్టిబాబుగా రాంచరణ్ తన పాత్రతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. జీవితంలో అరుదుగా నటుడికి చిట్టిబాబు లాంటి పాత్రలు ఎదురుపడుతుంటాయి. వాటిని గ్రహించి మెప్పించడంలోనే నటుడిగా స్థాయి పెరుగుతుంది. చిట్టిబాబు రూపంలో వచ్చిన అవకాశాన్ని రాంచరణ్ చక్కగా ఒడిసిపట్టుకొన్నాడు.

    సమంత ఫెర్ఫార్మెన్స్

    సమంతను గ్లామర్ హీరోయిన్‌గానే ప్రేక్షకులకు పరిచయం. రంగస్థలంలో రామలక్ష్మీ పాత్రను చూస్తే సమంత ఎక్కడ కనిపించదు. అచ్చతెనుగు పల్లెటూరి అమ్మాయిలా మాత్రమే కనిపిస్తుంది. రామలక్ష్మీ పాత్రలో సమంత జీవించేసింది. కట్టు, బొట్టు, హావభావాలతో సమంత మరోసారి ప్రేక్షకుడి గుండెలో చెరుగని స్థానాన్ని సొంతం చేసుకొన్నారు. కీలక సన్నివేశాల్లో సమంత కళ్లతో పలికించిన హావభావాలు ప్రేక్షకుడిని మైమరిపిస్తాయి.

    అనసూయ, పూజా హెగ్డే

    రంగస్థలం సినిమాకు ముందు అనసూయ ఇమేజ్ వేరు. కానీ రంగస్థలం చిత్రం చూసిన తర్వాత అనసూయ అంటే రంగమ్మత్తనే గుర్తువస్తుంది. పల్లెటూరులో ఉండే మధ్య వయసు గృహిణి, ప్రతీ విషయాన్ని సరిగా క్షుణ్ణంగా అర్ధం చేసుకొనే అత్త, వదిన, పెద్దమ్మ అన్ని షేడ్స్ అనసూయ క్యారెక్టర్‌లో కనిపిస్తాయి. అనసూయ డిక్షన్, బాడీలాంగ్వేజ్‌లో ఉండే కొంత అర్బన్ లుక్ అక్కడక్కడా కనిపించింది. మరికొంత కొంత దృష్టి పెట్టి ఉంటే అనసూయ పాత్ర తెర మీద నిలిచిపోయే అద్బుతమైన పాత్రల్లో ఒకటిగా మారేది. అనసూయ నటన రంగస్థలం సినిమాకు అదనపు ఆకర్షణ. జిగేల్ రాణిగా పూజా హెగ్డే మెరిసింది.

    ప్రకాశ్ రాజ్, జగపతి, ఆది ఇతరుల

    రంగస్థలం సినిమాలో ఏ ఒక్క పాత్రను కూడా మనసు నుంచి దూరం చేసుకోలేదు. ప్రతి చిన్న పాత్ర కూడా ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది. అలాంటి పాత్రల్లో ప్రముఖంగా చెప్పుకొనే ప్రసిడెంట్‌ అలియాస్ ఫణీంద్ర (జగపతిబాబు), దక్షిణామూర్తి (ప్రకాశ్ రాజ్), కుమార్ (ఆది పినిశెట్టి) పాత్రలు సినిమాకు బలంగా మారాయి. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్‌కు ఇలాంటి పాత్రలు ఇటీవల కాలంలో కొట్టినపిండిగా మారాయి. కుమార్ అనే పాత్రను ఆది పినిశెట్టి అద్భుతంగా పండించాడు. ఇంటర్వెల్‌లో ఆది చనిపోయే సీన్ల కంటతడి పెట్టించేతలా ఉంటుంది. ఆ పాత్రలో ఆదిని తప్ప మరకొరిని ఊహించుకోవడం కష్టం.

    రత్నవేలు సినిమాటోగ్రఫీ

    రంగస్థలం చిత్రాన్ని అందమైన కాన్వాస్‌గా మలచడంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెర వెనుక అద్భుతమైన పాత్రను పోషించాడు. ప్రతీ విషయాన్ని సూక్ష్యంగానూ, స్థూలంగానూ తెర మీద ఆవిష్కరించడంలో ఆయన ప్రతిభకు ఈ చిత్రం గీటురాయిగా నిలిచింది. గ్రామీణ వాతావరణాన్ని కళ్ల ముందు సజీవంగా నిలపడంలో రత్నవేలు సక్సెస్ అయ్యాడు. గడ్డి క్షేత్రాల్లో ఫైట్స్ సీక్వెన్స్ గానీ, గోదావరి తీరాల్లో సన్నివేశాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.

    రామకృష్ణ ఆర్ట్ వర్క్

    రంగస్థలం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఆర్ట్ వర్క్. ఆర్ట్ డైరెక్టర్‌ రామకృష్ణ వేసిన సెట్లు, కాలనీ వాతావరణాన్ని తీర్చి దిద్దిన తీరు హ్యాట్సాఫ్. గ్రామంలో ఉండే ఇళ్లు, గుడిసెలు లాంటి అంశాలు ప్రేక్షకుడిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఆర్ట్ వర్క్ గొప్ప పేరు తెచ్చే విధంగా రామక‌ృష్ణ తన ప్రతిభకు పదునుపెట్టారు. ప్రశాంతి స్టైలింగ్ వర్క్ ఈ చిత్రాన్ని మరింత ఆకర్షణగా మార్చింది. సుకుమార్ విజన్‌కు అనుగుణంగా ఎడిటర్ నవీన్ నూలి తన పనిని కానిచ్చేశాడు. సినిమాకు వందశాతం న్యాయం చేకూర్చాడు.

    దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్

    బ్యాక్ డ్రాప్ ఏదైనా మ్యూజిక్‌తో చితక్కొట్టడంలో దేవీ శ్రీ ప్రసాద్ సిద్ధహస్తుడు. కొత్త బ్యాక్ డ్రాప్, పుష్కలంగా లవ్ ఎమోషనల్ సీన్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దడదడలాడించాడు. సెకండాఫ్‌లో దేవీ శ్రీ ప్రసాద్ రీరికార్డింగ్ ప్రాణంగా నిలిచింది. రంగా రంగా రంగస్థలాన, ఎంత సక్కగున్నావే, ఆగట్టు నుంటావా, జిగేల్ రాణి పాటలు ఆడియోపరంగానే కాకుండా, తెర మీద కూడా అలరించాయి.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    భారీ బడ్జెట్ మాత్రమే కాకుండా అద్భుతమైన కథలను అందిస్తూ ప్రేక్షకులకు చేరువైన సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. ఎర్నేని నవీన్, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి మంచి అభిరుచి ఉన్న నిర్మాతలుగా పెరుతెచ్చుకొన్నారు. ఇప్పటి వారు తమ బ్యానర్‌లో నిర్మించిన సినిమాలు ఒక ఎత్తైతే రంగస్థలం నిర్మాణం మరో ఎత్తు. క్లాలిటీ కోసం వారు పడే తపన ఈ చిత్రంలో ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది. మరో దశాబ్దంపాటు టాలీవుడ్ నిలిచిపోయే చిత్రంగా రంగస్థలాన్ని రూపొందించారు.

    ఫైనల్‌ జడ్జిమెంట్

    ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచి మారుతున్నదనేది పలు చిత్రాలు నిరూపించాయి. కొత్తదనానికి ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త కంటెంట్, కథనం, క్వాలిటీతో వచ్చిన చిత్రం రంగస్థలం. నవరసాలు కలిసిన చిత్రం రంగస్థలం. అప్పుడప్పుడు అరుదుగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే చిత్రాల కోవలో నిలిచిపోయే సినిమా రంగస్థలం. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అనే పేరు తెచ్చుకొన్నది. అయితే కలెక్షన్లపరంగా ఈ చిత్రం ఏ రేంజ్ అనేది నిర్ధారణ జరుగాల్సి ఉంది. రెండు, మూడు రోజులు ఆగితే రికార్డులు తిరుగరాసే సినిమాగా కూడా తేలిపోవడం ఖాయం.

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • రాంచరణ్ యాక్టింగ్
    • సమంత పెర్ఫార్మెన్స్
    • సుకుమార్ టేకింగ్
    • రత్నవేలు సినిమాటోగ్రఫీ
    • రామకృష్ణ ఆర్ట్
    • టెక్నికల్ వ్యాల్యూస్
    • దేవీ శ్రీ సంగీతం
    • చంద్రబోస్ సాహిత్యం

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: రాంచరణ్, సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, అనసూయ, పూజాహెగ్డే తదితరులు
    దర్శకత్వం: సుకుమార్
    నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి
    సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
    సాహిత్యం: చంద్రబోస్
    సినిమాటోగ్రఫి: రత్నవేలు
    ఎడిటింగ్ నవీన్ నూలి
    ఆర్ట్: రామకృష్ణ
    స్టైలిస్ట్: ప్రశాంతి,
    రిలీజ్ డేట్: మార్చి 30, 2018
    బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
    నిడివి: 179 నిమిషాలు

    English summary
    Rangasthalam starring Ram Charan and Samantha Akkineni is this week’s big release in the south. The film directed by Sukumar has earned a positive buzz ahead of its release and the pre-booking in Telugu speaking states is quite encouraging, according to the trade. It is a film set in the 80s and unfolds in a village. The film also stars Adhi Pinisetty, Jagpathi Babu and Prakash Raj in pivotal roles. This movie released on March 30th.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more