Aadavallu Meeku Johaarlu Review మెప్పించలేకపోయిన శర్వానంద్, రష్మిక మందన్న
Rating: 2.25/5
నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, కుష్బూ, ఊర్వశి, రాధిక శరత్ కుమార్, వెన్నెల కిశోర్, రవి శంకర్, ప్రదీప్ రావత్, సత్య, గోపరాజు రమణ, ఝాన్సీ, రజిత, ఆర్‌సీఎం రాజు తదితరులు
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సినిమాటోగ్రఫి: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
రిలీజ్ డేట్: 2022-04-04

ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమా కథ
పెద్దమ్మ (ఊర్వశి) , లక్ష్మమ్మ (రాధిక శరత్ కుమార్) పెద్దదిక్కుగా ఉండే భారీ ఉమ్మడి కుటుంబంలో ఏకైక వారసుడు చిరంజీవి (శర్వానంద్). చిరు అంటే ఇంటిల్లిపాదికి కొండంత ప్రేమ. అందరూ ఇష్టపడే చిరంజీవికి అందరికి నచ్చే అమ్మాయిని వెతికి పెళ్లి చేయాలనేది ఇంటి సభ్యులు కోరిక. పది మందికి నచ్చే అమ్మాయి లభించకపోవడంతో చిరంజీవి పెళ్లి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ క్రమంలో విలువలు, మహిళా పక్షపాతి, పారిశ్రామిక వేత్త వకులాదేవీ (కుష్పూ) కూతురు ఆద్య (రష్మిక మందన్న)తో చిరు ప్రేమలో పడుతాడు.

కథలో ట్విస్టులు ఇలా
ముక్కుసూటి మనిషి వకులా దేవీ జీవనశైలి, వ్యక్తిత్వం కారణంగా చిరంజీవి ప్రేమకు ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి? వకులా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి చిరంజీవి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. తమ వారసుడు చిరంజీవికి భార్యగా తీసుకురావడానికి ఇంటి పెద్దలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చిరంజీవి పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు ఏమిటి? తల్లి మాట జవదాటలేని ఆద్యను చిరంజీవి ఎలా మెప్పించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కథ.

కథ లేకుండానే తొలి భాగం
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పెద్దమ్మ, కొడుకు మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేసే చక్కటి సెంటిమెంట్ సీన్‌తో కథ ప్రారంభమవుతుంది. పెద్దమ్మకు సంతానం లేని లోటు రానివ్వనని చిరంజీవి చెప్పే మాటలతో ఈ కథలో ఏదో బలమైన సెంటిమెంట్ ఉంటుందనే భావన కలుగుతుంది. కానీ కథ నడిచే కొద్ది పేలవమైన సీన్లు తెలుగు టెలివిజన్ సీరియల్‌లా సాగుతాయి. సినిమా ఆరంభమైన గంటలోనే మూడు పాటలు రావడంతో సినిమాలో విషయం లేదా అనే అనుమానం కలుగుతుంది. గంటన్నర వ్యవధిలోనే నాలుగు పాటలు పెట్టి కథ నుంచి ప్రేక్షకుడిని డీవియేట్ చేసే ప్రయత్నం చేశారే సందేహం కలుగుతుంది. అలా అనాసక్తిగా, పసలేని ఎపిసోడ్స్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది.

కుష్బూతో సెకండాఫ్‌లో ఊరట
ఇక సెకండాఫ్‌లోనైనా అసలుసిసలైన కథను చెప్పి.. ఆడవాళ్లకు జోహర్లు అర్పిస్తారని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. కుష్బూ ఎంట్రీతో నిరాశ, నిస్పృహలతో సాగుతున్న కథనానికి కాస్త ఊరట కలిగించే ప్రయత్నం జరిగింది. కానీ ఆ ఊరట ఎంతోసేపు నిలువకుండా.. మళ్లీ ఎప్పటి ఆట మాదిరిగానే అనిపిస్తుంది. కథను మరో రేంజ్‌కు తీసుకెళ్లే నటీనటులు ఉన్నా.. సన్నివేశాల్లో అసలు విషయం కనిపించదు. వెరసి ఈ సినిమా కుటుంబ కథా చిత్రమా? లవ్ అండ్ రొమాంటిక్ చిత్రమా అనే విషయాన్ని తేల్చుకుండా చాలా సాదాసీదాగా ముగుస్తుంది. దర్శకుడు ఏదైతే ఊహించుకొని రాశాడో.. ఆ విషయం ప్రేక్షకులకు సూటిగా, సుత్తిలేకుండా చెప్పడంలో విఫలమయ్యాడనిపిస్తుంది.

శర్వానంద్ యాక్టింగ్ ఎలా ఉందంటే..
శర్వానంద్ విషయానికి వస్తే.. ఓ బలమైన విజయం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఫీల్‌గుడ్ ఉన్న కథలకే ఓటేస్తున్నాడు. కానీ తెరమీదకు వచ్చేసరికి ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడనే విషయం గత నాలుగైదు సినిమాల్లో తేలిపోయింది. ఫ్యామిలీ హీరోగా ముద్రవేసుకొనే ప్రయత్నం ఈ సినిమాతో తీరలేదనే చెప్పాలి. కథ, కథనాల్లో బలం లేకపోవడంతో శర్వానంద్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదనే చెప్పవచ్చు. చిరంజీవి క్యారెక్టర్‌ను ఎమోషనల్‌గా మార్చలేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పవచ్చు.

రష్మిక, కుష్బూ, రాధిక, ఊర్వశి నటన
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రష్మిక మందన్న, కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఝాన్సీ, ఇతర పాత్రలన్నీ అసంపూర్తిగానే కనిపిస్తాయి. ఏ ఒక్క పాత్రలో భావోద్వేగం కనిపించదు. ఉన్నంతలో కుష్బూ గంభీరంగా కనిపించింది. ఊర్వశి ఎమోషనల్ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించింది. రష్మిక పాత్ర అత్యంత సాదాసీదాగా, రొటీన్‌గా అనిపిస్తుంది. ఝాన్సీ కూడా కాస్త గుర్తుండిపోయే పాత్రే చేసింది. వెన్నెల కిషోర్ పాత్ర కూడా నవ్వించలేకపోయింది. బెడ్ రూమ్ సీన్‌లో వెన్నెల కిషోర్ తన టైమింగ్‌తో ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత సత్య కూడా ఒకే అనిపించాడు.

సాంకేతిక నిపుణుల గురించి
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాజమండ్రి, సముద్ర తీరాల్లో సీన్లను అందంగా కెమెరాలో బంధించాడు. ఎడిటింగ్, ఆర్ట్స్ ఇతర విభాగాలు ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి. సంగీతం విషయానికి వస్తే.. దేవీ శ్రీ ప్రసాద్ నిరాశపరిచాడనే చెప్పవచ్చు. కథలో విషయం లేకపోవడం వల్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. ఒకట్రెండు పాటలు ఒకే అనిపించాయి.
Recommended Video

ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే?
ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమా విషయానికి వస్తే.. పక్కా రొటీన్, ఫార్ములాతో రూపొందిన ఫ్యామిలీ జోనర్ సినిమా. బలమైన సన్నివేశాలు, భావోద్వేగం లోపించడం వల్ల రెగ్యులర్ సినిమా అనిపిస్తుంది. భారీ ప్రేక్షకాదరణ ఉన్న నటీనటులు ఉన్నప్పటికీ.. వారి రేంజ్ సరిపడినట్టుగా పాత్రలను డిజైన్ చేయలేకపోవడం సినిమాకు అత్యంత లోపంగా మారింది. తెలంగాణలో ఉన్న సినిమా టికెట్ రేట్ చూస్తే.. థియేటర్‌కు వెళ్లి రిస్క్ చేయడమే అనిపిస్తుంది. ఓటీటీలో వచ్చే వరకు వేచి చూస్తే... ఇంట్లోనే సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.


Click it and Unblock the Notifications











