Rathnam Movie Review రక్తపుటేరులు పారించిన రత్నం.. హరి, విశాల్ హిట్టు కొట్టారా? రత్నం సినిమా సమీక్ష
నటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, మురళీ శర్మ, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరీష్ పేరాడీ, తులసి తదితరులు
రచన, దర్వకత్వం: హరి
నిర్మాతలు: కార్తీకేయన్ సంతానం, అలంకార్ పాండ్యన్
సినిమాటోగ్రఫిం ఎం సుకుమార్
ఎడిటింగ్: టీఎస్ జయ్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2024-04-26
చిత్తూరు ఎమ్మెల్యే పన్నీర్ స్వామి (సముద్రఖని) అండతో అక్రమార్కులకు రత్నం (విశాల్) సింహ స్వప్నంగా మారుతాడు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటాడు. తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు గ్రామంలోని ఓ స్థలం వివాదంలో మల్లిక (ప్రియా భవానీ శంకర్)ను చంపేందుకు తమిళనాడుకు చెందిన లోకల్ మాఫియా లీడర్ లింగం (మురళీశర్మ) ముఠా ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో మల్లికను కాపాడేందుకు ప్రాణాలివ్వడానికి సిద్దమవుతాడు.

పన్నీర్ స్వామికి రత్నంకు ఉన్న బంధం ఏమిటి? చిన్నతనంలో రత్నంను ఎందుకు చేరదీస్తాడు? మల్లిక కుటుంబానికి సంబంధించి స్థలాన్ని ఎందుకు కాజేయాలని చూస్తాడు. ఆ స్థలానికి అవసరమైన డబ్బు ఇస్తామని చెప్పిన మల్లిక ఆ స్థలాన్ని ఎందుకు అమ్మడానికి నిరాకరిస్తుంది. మల్లికను చంపడానికి లింగం ఎందుకు ప్లాన్ చేస్తాడు? మల్లిక కోసం ప్రాణాలు ఇచ్చేంత భావోద్వేగం రత్నానికి ఎందుకు కలిగింది? లింగంకు రత్నంకు ఉన్న ఫ్యామిలీ రిలేషన్ ఏమిటి? ఇంతకు స్థల వివాదానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రత్నం సినిమా కథ.
రత్నం మూవీ పక్కా థర్డ్ క్లాస్ మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్న సినిమాగానే చెప్పుకోవాలి. ఎలాంటి లాజిక్ లేకుండా ఇంకా కత్తులతో తెరపైన రక్తపాతానికి హీరో ఒడిగట్టే కథలకు ఇంకా కాలం ఉందా అనే ఈ రోజుల్లో రత్నం రావడం జీర్ణించుకోలేని విషయం. ఇవన్నీ సినిమాకు మైనస్. సింగం, పూజ, భరణి లాంటి సినిమాలతో హిట్టు కొట్టిన హరి.. ఈ సినిమా విషయంలో ట్రాక్ మిస్ అయ్యాడనే చెప్పాలి.

రత్నం సినిమాను ఎమోషనల్‌గా మార్చడానికి చాలా సిస్టర్, మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్నప్పటికీ.. వాటి కంటే ఎక్కువగా హరి వయోలెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఈ సినిమా కథను బలహీన పరచింది. చివర్లో సెంటిమెంట్‌ను కథలోకి పట్టుకొచ్చే సరికి అప్పటికే ప్రేక్షకుడి సహనం నశించిపోవడంతో ఆ పాయింట్ పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించదు.

అయితే.. అత్యంత ముతక స్టోరిని కూడా విశాల్ తన ఫెర్ఫార్మెన్స్ నిలబెట్టిన తీరు అభినందనీయం. మాస్, ఎమోషనల్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ ఇలా రకరకాల కోణాలు ఉన్న పాత్రలో విశాల్ కేక పెట్టించాడు. భావోద్వేగమైన సన్నివేశాల్లో విశాల్ పెర్ఫార్మెన్స్‌లో హై మెచ్యురిటీ కనిపించింది. ఇక తన పాత్ర చుట్టు తిరిగే సినిమాలో ప్రియా భవానీ శంకర్ అద్బుతంగా నటించింది. కీలక సన్నివేశాల్లో చూపించిన హావభావాలు, నటన ఆకట్టుకొన్నది. లింగం పాత్రలో మురళీ శర్మ, పన్నీర్ స్వామి పాత్రలో సముద్ర ఖని మరోసారి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యోగిబాబు ఎప్పటిలానే సమయం చిక్కినప్పుడల్లా నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. దేవీ శ్రీ ప్రసాద్ పాటల పరంగా నిరాశపరిచాడనే చెప్పాలి. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. యాక్షన్ సీన్లు, రేసింగ్ సీన్లను చిత్రీకరించిన విధానం చూస్తే ఎం సుకుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్. సినిమా లెంగ్త్ విసిగిస్తుంది. సినిమా ఎండ్ కార్డు కోసం ప్రేక్షకులు ఎదురు చూడాల్సినంత ల్యాగ్ సెకండాఫ్‌లో ఉంది. కార్తీకేయన్ సంతానం, అలంకార్ పాండ్యన్ అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
రత్నం సినిమా 80, 90 దశకాల్లో వచ్చిన పక్కా ఫార్మూలా లాంటి సినిమా. పగ, ప్రతీకారం.. వందల మందిని అకారణంగా నరకడం తప్పా.. లాజిక్ కనిపించదు. యాక్షన్, మాస్ సినిమాలు చూసే వారికి నచ్చడానికి అవకాశం ఉంది. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులకు కనెక్ట్ అయితే తప్ప ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రతాపం చూపించే అవకాశాలు లేవు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెడుతాయా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











