twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయ నేపథ్యంలో మూస చిత్రం రవన్న

    By Staff
    |

    Ravanna
    -సౌమిత్‌
    ఏదో నాలుగైదు ఫైట్స్‌ , ఐదారు పాటల్ని తీసేసి ప్రేక్షకులపైకి వదిలేస్తే చాలు మన డబ్బులు మనకొస్తాయన్న నేపథ్యంలో కొంత రాజకీయాన్ని మిళితం చేసి ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేయాలని చేసిన వ్యర్ధ ప్రయత్నమే 'రవన్న' చిత్రం. అసలు కథ ఎత్తుగడలోనే లోపం ఉంది. రాజకీయ నాయకుడిని ఎంత గుడ్డిగా నమ్మినా స్వంత ఊరుకి, మనుషులకి ఆన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చునే కాలం కాదిది.

    ఎమ్మెల్ల్యే బుజ్జన్న (జయప్రకాష్‌ రెడ్డి)ని గుడ్డిగా నమ్మే మొరటోడు కొండల రవీంద్ర (రాజశేఖర్‌) బుజ్జన్నపై చేయి వేసిన వాళ్ల చేతిని నరికేంత అభిమానం. అతని కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనుకాడని మనస్థత్వం రవీంద్రది. ఇతని అభిమానాన్ని ఆసరాగా తీసుకున్న బుజ్జన్న కపట ప్రేమ నటిస్తూ తనకు బానిసగా చేసుకుంటారు. నిజాయితీ కలిగిన వారికే మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తూ బుజ్జన్న వంటి అవినీతి దూరంగా ఉంచుతాడు ముఖ్యమంత్రి. ఇదే సమయంలో కార్గి్‌్‌ పోరాటంలో చేతిని పోగొట్టుకున్న చౌదరి (కృష్ణ) ప్రభుత్వం ఇచ్చిన భూమి సాగుచేసుకోవడం కోసం చెల్లెలు శిరీష( సౌందర్య)తో కలిసి రవీంద్ర గ్రామానికి వస్తాడు.

    వీరి రాకతో చైతన్యవంతులైన గ్రామ ప్రజలు తమ కనీస అవసరాలైన నీరు, వెలుగు, చదువు కోసం సర్పంచ్‌ (ఎమ్మెస్‌ నారాయణ)ని నిలదీస్తారు. ఈ విషయం తెలిసిన బుజ్జన వారిపైకి రవీంద్రని ఉసిగొల్పుతాడు. వారిని ఊరి నుంచి వెళ్లగొట్టడానికి తనకు,శిరీషకు అక్రమ సంబంధం ఉందని నిరూపించబోయి కోర్టు మందలింపుతో ఆమెని పెళ్ళి చేసుకుంటాడు. ఇదే సమయంలో తాను ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడతానని రవీంద్రకు నూరిపోయడంతో ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తాడు రవీంద్ర.ఒక్క సారిగా మాటమార్చిన బుజ్జన్న రవీంద్రను, చౌదరి, శిరీషల్ని తీవ్రవాద సంస్థ సభ్యులుగా ఆరోపిస్తూ వారు ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసి చంపారని చెబుతాడు. చంపబోయిన బుజ్జన్న మనుషుల బారి నుంచి ముఖ్యమంత్రిని కాపాడిన రవీంద్ర నిజాల్ని తెలుసుకోవడంతో కథ క్లయిమాక్స్‌కు చేరుతుంది. సుదీర్ఘమైన పోరాటానంతరం విలన్స్‌ని రూపుమాపి రవీంద్ర కూడా మరణించడంతో సినిమా ముగుస్తుంది.

    సినిమాలో చెప్పుకోవాల్సినవేమైనా ఉంటే నిర్మాత రాజీపడని తత్వం, అక్కడక్కడా తూటాల్లా పేలిన పోసాని డైలాగ్స్‌ గురించి చెప్పుకోవాలి. హీరో కృష్ణ పాత్రకు ద్వితీయార్ధంలో ప్రాధాన్యత లేకపోవడంతో తేలిపోయింది. రాజశేఖర్‌కు ఈ తరహా పాత్రలు కొట్టిన పిండే. సౌందర్య పాత్ర పరిధి కూడా అంతంత మాత్రమే. ఉన్నంతలో బాగానే చేసింది. రాజకీయ నేపథ్యాల్ని ఎంపిక చేసుకున్నప్పుడే సమకాలీన రాజకీయాల్ని అవగాహన చేసుకోవాలి. ఈ రోజున ఏమారు మూల ప్రాంతానికి వెళ్లినా రాజకీయ చైతన్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని మర్చిపోయి ప్రజల్ని అనుభవ శూన్యులుగా చిత్రీకరిస్తే జీర్ణించుకునే స్థితిలో ప్రేక్షకులు లేరు. ఎంత రౌడీలు, గూండాలు అయినా తమ సామ్రాజ్య విస్తరణలో భాగంగా ప్రజల మెప్పు పొందటానికి ,వారి అభిమానాన్ని సంపాదించుకోవడానికి కృషి చేస్తున్న రోజులివి. కథకుడు పోసాని ఈ విషయాన్ని మర్చిపోయి కథను రూపొందించారు.

    దర్శకుడు బి.గోపాల్‌ హడావుడి చేసి భారీ చిత్రాల దర్శకుడిగా ఉన్న పేరు నిలబెట్టుకోవాలని తపన పడ్డట్టు ఉందే తప్ప స్క్రీన్‌ప్లే విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోకుండా నేల విడిచి సాము చేసినట్లు ఉంది. ఖర్చుపెట్టే నిర్మాత చేతిలో ఉన్నాడు కదా అని యాక్షన్‌ సన్నివేశాల్ని బ్లాస్టింగ్స్‌తో కార్లని గాలిలోకి లేపడం, పాటల్ని విదేశాల్లో తీయడం వంటి ప్రయత్నాలు చేసినట్లు ఉందే తప్ప కథని దృష్టిలో పెట్టుకున్నట్లు కనపించదు. ఇక సంగీతం విషయానికి వస్తే రాజ్‌కుమార్‌ చక్కగా అన్నీ కాపీ ట్యూన్స్‌ అందించి ఎంత అన్యాయం చెయ్యాల్లో అంతా చేశారు. సినిమా హిట్‌ అవ్వాలంటే తన వంతుగా తాను కృషి చేయాలనే తపన ఆయనలో ఉన్నట్లు కనిపించలేదు. ఒక వేళ బిజీగా ఉంటే తన వల్ల కాదని తప్పుకోవాలి కానీ కాపీ ట్యూన్స్‌ ఇచ్చి నిర్మాతల జీవితాలతో ఆడుకోకూడదు. ఇటువంటి పొరపాట్లు మరలా చేయకుండా ఉండాలని కోరుకోవడం తప్ప మరేం చేయలేం. సినిమా చూడాలని వచ్చే ప్రేక్షకులకి ఆహ్లాదాన్ని అందించడం మాట అటుంచి ఉన్న ఆహ్లాదాన్ని పోగొడుతుంది ఈ చిత్రం

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X