twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎమోషన్‌ కు డివోషన్‌జోడి

    By Staff
    |

    Rayalaseema Ramanna Chowdary
    చిత్రం: రాయలసీమ రామన్నచౌదరి
    నటీనటులు: మోహన్‌ బాబు, జయసుధ, ప్రియాగిల్‌,
    అచ్యుత్‌, ప్రేమ, జయప్రకాష్‌ రెడ్డి, నర్రా కథ: అరుణాచలం యూనిట్‌
    మాటలు: పరచూరి బ్రదర్స్
    కెమెరా: జయరాం
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: మోహన్‌ బాబు
    దర్శకత్వం: సురేష్‌ కృష్ణ

    రాయలసీమ రామన్న చౌదరి అని టైటిల్‌ వినగానే రాయలసీమ ఫ్యాక్షన్‌ కు సంబంధించిన స్టోరీ అనకుంటే పొరపాటే. పగ, భూమికి సంబంధించిన తగాదాల వంటి కథకు దైవభక్తి జోడించి తీసిన చిత్రం ఇది. మోహన్‌ బాబుకు ఇది 500వ చిత్రం. వరుసగా ఫ్లాప్‌ లతో ఇమేజ్‌ తగ్గిపోయిన మోహన్‌ బాబు మళ్ళీ పెదరాయుడు లాంటి హిట్‌ ఇచ్చేందుకు ఇలాంటి ప్యూడల్‌ కథను ఎన్నుకున్నారనేది సుస్పష్టం. ఆయన మిత్రుడు రజనీకాంత్‌ దీనికి కథ అందించడం విశేషం.

    రాయలసీమ రామన్నచౌదరి(మోహన్‌ బాబు) అంటే ఊరి వారందరికీ హడలు. రామన్నచౌదరి భార్య జయసుధ. వారిద్దరికి ఇద్దరు కొడకులు. పెద్ద కుమారుడు మోహన్‌ బాబు(సెకండ్‌ రోల్‌). రెండో కుమారుడు అచ్యుత్‌. తన పాదం పెట్టిన ప్రతిస్థలాన్ని స్వంతం చేసుకోవడం రామన్నచౌదరి అలవాటు. నర్రా వెంకటేశ్వరరావు, జయప్రకాష్‌ రెడ్డి, పహిల్వాన్‌ ల స్థలాన్ని తప్ప ఊరు చుట్టుపక్కల స్థలాలన్నింటిని కాజేస్తాడు. నర్రా, పహిల్వాన్‌ ల భూములను కూడా చేజిక్కించుకొని జయప్రకాష్‌ రెడ్డి భూములను ఆక్రమించుకునేందుకు రామన్నచౌదరి ప్రయత్నిస్తాడు. అయితే జయప్రకాష్‌ రెడ్డి తెలివిగా తన పొలంలో గుడి కట్టించి పొలం మొత్తాన్ని దేవాలయం పేరిట రాయడంతో చౌదరికి తొలి పరాజయం ఎదురవుతుంది.

    గుడిని కూలగొట్టి అక్కడ రోడ్డు వేసేందుకు చౌదరి ప్రయత్నిస్తాడు. రామన్న చౌదరి ఇంట్లో ఉన్న శివలింగాన్ని కూలగొడితే గుడిని కూలగొట్టేందుకు ఒప్పుకుంటానని జయప్రకాష్‌ రెడ్డి మెలిక పెడతాడు. దాంతో రామన్న చౌదరి శివలింగాన్ని పెకలించి చెరువులో విసిరేస్తాడు. స్థానిక పూజారి దీనికి ఆగ్రహించి చౌదరిని శపిస్తాడు. శివలింగాన్ని పున:ప్రతిష్ఠ చేయకపోతే వంశం నిర్వీర్యం అవుతుందని శపిస్తాడు. ఆ తర్వాత భార్య చనిపోవడం మనవడు ప్రాణాపాయ స్థితిలో ఉండడం, కొడుకు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడటం వంటి వరుస సంఘటనలతో చౌదరికి పరివర్తన కలుగుతుంది. శివలింగాన్ని తిరిగి ప్రతిష్టించి తను ప్రాణాలిడవటంతో చిత్రం ముగుస్తుంది.

    కథ కన్నా మోహన్‌ బాబు డైలాగ్‌ లు, మేనరిజమ్స్‌ ఆకట్టుకుంటాయి. పెదరాయుడులో రజనీకాంత్‌ తరహాలో మోహన్‌ బాబు గెటప్‌ బావుంది. రెండో పాత్ర కేవలం పాటలకే పరిమితం. సినిమా చూస్తున్నంత సేపు కట్టిపడే అంశం బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌. నేపథ్యసంగీతం తప్ప పాటలు క్యాచీగా కంపోజ్‌ చేయడంలో మణిశర్మ శ్రద్ద వహించలేదు. ప్రియాగిల్‌ తెలుగులో నటించడం శుద్ద దండగని మరోసారి తేలింది. దర్శకుడు సురేష్‌ కృష్ణ సెకండ్‌ హాఫ్‌ విషయంలో శ్రద్ద వహించే ఉంటే బావుండేది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X