Razakar Review రజాకార్ల అకృత్యాలుపై పటేల్ సైనిక చర్య హైలెట్‌గా.. రజాకార్ మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే తదితరులు, రాజ్ అరుణ్, జాన్ విజయ్, తలైవసల్ విజయ్, తేజ్ సప్రూ, రవి ప్రకాశ్, దేవీ ప్రసాద్, మహేష్ ఆచంట, నాగ మహేష్ తదితరులు
బ్యానర్: సమర్ వీర్ క్రియేషన్స్
దర్శకత్వం: యాటా సత్యనారాయణ
నిర్మాత: గూడూరు నారాయణ రెడ్డి
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫి: కుషేందర్ రమేష్ రెడ్డి
ఎడిటింగ్: తమ్మిరాజు
క్యాస్టూమ్స్: పూజా వంగల
రిలీజ్ డేట్: 2024-03-15
భారత దేశానికి ఆగస్టు 15, 1947 రోజున స్వాతంత్ర్యం సిద్దించినప్పటికీ.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ దానిని అమలు చేయలేదు. స్వతంత్ర పాలనలో ప్రైవేట్ సైన్యం రజాకార్లతో క్రూరమైన, దౌర్బాగ్యకర పరిస్థితుల్లో పాలన కొనసాగించింది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్‌ను బూచిగా చూపించి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇస్లాం మత వ్యాప్తి, తురకిస్థాన్ లక్ష్యంగా పాలన చేశాడు. నిజాం రాజుకు సైనికాధికారిగా ఖాసీం రజ్వి ఎన్నో దురాగతాలకు, హిందూ మహిళలపై అరాచకాలు కొనసాగించడంతో భారత ప్రభుత్వం, ప్రధాని నెహ్రూను ఎదురించి హోం మంత్రి పటేల్ హైదరాబాద్ స్టేట్‌పై సైనిక చర్యకు పూనుకొంటాడు.

హిందువులను ముస్లింగా మార్చేందుకు ఖాసిం రజ్వీ దుర్మార్గాలు ఏమిటి? స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏమిటి? నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, షోయబుల్లా ఖాన్ లాంటి వారిని కిరాతకంగా ఎలా చంపారు? ఖాసీం రజ్వీ పాకిస్థాన్‌తో ఎలా చేతులు కలిపాడు? హిందువులపై ఖాసిం రజ్వీ చేసిన దురాగతాలపై మీనన్ కేంద్రానికి ఎలాంటి సమాచారం అందించాడు. లాయక్ అలీ, ఖాసీ రజ్వీ ఆగడాలకు చెక్ చెప్పడానికి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో ఎలా జరిగింది? చివరకు ఏడో నిజాం ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వంలో హైదరాబాద్ స్టేట్‌ను విలీనం చేశాడు? పాకిస్థాన్‌కు పారిపోవాలనుకొన్న ఖాసీ రజ్వీ పరిస్థితి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే రజాకార్.
భారతీయ సినిమా పరిశ్రమలో హైదరాబాద్ విమోచన ఘట్టాన్ని పక్కాగా చూపించిన సినిమాలు చాలా తక్కువ. అయితే పలు రకాల పరిశోధనలు, అధ్యయనాలు చేసి కథ రాసుకొన్న దర్శకుడు యాటా సత్యనారాయణను అభినందించాల్సిందే. అయితే దర్శకుడు కొన్ని పరిస్థితులకు తలవొగ్గి వాస్తవాలను చెప్పడంలో విఫలమయ్యాడు. కమ్యూనిస్టుల పోరాటాన్ని కించపరిచేలా మాట్లాడటం వివాదాస్పదమైన అంశంగా కనిపిస్తుంది. ఇలాంటి విషయాలు తప్పిస్తే.. అద్బుతమైన సీన్లు, టేకింగ్, విజువల్ సెన్స్‌తో దర్శకుడు చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించాడు.
భారత స్వాతంత్ర్యం, హైదరాబాద్ స్టేట్ చరిత్రను ఆవేశపూరితంగా వాయిస్ ఓవర్‌తో కథను చెబుతూ చాకలి ఐలమ్య ఓ పవర్‌పుల్ ఎపిసోడ్‌తో సినిమా కథలోకి దర్శకుడు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. నిజాం అకృత్యాలు, మహిళలపై మానభంగాలు, హిందువులను ముస్లిం మతంలోకి మార్పిడి తదితరల అంశాలను కళ్లకట్టి చూపించడంతోపాటు ప్రేక్షకుల్లో ఉద్వేగం, భావోద్వేగాన్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో సఫలమయ్యాడు. రజాకార్ల హింస వైపు.. పటేల్, మీనన్, మున్షీల మధ్య సీన్లను నడిపించిన విధానం దర్శకుడు ప్రతిభకు అద్దం పట్టాయి.

సెకండాఫ్‌లో అనుసరించిన స్క్రీన్ ప్లే సినిమాకు బలంగా మారింది. అయితే మితీమీరిన హింసను తగ్గించి.. ఇంకా ఎమోషన్స్, డ్రామాను కథలోకి తీసుకొచ్చినట్లయితే ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ ఘటన, రావి నారాయణరెడ్డి పోరాటం లాంటి సీన్లు గూస్ బంప్స్ తీసుకొస్తాయి. ఖాసీ రజ్వీ దురాగతాలు, హైదరాబాద్ విమోచనం, పటేల్ అనుసరించిన సైనిక చర్య విషయం నేటి తరాలకు తెలియని ఓ మరుగున పడిన చరిత్ర. ఆ విషయాన్ని ప్రపంచాన్ని చెప్పాలనే ప్రయత్నం నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయిందనే చెప్పాలి.
రజాకార్ సినిమాలో పాత్రలను అద్బుతంగా డిజైన్ చేశారు. తెర మీద కనిపించిన క్యారెక్టర్లు నటించాయనే కంటే.. జీవించాయనే చెప్పాలి. ఖాసీం రజ్వీ (రాజ్ అర్జున్) పాత్ర బిహేవ్ చేసిన విధానం, చూపించిన యాటిట్యూడ్ సినిమాకు మరింత బలంగా మారింది. నిజాం రాజుగా మకరంద్ దేశ్ పాండే నటించిన తీరు చాలా బాగుంది. పోరాట యోధుడిగా బాబీ సింహా, లాయక్ అలీగా జాన్ విజయ్ తమ పాత్రలో ఫీలింగ్స్, హావభావాలు అద్బుతంగా పలికించారు. పటేల్‌గా తేజ్ సప్రూ, మీనన్‌గా థలైవసల్ విజయ్, నిజాం భార్యగా అన్నుసురియా త్రిపాఠి, ఐలమ్మగా ఇంద్రజ, ప్రేమ, వేదిక తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక విషయాలకు వస్తే.. చాలా రిచ్‌గా సినిమాను రూపొందించడంలో సాంకేతిక నిపుణుల పనితీరు బ్రహ్మండంగా ఉంది. ఈ సినిమాకు ప్రాణం భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమా సన్నివేశాలను హై లెవల్‌లో ఎలివేట్ చేయడంతోపాటు పలు చోట్ల రోమాలు నిక్కబొడిచేలా చేశాయి. సినిమాటోగ్రఫి మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా క్యాస్టూమ్ డ్రామా. పాత్రలకు తగినట్టుగా పూజా వంగల రూపొందించిన దుస్తులు, స్టైలింగ్ సినిమాను మరింత క్వాలిటీగా మార్చాయి. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు చాలా బాగుంది. గూడూరు నారాయణ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు అత్యంత ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచాయి.
సమాజం కులం, మతం, ప్రాంతాలు మధ్య విద్వేషాలు రగలుతున్న ప్రస్తుతం పరిస్థితుల్లో జాతిని ఏకం చేసే ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఎజెండాలకు తావు ఇవ్వకుండా నిజాయితీగా చెప్పినప్పుడే ఆ ఫలితం, ప్రయోజనం ఒనగూరుతుంది. పార్టీల వ్యక్తిగత ప్రయోజనాలు జొప్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాయుధ పోరాటానికి నిలుటద్దంగా నిలిచిన కమ్యూనిస్టుల చరిత్రను ప్రత్యక్షంగా చూపించకుండా.. వారిని నిందించడానికి ఉపయోగించిన డైలాగ్స్ చూస్తే ఏదో ఎజెండా ఉందనే చరిత్ర తెలిసిన వారికి ఓ ఫీలింగ్ కలుగుతుంది. రజాకార్లను ఎదురించడం, లక్షలాది మంది ప్రజల త్యాగాలకు ఏమాత్రం సంబంధం లేని గుజరాత్ నాయకులకు క్రెడిట్ ఇచ్చేలా, గుజరాత్ ఎజెండాను ఇంప్లిమెంట్ చేసేలా, ఓ పార్టీ ప్రయోజనాలను పెంపొందించారనే విమర్శలు పక్కన పెడితే.. రజాకార్ చిత్రం భావి తరాలకు స్పూర్తిని కలిగించే చిత్రం. జాతి ఐక్యతకు, మత సామరస్యాన్ని పెంపొందించే చిత్రంగా కనిపిస్తుంది. అద్బుతమైన సన్నివేశాలు, టేకింగ్, అత్యున్నత ప్రమాణాలతో రూపొందించిన ఈ సినిమా తప్పకుండా ఓ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్. ఈ సినిమాను థియేటర్‌లోనే చూడండి...


Click it and Unblock the Notifications











