»   »  గమ్యం చేరని 'పరుగు'

గమ్యం చేరని 'పరుగు'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Parugu
-జోశ్యుల సూర్య ప్రకాష్
నటీనటులు:అల్లు అర్జున్,షీలా,ప్రకాష్ రాజ్,పూనం బజ్వా ,సునీల్,
సుబ్బరాజు,జయసుధ,శ్రీనివాసరెడ్డి,చిత్రం శ్రీను,జీవా తదితరులు
సంగీతం: మణి శర్మ
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్
సంభాషణలు: బివిఎస్ రవి
సినిమాటోగ్రఫి: విజయ్ చక్రవర్తి
కథ,స్కీన్ ప్లే ,దర్శకత్వం :భాస్కర్
నిర్మాత :రాజు

పెద్దలకి తెలిస్తే ఒప్పుకోరని ప్రేమించిన అమ్మాయిని లేవదీసుకు పోయే కుర్రాళ్ళదా తప్పు లేక వారి ప్రేమను గుర్తించని తల్లితండ్రులదా తప్పు అనే సమకాలీన సామాజిక సమస్యను చర్చిస్తూ సాగిన చిత్రం పరుగు.పండుగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఈ రోజు ఉదయం ఆటతో రాష్ట్రమంతటా 234 ప్రింట్లతో రిలీజయింది. దేశముదురు తర్వాత అల్లు అర్జున్ అంతకు మించి ఎనర్జీతో నటించిన ఈ సినిమా స్క్రిప్టు లోపాలతో సెకండాఫ్ సాగి పరుగు తగ్గింది.

ఓ పల్లెటూరు పెద్దాయన(ప్రకాష్ రాజ్) పెద్దకూతురు (పూనం బజ్వా) పెళ్ళి జరుగుతూంటూంది. కాస్సేపటికి ఆమె తన ప్రియుడు(ఆ ఊరిలో పొలం పనులు చేసుకుని బ్రతికే కుటుంబంలోని కుర్రాడు) తో జంప్. దాంతో హర్ట్ అయిన ఆమె తండ్రి కూతురు కోసం వేట ప్రారంభిస్తాడు. ఆ కుర్రాడి ప్రెండ్స్ ని తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేస్తాడు. వాళ్ళలో కృష్ణ (అల్లు అర్జున్) అనే హుషారైన హైదరాబాద్ కుర్రాడుంటాడు. అతను ఈ హడావిడిలో పెద్దాయన మరో కూతురు మీనా(షీలా) తో ప్రేమలో పడతాడు. ఆమెని లేపుకు పోదామనుకుంటాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకుందా? అసలే కోపంలో ఉన్న పెద్దాయన ఈ సారేం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే.

పాయింట్ ఈ మధ్య వచ్చిన 'జల్సా' ని గుర్తు చేస్తే కథనం 'ప్రేమిస్తే' ని ఫాలో అవుతుంది. నిజానికి 'పరుగు' కథ పాయింట్ చాలా బాగున్నా ట్రీట్ మెంట్ లోపంతో కుదేలయింది. పిల్లలు లేచిపోతే బాధ పడే పెద్దలు కథో లేక ప్రేమించినవాళ్ళని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి అనే కధో స్పష్టం కాకుండా కధనం నడుస్తుంది. బొమ్మరిల్లు లో మొదటి సీనులోనే సమస్య చూపి కథ లోకి వచ్చిన భాస్కర్ దీనిలో హీరోని ప్రి క్లైమాక్స్ దాకా సమస్య లోకి పడెయ్యడు. అదే ప్రధాన లోపం . అంతేగాక ప్రకాష్ రాజ్ పాత్ర సమస్య తరువాత సమస్యలో పడుతూ (పెద్ద కూతురు ఒకరితో వెళ్ళి పోయిందని తెరుకునే లోపే రెండో కూతురు అదే దారిలో నడవబోతోందని తెలియటం) సానుభూతి సంపాదించుకుంటూ హీరోని దాటి ఎదిగిపోయింది. అల్లు అర్జున్ పాత్ర ఎంతసేపు తన ప్రకాష్ రాజ్ కూతురుని తీసుకుని వెళ్ళి పోయిన స్నేహితుడుకి సాయం చేస్తూ నెగిటివ్ ఇంప్రెషన్ పొందుతాడు. అలాగే ఇంట్రవెల్ దగ్గరకు వచ్చేసరికి హీరోకి సమస్యలో పడబోతున్నానని అర్ధమవుతుంది గాని సమస్యలో భౌతికంగా పడడు. దాంతో సమస్యలో పడని హీరోని ఫాలో చేస్తున్న ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది. ఇక హీరోయిన్ పాత్రలో సృష్టత కనపడదు. అక్క ప్రేమను సపోర్టు చేసిన ఆమె ఎప్పుడు డైలమాలో ఉన్నట్లు మాట్లాడుతుంది. రవి డైలాగులు కొన్నిచోట్లే పేలాయి. పల్లె లో చూపిన అపానవాయువు, మూత్ర విసర్జన సీన్లు చూడటానికి అసహ్యంగా ఉన్నాయి. పాటల ప్లేస్ మెంట్లు కరెక్టుగా పడలేదు. అలాగే కథకు సంభంధం లేని ఫైట్ సీను అనవసరమనిపిస్తుంది. అలాగే జయసుధ పాత్ర హీరోతో "ఆ అమ్మాయే నా కోడలు, తీసుకురా!" అని చెప్పటం తేజ సినిమాల పార్మెట్ ని అనుసరించి నవ్వులపాలైంది.

ఇలా ఇన్ని స్కీన్ ప్లే లోపాలున్నా ఫస్టాఫ్ లో ఒకే ఇంటిలో సీన్లు ఫన్నీగా నడపటం భాస్కర్ కే సాధ్యం అనిపించాడు. అలాగే మణిరత్నం 'దిల్ సే' ని గుర్తు చేస్తూ హీరో లవ్ ఎట్ పస్ట్ సైట్ సీన్ పొగ మంచులో చూపటం చాలా బాగుంది. అలీ కామిడి ద్వారా సినిమా కాన్సెప్ట్ మొత్తం వివరించటం స్కిప్టు పరంగా మరో గ్రేట్.సెకాండాఫ్ లో వచ్చే ప్రకాష్ రాజ్ తాగి అల్లు అర్జున్ తో తన బాధ చెప్పుకోవటం సన్నివేశం తెలుగు సినిమాల్లో అరుదుగా మంచి ఎమోషనల్ సీను. "నమ్మవేమో, హృదయం "అంటూ సాగే పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్ ఎప్పటి మణిశర్మ సినిమాల లాగే బాగుంది. ముఖ్యంగా కెమెరా కొన్ని సీన్లలో(పొగ మంచు వాతావరణం) అద్భుతాలు చూపించింది.దర్శకత్వం అద్భుతం కాకపోయినా చాలా మంది కన్నా మేలనిపిస్తుంది.

యేదైమైన దాదాపు మూడు గంటలు నిడివి ఉన్న ఈ సినిమా అరగంట వరకు ట్రిమ్ చేయవచ్చు.పాటలకోసం,అల్లు అర్జున్ డాన్స్ ల కోసం ఈ సినిమా చూడచ్చు. ఫ్యామిలీలకు పడితే నిలబడుతుంది. యూత్ ని ఆకట్టుకోవటం కష్టమే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X