twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూమ్‌మేట్స్‌

    By Staff
    |

    Room Mates
    సినిమా: రూమ్‌మేట్స్‌
    విడుదల తేదీ: 11-08-2006
    నటీనటులు: అల్లరి నరేశ్‌, బాలాదిత్య, శ్రీనివాసరెడ్డి,
    సుమన్‌శెట్టి, నవనీత్‌ కౌర్‌, నాజర్‌, నరేశ్‌, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం,
    నాగబాబు, రఘుబాబు, అలీ, గుండు, ఎల్‌బి శ్రీరామ్‌ తదితరులు.
    కెమెరా: వి. శ్రీనివాసరెడ్డి
    సంగీతం: మణిశర్మ
    స్క్రిప్ట్‌ : కృష్ణేశ్వరరావు, త్యాగరాజు
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఏవిఎస్‌
    నిర్మాణం: వై. సోనియా రెడ్డి

    విసు ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత నిర్మాత అనేసరికి ఆయనకి కథలు చెప్పేవారంతా కుర్రాళ్లు, కెరీర్స్‌ నేపథ్యాన్నే ఎంచుకుంటున్నట్టు తోస్తుంది. గౌతమ్‌ ఎస్‌.ఎస్‌.సి. తర్వాత విసు ఫిలింస్‌ తీసిన రూమ్‌మేట్స్‌ చిత్రం కూడా అణాకానీకి పనికిరాని నలుగురు కుర్రాళ్లు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారనే ఇతివృత్తంతో నడుస్తుంది.

    మొదటి మూడు సినిమాల చేదు అనుభవం నుంచి దర్శక, నటుడు ఏవిఎస్‌ మొత్తానికి బయటపడినట్టు చెప్పవచ్చు. ఏవిఎస్‌ దర్శకత్వంలో విసు సంస్థల అధినేత సిసి రెడ్డి నిర్మించిన రూమ్‌మేట్స్‌ చిత్రం పాత కథే అయినా కొత్త కథనంతో కొంత ఫ్రెష్‌గా కనిపిస్తుంది. దర్శకుడిగా ఏవిఎస్‌ పూర్తిస్థాయిలో తన శక్తినంతా ధారపోసి ఈ చిత్రాన్ని రూపొందించారు. కథని పట్టుగా కొనసాగించడం కోసం ఆయన ఈ సినిమాలో ప్రేమ, క్రైమ్‌, సంగీతం, కామెడీ సమపాళ్లలో కలిపారు. ఆయనకు యువ నటుల నుంచి కూడా చక్కని సహకారం లభించింది. ఇంతవరకు ఐటెం సాంగులకు, గ్లామర్‌ పాత్రలకే పరిమితం అయిన నవనీత్‌ కౌర్‌ హీరోయిన్‌గా చక్కని నటన ప్రదర్శించి మెప్పించింది. సినిమా మొత్తం ఆసక్తిరేకెత్తించే సస్పెన్స్‌ నడపడంలో దర్శకుడు ఏవిఎస్‌ కొంతవరకు బెటర్‌ అనిపించుకున్నారు.

    నలుగురు కుర్రాళ్లు ఒక పల్లెటూరి నుంచి బతుకుతెరువు వెతుక్కుంటూ పట్నం రావడం కథారంభం. రామకృష్ణ (అల్లరి నరేశ్‌) ఒక పూజారిగారి అబ్బాయి. శేఖర్‌ (బాలాదిత్య) అనాథ. శేషు (శ్రీనివాసరెడ్డి), బంటీ (సుమన్‌శెట్టి) భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వారు. రామకృష్ణ ఫ్లూటు వాద్యగాడు, శేఖర్‌ మృదంగం, బండీ కీబోర్డ్‌ స్పెషలిస్టు, ఇంక శేషు గిటారిస్టు.

    దుబాయ్‌లో ఉద్యోగం అని తలో రెండు లక్షల రూపాయల్ని నలుగురు నుంచి వసూలు చేసి నరసింహా అనే వ్యక్తి టోకుగా నలుగురినీ ముంచేస్తాడు. ఆ బాధతో ఆత్మహత్యలు చేసుకోవాలని నలుగురూ ప్రయత్నించే సందర్భంలో పల్లవి (నవనీత్‌ కౌర్‌) తారసపడుతుంది. ఈవెంట్‌ మేనేజర్‌ అయిన పల్లవి ఆ నలుగురి జీవితాల్లో ప్రవేశిస్తుంది. వారిలో ఉత్సాహం రేకెత్తిస్తుంది. ఉద్యోగం వేటలో విఫలమై దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్లని ప్రఖ్యాత గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఒక సందర్భంలో కలిసి వాళ్ల టాలెంట్‌ పసిగట్టి ప్రోత్సహిస్తారు. వాళ్ల కోసం ఒక మ్యూజిక్‌ కన్సర్ట్‌ కూడా ఏర్పాటు చేస్తారు. సరిగ్గా అదే సమయంలో పల్లవి, రామకృష్ణ కూడా ప్రేమలో పడతారు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో సడెన్‌గా (వాళ్లని మోసం చేసిన) నరసింహ హత్యకు గురవుతాడు. ఆ హత్య కేసు ఈ నలుగురిపై పడటంతో నలుగురూ జైలు పాలవుతారు.

    అక్కడ జైలర్‌ భార్గవ (నాజర్‌) ఈ నలుగురు కుర్రవాళ్లనీ జైలు నుంచి పారిపోయేందుకు సహకరిస్తాడు. ఖైదీలు పారిపోయిన కేసును పరిశోధించేందుకు హోమ్‌ మంత్రి (నాగబాబు) పోలీస్‌ ఆఫీసర్‌ శరత్‌ చంద్ర (నరేశ్‌)ని నియమిస్తాడు. వాళ్లంతా నవనీత్‌ కౌర్‌ ఇంట్లో ఆశ్రయం పొందమని చెప్పి, వాళ్లని రిటైర్డ్‌ హైకోర్ట్‌ న్యాయమూర్తి (సుబ్బరాయశర్మ) దగ్గరకి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని జైలర్‌ భార్గన నమ్మిస్తాడు. వాళ్లు నలుగురూ రిటైర్డ్‌ జడ్జ్‌ ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఆయన కూడా హతుడై ఉంటాడు. అదే సమయంలో ఇన్‌స్పెక్టర్‌ శరత్‌ చంద్ర కూడా వీళ్లని పట్టుకుంటాడు. అయితే ఈ కేసు నుంచి వాళ్లెలా బయటపడ్డారు, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, హోమ్‌ మంత్రి సహాయంతో వాళ్ల సంగీత కచేరి ఎలా పూర్తి చేశారు అనేది మిగతా కథాంశం.

    నలుగురు కుర్రాళ్లు.. నరేశ్‌, బాలాదిత్య, శ్రీనివాసరెడ్డి, సుమన్‌శెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు. నవనీత్‌ కౌర్‌ హోమ్లీగా మంచి పాత్ర చేసింది. ప్రత్యేక పాత్రలో జీవా అలరిస్తాడు. అతనే హంతకుడని ప్రేక్షకులకు సందేహం కలిగించినా చివరకు అసలు హంతకుడు ఎవరో తేలుతుంది. మిగతా అంతా సీనియర్‌ నటులే. చిత్రం ప్రథమార్ధం సాఫీగా నడిచి, ఇంటర్వెల్‌లో ఆసక్తికరమైన మలుపుతో ముగుస్తుంది. అయితే ద్వితీయార్థం మాత్రం సాగదీసినట్లు తోస్తుంది.

    నలుగురు కుర్రాళ్ల కెరీర్‌నీ, మర్డర్‌ మిస్టరీతో జోడించి ఏవిఎస్‌ కథనం నడిపించారు. విసు ఫిలింస్‌ ప్రొడక్షన్‌ విలువలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి ప్రధానంగా మైనస్‌ పాయింట్‌ ఏంటంటే రిపీట్‌ ఆడియెన్స్‌ ఉండరు. కథాకథనంలో నావెల్టీ లోపించింది. ఎంచుకున్న కథ వరకూ న్యాయం జరిగిందంతే! ఒకసారి చూడచ్చు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X