Rudrangi Review బాహుబలి ఫ్లేవర్‌తో రుద్రంగి మూవీ.. తెలంగాణ దొరల అకృత్యాలు.. గడి సంస్కృతి నేపథ్యంగా!
Rating: 3/5
నటీనటులు: జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశీష్ గాంధీ, గనవి లక్ష్మణ్, దివి వద్యా, రసమయి బాలకిషన్, సదయ్య రాదండి తదితరులు
దర్శకత్వం: అజయ్ సామ్రాట్
నిర్మాత: డాక్టర్ రసమయి బాలకిషన్
సినిమాటోగ్రఫి: సంతోష్ శనమోని
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
సంగీతం: నాఫల్ రాజా ఏఐఎస్పి
పీఆర్ వో: జి.ఎస్. కె మీడియా
రుద్రంగి గ్రామ ప్రజలు భీమ్ రావు దేశ్‌ముఖ్ (జగపతి బాబు) కనుసన్నల్లో భయం, భక్తితో జీవితాన్ని కొనసాగిస్తుంటారు. స్త్రీ లోలుడైన భీమ్ రావు అకృత్యాలను, అన్యాయాలను మౌనంగా సహిస్తుంటారు. భార్య మీరా భాయ్ (విమలా రామన్) ఉండగానే.. రెండో భార్యగా జ్వాలాభాయ్ దేశ్‌ముఖ్ (మమతా మోహన్ దాస్)ను స్వీకరిస్తాడు. ఇక తిరుగులేదనుకొనే భీమ్ రావుకు ప్రత్యర్థి భూస్వామి భుజంగ రావు (కాలకేయ ప్రభాకర్) పోటీ పాలనతో ఎదురిస్తుంటాడు. ఇదిలా ఉండగా, మల్లేష్ (ఆశీష్ గాంధీ), రుద్రంగి (గనవి లక్ష్మణ్)కు బాల్యంలోనే వివాహం అవుతుంది. భుజంగరావు చేతిలో మల్లేష్ కుటుంబం చనిపోతారు. భుజంగ రావుపై పగతో మల్లేష్ రగిలిపోతుంటాడు. ఆ క్రమంలో మల్లేష్‌ను భీమ్ రావు చేరదీస్తాడు. అయితే చిన్నతనంలో మల్లేష్ పెళ్లి చేసుకొన్న రుద్రంగిపై భీమ్ రావు మనసు పారేసుకొంటాడు.

రుద్రంగి ప్రాంతాన్ని రాజు మాదిరిగా పాలిస్తున్న భీమ్ రావుకు భుజంగ రావుకు మధ్య వైరం ఏమిటి? భుజంగరావును భీమ్ రావు ఎలా శిక్షించాడు? మల్లేశంను భీమ్ రావు ఎలా చేరదీశాడు? భుజంగ రావుపై ఉన్న పగను మల్లేశం ఎలా తీర్చుకొన్నాడు. భార్య మీరా భాయ్ ఉండగానే రెండో భార్యగా జ్వాలా భాయిని ఎందుకు స్వీకరించాడు? రుద్రంగిపై భీమ్ రావు మనసు పారేసుకోవడంతో మల్లేష్ ఎలా స్పందించాడు. మల్లేశంపై భీమ్ రావు రెండో భార్య జ్వాలా భాయి ఎందుకు మోజుపడింది? తన భార్యను భీమ్ రావుకు మల్లేశ్ అప్పగించాడా? భీమ్ రావు పరిస్థితి చివరకు ఏమైంది. మల్లేష్, రుద్రంగి ఒక్కటయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే రుద్రంగి సినిమా కథ.
రుద్రంగి సినిమా మల్లేష్, రుద్రంగి బాల వివాహంతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. భుజంగరావు అకృత్యాలు, ఆ తర్వాత భీమ్ రావు పాత్రల ఎంట్రీతో కథ జోష్‌గా సాగుతుంది. స్త్రీలపై మోజుపడే భీమ్ రావు బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ కొత్తగా డిజైన్ చేయడంతో సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. జ్వాలాభాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన ఎపిసోడ్ ఫస్టాఫ్‌ను భావోద్వేగంగా మార్చేస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు ఓ చక్కటి ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా దర్శకుడు సఫలమయ్యాడనిపిస్తుంది.
సెకండాఫ్‌లో రుదంగ్రిని భీమ్ రావు వశపరుచుకోవడమనే ఎపిసోడ్ కొంత సాగదీసినట్టు ఉంటుంది. కానీ సెకండాఫ్‌లో స్క్రీన్ పై కనిపించే ప్రతీ క్యారెక్టర్ కూడా మంచి ఫీల్‌ను, ఎమోషన్స్‌ను అందిస్తాయి. సన్నివేశాలు చకచకా సాగిపోతుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాలు అత్యంత ఎమోషనల్‌గా సాగుతాయి.

రాజన్న, బాహుబలి, RRR చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేసిన అజయ్ సామ్రాట్ దర్శకుడిగా రుద్రంగి కథను రాసుకొన్న విధానం బాగుంది. నాసిరకమైన సన్నివేశాలు లేకుండా, పేలవమైన కథనం లేకుండా పకడ్బందీగా ఆది నుంచి అంతం వరకు గ్రిప్పింగ్‌గా కథను చెప్పడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. రుద్రంగి కథకు కావాల్సిన పాత్రలను రాసుకొన్న విధానం, ఆ పాత్రలకు నటీనటుల ఎంపిక అతడి విజన్‌కు ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోశాయని చెప్పవచ్చు.
నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే.. భీమ్ రావుగా జగపతి బాబు నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. పాత్రకు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్, తన ఆహార్యానికి తగినట్టుగా మేనరిజమ్‌తో పాత్రను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పిన తీరు ఆకట్టుకొన్నది. జ్వాలా భాయిగా మమతా మోహన్ దాస్‌కు తెలుగులో కమ్ బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. జ్వాలా భాయిగా తన పాత్రను ఆమె అద్బుతంగా పండించారు. విమలారామన్ చాలా ఎమోషనల్ పాత్రతో హృదయాన్ని టచ్ చేస్తారు.
ఇక రుద్రంగి పాత్ర చుట్టే కథ తిరుగడంతో కీలకమైన మారిన రోల్‌లో గనవి లక్ష్మణ్ అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో సెకండాఫ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఇక మల్లేష్‌గా ఆశీష్ గాంధీ జగపతి బాబుతో పోటీ పడి నటించాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఆశీష్ యాక్టింగ్ బాగుంది. కరణంగా సదయ్య మంచి వినోదాన్ని అందించాడు. సదయ్య పాత్ర సినిమాకు మంచి రిలీఫ్‌లా ఉంటుంది. దివి వద్యా స్పెషల్ సాంగ్‌కే పరిమితమయ్యారు.
రుద్రంగి సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఆర్టిస్టుల మూడ్ కెమెరాలో బంధించిన విధానం, సన్నివేశాల్లో ఎమోషన్స్ పండించడానికి వాడుకొన్న కలర్ ప్యాటర్న్ సినిమాను రిచ్‌గా మార్చాయి. నాఫల్ రాజా అందించిన సంగీతం సినిమాను మరింత ఎలివేట్ చేసింది. హిందీ పాత పాటలతో సన్నివేశాలను ఎమోషనల్‌గా, ఫీల్‌గుడ్‌గా మార్చారని చెప్పవచ్చు. ఇక ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి కత్తెర చాలా షార్ప్‌గా కనిపించింది. సన్నివేశాలను చకచకా పరుగులు పెట్టించడంలో తన నాగేశ్వర్ రెడ్డి తన ప్రతిభను చాటుకొన్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్, ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎమ్మెల్యే రసమయి నిర్మాతగా మారి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలంగాణ యాస, భాష, చరిత్రతో సినిమాను అందించాలనే తపన రసమయి బాలకిషన్‌లో కనిపించింది.
అకృత్యాలకు, అన్యాయాలకు నిలయమైన తెలంగాణ గడి సంస్కృతిని బొందపెట్టి వాటిని గుడిగా మార్చిన ఓ ఎమోషనల్ కథగా రుద్రంగి రూపొందింది. ఒకప్పటి సామాజిక పరిస్థితులు, దొరల జులుంను కళ్లకు కట్టినట్టు దర్శకుడు అజయ్ మోహన్ చూపించాడు. నటీనటులు యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితనం ఈ సినిమాకు బాహుబలి లాంటి ఫ్లేవర్ తెచ్చిందని చెప్పవచ్చు. పిరియాడిక్ యాక్షన్ డ్రామా మిమ్మల్ని కొత్త అనుభూతికి గురిచేస్తుంది. ఎలాంటి అంచనాలతో వెళ్లినా మీకు మంచి సంతృప్తిని అందిస్తుంది.


Click it and Unblock the Notifications











