Rudrudu Review రొటీన్, రెగ్యులర్ రివేంజ్ డ్రామా రుద్రుడు.. రాఘవ లారెన్స్‌కు హిట్టా? ఫట్టా?
నటీనటులు: రాఘవ లారెన్స్, ఆర్ శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమా భాగ్యరాజ్, నాజర్, రెడిన్ కింగ్స్‌లే, కాళి వెంకట్ తదితరులు
దర్శకత్వం: కదిరేషన్
రచయిత: కేపీ తిరుమారన్
సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
ఎడిటింగ్: ఆంథోని
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్, ధరణ్ కుమార్, ఓఫ్రో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సామ్ సీఎస్
బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ
రిలీజ్ డేట్: 2023-04-14
రుద్రుడు కథ ఏమిటంటే? :సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రుద్ర (రాఘవ లారెన్స్)కు తల్లి అంటే పంచప్రాణాలు. అనన్య (ప్రియా భవానీ శంకర్)ను తొలి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. ఇతరులకు సాయం చేయబోయి కష్టాల్లో ఇరుక్కొన్న తండ్రి (నాజర్) గుండెపోటుతో మరణిస్తాడు. తల్లికి ఎలాంటి కష్టం రాకుండా చూపుకోవాలనే కోరికతో రుద్ర లండన్ వెళ్తాడు. అయితే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి హఠాత్తుగా మరణించడం, గర్బవతిగా ఉన్న అనన్య అదృశ్యం కావడంతో ఇండియాకు తిరిగి వస్తాడు.

రుద్రుడు కథలో ట్విస్టులు:రుద్ర తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మరణించింది? కనిపించకుండా పోయిన భార్య ఆచూకీ లభించిందా? తల్లి మరణానికి కారణం ఏమిటి? భార్య కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? తన జీవితంలో దారుణమైన పరిస్థితులకు భూమి (శరత్ కుమార్) ఎలా కారణం అయ్యాడు? రుద్ర కుటుంబంపై భూమి ఎందుకు కన్నేశాడు? తన కుటుంబాన్ని దూరం చేసిన భూమిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? సాధారణమైన వ్యక్తిగా ఉండే రుద్ర.. వీర రుద్రుడిగా ఎలా మారాడు అనే ప్రశ్నలకు సమాధానమే రుద్రుడు సినిమా కథ.
రుద్రుడు ఫస్టాఫ్ ఎలా ఉందంటే? :రుద్రుడు సినిమా విషయానికి వస్తే.. 1980లో కూడా అనుసరించని స్క్రీన్ ప్లే, కథతో దర్శకుడు కదిరేషన్ భారీ సాహసమే చేశాడని సినిమా ఆరంభమైన 10 నిమిషాల్లోనే బోధపడుతుంది. మితీ మీరిన హింసతో ఫైట్.. ఆ తర్వాత పాట.. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్.. రిపీట్ మోడ్‌లో అత్యంత పరమ రొటీన్‌గా కథ సాగుతుంది. అలాంటి రెగ్యులర్ స్క్రీన్ ప్లే, రొటీన్ సన్నివేశాలతో ఇంటర్వెల్ వరకు లాగించే ప్రయత్నం చేశాడు.

సెంటిమెంట్‌తో రుద్రుడు సెకండాఫ్:ఇక రుద్రుడు సెకండాఫ్‌లోనైనా ఏదైనా బెటర్ కంటెంట్ ఉంటుందా? అంటే.. మితీమీరిన హింస, అర్ధం పర్థం లేని యాక్షన్ ఎపిసోడ్స్, ఊహకు అందని విధంగా ఫైట్స్ సీక్వెన్సెస్‌తో తెరను దర్శకుడు భీభత్సంగా మార్చిపడేశాడు. సెకండాఫ్‌లో కొంత మదర్, వైఫ్ సెంటిమెంట్‌ను జోడించడంతో అప్పటి వరకు సాగిన రక్తప్రవాహానికి అడ్డుపడిందని చెప్పవచ్చు. తల్లిదండ్రులను ఇండియాలో వదిలేసి.. వారిని అనాధలుగా మార్చే కొడుకులు అనే మంచి పాయింట్‌ను మరో విధంగా చెప్పి ఉంటే.. తప్పకుండా మంచి సెంటిమెంట్ ఉన్న సినిమా అయ్యేదనిపిస్తుంది.
రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ గురించి:రాఘవ లారెన్స్ నటన, బాడీ లాంగ్వేజ్ విషయానికి వస్తే.. ఏదీ కొత్తగా ఉండదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చూసినట్టే రుద్రుడు సినిమాలో నటించాడు. చైల్డ్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్‌తో కూడిన సన్నివేశాల్లో కొంత భావోద్వేగానికి గురి చేసే ప్రయత్నం చేశాడు. కథలో రక్తపాతాల మధ్య ప్రియా భవానీ శంకర్ చాలా ఫ్రెష్‌గా కనిపించింది. హ్లోమ్లీ క్యారెక్టర్‌తో ఉన్నంత సేపు మంచి ఫీల్ కలిగించింది. శరత్ కుమార్‌ను విలన్‌గా ఊహించుకోవడానికి చాలా కష్టమైంది. ఆయన విలనిజాన్ని జీర్ణించుకోవడానికి మరీ మరీ కష్టమైంది. ఇతర పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఫర్యాలేదనిపించాడు.

రుద్రుడులో టెక్నికల్ అంశాలు:ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. పక్కా ఊరమాస్, రొటీన్, రెగ్యులర్ కథ కావడంతో టెక్నిషియన్స్‌కు పెద్దగా పనిలేకుండా పోయింది. వారు కూడా వైవిధ్యం చూపించలేకపోయారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, మ్యూజిక్ అంతంతా మాత్రమే. ఒకట్రెండు పాటలు ఫర్వాలేదనిపించినా.. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత గుర్తుంచుకోవడమే కష్టంగా మారింది. రీరికార్డింగ్ విషయానికి వస్తే.. అవసరం లేని ఫైట్లకు డబ్బలో గులకరాళ్లు వేసినట్టు సౌండ్ పొల్యూషన్‌లా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అంతంతా మాత్రమేగా ఉన్నాయి.
రుద్రుడు సినిమా చూడవచ్చా? :మదర్, వైఫ్, చైల్డ్ సెంటిమెంట్‌తో రెగ్యులర్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లేతో రూపొందించిన చిత్రం రుద్రుడు. టైటిల్‌కు తగినట్టే ప్రేక్షకులపై రాఘవ లారెన్స్ రుద్ర తాండవం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. సీన్లలో పేరుకుపోయిన హింస, జరిగే రక్తపాతం ఒళ్లు జలదరింపజేస్తుంది. ఎలాంటి పాజిటివ్ అంశాలు లేని చిత్రం రుద్రుడు. రాఘవ లారెన్స్ ఫ్యాన్స్ చూడాలనుకొంటే.. ఓటీటీలో వచ్చే వరకు వేచి చూడండి. ఈ సినిమాకు ఎంత దూరం ఉంటే అంత మంచిందనేది ఉచిత సలహా. అయినా చూడాలనుకొంటే.. మీరు తప్పకుండా ఎప్పుడు పొందని డిఫరెంట్ అనుభూతిని పొందడం ఖాయం.
ట్యాగ్‌లైన్: ప్రేక్షకులపై లారెన్స్ రుద్రతాండవం


Click it and Unblock the Notifications











