Saakini Daakini review నివేదా థామస్, రెజీనా కసండ్రా ఫెర్ఫార్మెన్స్ హైలెట్.. కానీ.. !
నటీనటులు: నివేదా థామస్, రెజీనా కసండ్రా, లహరి షారీ, జాన్సన్ డీఎం, రవికుమార్ అనేజా తదితరులు
దర్శకుడు: సుధీర్ వర్మ
నిర్మాతలు: డీ సురేష్ బాబు, సునీత తాటి
స్క్రీన్ ప్లే, డైలాగ్: అక్షయ్ పూళ్ల
నిర్మాత: డీ సురేష్ బాబు
మ్యూజిక్: మికీ మాక్ క్లియరీ
సినిమాటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: విప్లవ్ నైషదం
ఆర్ట్: గాంధీ నదికుడికర్
స్టంట్స్: వెంకట్
రిలీజ్ డేట్: 2022-09-16

షాలిని అలియాస్ శాకిని ( నివేదా థామస్), దామిని అలియా డాకిని ( రెజీనా కసండ్రా) పోలీసు ఉద్యోగం అంటే చెప్పలేనంత ఇష్టం. పోటీ పరీక్షలో విజయం సాధించి పోలీస్ అకాడమీలో ట్రైనింగ్‌లో చేరుతారు. హాలీడే సందర్భంగా బయటకు వచ్చిన ఈ ఇద్దరికి కిడ్నాప్ సంఘటన ఎదురు పడుతుంది. ఆ సమయంలో అమ్మాయిలను కిడ్నాప్ చేసి మెడికల్ మాఫియా చేస్తున్న దారుణాలను ప్రత్యక్షంగా చూస్తారు. ఓ దశలో కిడ్నాప్ గురైన షాలిని, దామిని మెడికల్ మాఫియాపై పోరాటం సాగిస్తారు.
కిడ్నాప్ గురవుతున్న అమ్మాయిలపై ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు? షాలిని, దామిని మెడికల్ మాఫియాను ఎలా ఎదురించారు? చివరికి పోలీసు విభాగం అనుమతి లేకుండా మెడికల్ మాఫియా ఆటకట్టించడం వల్ల షాలిని, దామినిక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు షాలిని, దామినికి పోలీసులు నుంచి ఎలాంటి అనుభవం ఎదురైందనే ప్రశ్నలకు సమాధానమే షాకిని డాకిని సినిమా కథ.
షాకిని డాకిని సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్, ఫన్‌గా కథ సాగుతుంది. షాలిని, దామిని మధ్య చిరు గొడవలు ఆసక్తికరంగా సాగుతాయి. ఇక వీరిద్దరికి పృథ్వీ తోడవ్వడంతో మరింత ఫన్ క్రియేట్ అవుతుంది. ఇక సెకండాఫ్‌లో అమ్మాయిల కిడ్నాప్ విషయంతో సీరియస్‌గా మారుతుంది. ఫెర్టిలిటి కోసం ఇంజెక్షన్లను ఇవ్వడం, సంతాన ఫలదీకరణకు పనికి రాని అమ్మాయిల నుంచి అవయవాలు తీసుకొని చంపేయడం లాంటి అంశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. నివేదా, రెజీనా ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టారు.
ఇప్పటి మాదిరిగానే నివేదా థామస్, రెజీనా కసండ్రా తన ప్రతిభను చాటుకొన్నారు. ఒకరికొకరు పోటీ పడి నటించారు. యాక్షన్ సీన్లలో హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా మంచి ఎనర్జీతో స్టంట్స్ ప్రదర్శించారు. నటనపరంగా వారిని వంక పెట్టాల్సిన అవసరం రాలేకపోయింది. కబీర్ ఖాన్ పాత్ర మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సింది.
సాంకేతిక విషయాలకు వస్తే.. సుధీర్ వర్మ అంటే చాలా అంచనాలు ఉంటాయి. కానీ తెలుగు ప్రేక్షకుల అంచనాలను సుధీర్ చేరుకోలేక నిరాశపరిచారు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే డెఫినెట్‌గా మంచి యాక్షన్ మూవీ అయ్యేదనిపిస్తుంది. స్టంట్స్ వెంకట్, మ్యూజిక్ మికీ, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి, ఇతర సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది. యాక్షన్ సీన్లు హైలెట్‌గా ఉన్నాయి.
శాకిని డాకిని చిత్రం కొరియా భాషలో విజయవంతమైన మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాకు రీమేక్‌గా రూపొందించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు. అయితే కొన్నిసార్లు వెంకీ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలను ప్రభావవంతంగా తెరకెక్కించడం ఈ సినిమాకు మైనస్. నివేదా థామస్, రెజీనా అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది. యాక్షన్ చిత్రాలను ఆదరించే వారికి కూడా ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.


Click it and Unblock the Notifications











